కలివికోడిని చూసేందుకు వచ్చా... ఇంగ్లాండ్ దేశస్తుడు షాన్ కోయల్
సిద్దవటం: ప్రపంచంలోని కొన్ని అరుదైన ప్రదేశాలు, పక్షులను చూసేందుకు వచ్చానని ఇంగ్లాండ్ దేశానికి చెందిన షాన్‌కోయల్ తెలిపారు. లంకమల్ల అడవుల్లో అరుదైన పక్షి అయిన కలివికోడిని చూడాలని ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు. సిద్దవటం అటవీ శాఖ కార్యాలయంలో ఆయన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఓబులేస్‌తో ఆదివారం మాట్లాడారు. అనంతరం విలేకరులకు వివరాలు వెల్లడించారు. తాను స్కాట్‌లాండులో పక్షుల శాస్త్రవేత్తగా పని చేస్తున్నానన్నారు. పక్షులను చూసేందుకు ఇంగ్లాండ్ నుంచి ఫిబ్రవరి 21న బయలుదేరానని చెప్పారు. మాంచిస్టర్, కొలంబో ప్రాంతాలను మార్చి 2 వరకు చూశానన్నారు. తర్వాత ఇండియాలోని కేరళ, కర్ణాటక, ఊటీ, పూణెను చూసి.. తిరుపతి, కడప, బద్వేలు, సిద్దవటం ప్రాంతాలకు చేరుకున్నానని చెప్పారు. ఇప్పటి వరకు 330 రకాల పక్షులను చూశానన్నారు. ఇండియన్ వెబ్‌సైట్‌లో చూసి ఇక్కడ అరుదైన పక్షి కలివికోడిని చూడటానికి వచ్చానని పేర్కొన్నారు. అనంతరం ఫారెస్ట్ అధికారి కార్యాలయంలో ఆల్బమ్ పరిశీలించారు.