ఆ ముగ్గురిపై ఈసీబీ విచారణ
లండన్: ఓవల్ పిచ్‌పై మూత్ర విసర్జన చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు కెవిన్ పీటర్సన్, స్టువర్ట్ బ్రాడ్, జిమ్మీ అండర్సన్‌లపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది. యాషెస్ సిరీస్ గెలిచిన ఆనందంలో ఆదివారం మ్యాచ్ ముగిసిన అనంతరం వీరు ఇలాంటి చర్యకు దిగినట్టు ఆసీస్ జర్నలిస్టులు ఆరోపించారు. ఈసీబీ అధికారులు ఇప్పటికే సర్రే కౌంటీ టీమ్ అధికారులతో మాట్లాడుతున్నారని, ఈ ఘటనపై క్షమాపణలు చెప్పాలని వారు ఈసీబీని కోరుతున్నట్టు ఓ పత్రిక పేర్కొంది.
వారిది అహంకారపూరిత చర్య: వార్న్
పురాతన ఓవల్ పిచ్‌పై మూత్రవిసర్జన చేయడం వారి అమర్యాదకు నిదర్శనమని స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ దుయ్యబట్టాడు. ‘ఇలా చేసుండాల్సింది కాదు. ఇది అనవసరమైన చర్యే కాకుండా ఆ ఆటగాళ్ల అహంకార వైఖరిని తెలుపుతుంది. ఈ రోజుల్లో మన ప్రవర్తనపై ప్రజలు తీర్పునిస్తున్నారు. అందుకే ఎలాంటి సంబరాలైనా డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం కావాలి. జట్టు సభ్యులతో అక్కడ ఎంత తాగినా బయటికి రాదు’ అని వార్న్ సూచించాడు.