the authorities
-
పడకేసిన మంచినీటి పథకాలు
మూడో వంతు పథకాల నుంచి అందని నీరు ప్రజల అవసరాల మేరకు లేని కుళాయిలు నీటి కోసం మహిళలకు తప్పని పాట్లు అక్కరకురాని బోరు బావులు అనకాపల్లి రూరల్, న్యూస్‌లైన్ : దాదాపు లక్ష జనాభా ఉన్న అనకాపల్లి పట్టణంలో 64 మంచినీటి పథకాలున్నాయి. చెప్పుకోదగ్గ సంఖ్యలోనే కుళాయిలు ఏర్పాటు చేశారు. బోరు బావులకు లోటు లేదు. కానీ పట్టణ వాసుల గొంతు మాత్రం ఎండుతోంది. మూడో వంతు పథకాలు మూలకు చేరడం, ఉన్న కుళాయి పాయింట్ల నుంచి సరిపడే స్థాయిలో నీరందక పోవడం, బోరుబావులున్నా సరిగా అక్కరకు రాకపోవడంతో ప్రజలకు మంచినీటి కష్టాలు తీరడం లేదు. పట్టణం జీవీఎంసీలో విలీనమైతే తమ కష్టాలు తీరుతాయని భావించిన పట్టణ వాసులకు నిరాశే మిగిలింది. మన్సిపాలిటీగా ఉన్నప్పుడే పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేదని ప్రజలు భావిస్తున్నారంటే వారనుభవిస్తున్న వెతలను అర్థం చేసుకోవచ్చు. మొత్తం మంచినీటి పథకాల్లో 20 వరకు పనిచేయడం లేదు. మినీ ట్యాంకుల కోసం ఏర్పాటు చేసిన మోటార్లు పనిచేయక పోవడం, కొన్నిచోట్ల పైపులు శిథిలావస్థకు చేరడం సమస్యకు కారణం. గొల్లవీధి, వేల్పులవీధి, కాయగూరల మార్కెట్, గాంధీబొమ్మ నాయబ్రాహ్మణ వీధి, గవరపాలెం సంతోషిమాత కోవెల వద్ద, ఏఎంసీ కాలనీ మాధవ్ సదన్, దాసరిగెడ్డ తదితర ప్రాంతాల్లో ఉన్న మంచినీటి పథకాలు మూలకు చేరాయి. దీంతో ఈ ప్రాంతానికి సక్రమంగా నీరు సరఫరాకాక స్థానికులు అవస్థలు పడుతున్నారు. కుళాయిల ద్వారా నీరు విడుదల చేస్తున్నా స్థానికుల అవసరాలకు సరిపోవడం లేదు. వేసవి ఎద్దడి సమయంలో ట్యాంకులతోనైనా మంచినీటిని సరఫరా చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. బోరు బావులున్నా చాలా వరకు మూలకు చేరడం, మిగిలినవి అక్కరకు రాకపోవడంతో మహిళలు మంచినీటి కోసం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. యథేచ్ఛగా నీటి వృథా ఓవైపు కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న నీరు సరిపోవడం లేదని ప్రజలు వాపోతుంటే, ఉన్న కుళాయిల నుంచి ఎక్కడికక్కడ నీరు వృథా అవుతుండడం మరో సమస్యగా మారింది. చాలా కుళాయిలకు హెడ్స్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కొనే సమయంలోనైనా నీటి వృథాను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. ట్యాంకు పనిచేయడం లేదు నెల రోజుల నుంచి మంచినీటి ట్యాంకు పని చేయడం లేదు. అధికారులెవ్వరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వీధి కుళాయిలు దెబ్బతినడంతో నీరు వృథాగా పోతోంది. అధికారులు స్పందించి మంచినీటి ట్యాంకును బాగు చేయాలి. - ఎస్.సంతోషి, గొల్లవీధి -
మాకేదీ ఉపాధి హమీ..?
25 గిరిజన గ్రామాల్లో కానరాని ఉపాధి పనులు ఎండుతున్న డొక్కలు కడుపు నింపుకునేందుకు రోజ్ఉడ్ అమ్మకాలు కొయ్యూరు, న్యూస్‌లైన్ : వలసలు నిరోధించేందుకు, పేదరికాన్ని తొలగించేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం మారు మూల గిరిజనులకు చేరడం లేదు. రెక్కల కష్టం చేద్దామంటే పనులు లేకపోవడంతో ఆదివాసీలు డొక్కలు ఎండిపోతున్నాయి. దీంతో నేరం నాది కాదుఆకలిది అన్నట్లుగా వారు అడవిలో దొరికే రోజ్‌వుడ్‌ను అమ్ముకుంటున్నారు. మూడేళ్లుగా ఉపాధి పనులు లేకపోవడంతో యూ.చీడిపాలెం పంచాయతీలోని పలు గ్రామాల నుంచి ఏటా 500 మంది వరకు పొట్టచేత బట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. మండల కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో యూ.చీడిపాలెం పంచాయతీ ఉంది. దీనిలో పాతిక గ్రామాలున్నాయి. అయితే ఈ పల్లెల్లో 2011నుంచి ఉపాధి హామీ పథకం అమలు కావడంలేదు. ఏదో కారణంతో నాటి వీఆర్పీని తొలగించారు.అప్పటి నుంచి అక్కడ వీఆర్పీ లేరు.దీంతో పనులు ఆగిపోయాయి. ఫలితంగా గిరిజనులు పనులు లేక ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు.పంచాయతీలో పది ఆదివాసీ గ్రామాలున్నాయి. వారికి పనులు లేకపోవడంతో దగ్గరలో ఉన్న అడవి నుంచి రోజ్ఉడ్ ముక్కలను తీసుకువస్తున్నారు.వారమంతా కష్టపడితే చేతికి రూ.వెయ్యి వరకు డబ్బులు వస్తాయి. అందులోనూ అప్పుడప్పుడు అధికారులు దాడులు చేసి కొంత లాక్కుంటుంటారు. అదే ఉపాధి పనులు ఉండి ఉంటే ఏ గిరిజనుడు కూడా ముక్కలు అమ్ముకునే పరిస్థితి ఉండదు. కొయ్యూరు మండలానికి అటవీ శాఖ అధికారి ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్నా ఫలితం శూన్యం. శ్రమశక్తి సంఘాలు లేక అవస్థలు ఎక్కడైనా ఉపాధి పనులు నిర్వహించాలంటే శ్రమశక్తి సంఘాలు ఉండాలి. అతతే యూ.చీడిపాలెంలో అలాంటి సంఘాలు లేవు.అవి లేవన్న సాకుతో అధికారులు పనులు ఇవ్వడం లేదు. అయితే ఆ సంఘాలను ఏర్పాటు చేయాల్సిన అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీఆర్పీలు లేని చోట్ల సీనియర్ మేట్లను వీఆర్పీలుగా తీసుకుంటారు. అక్కడ అది కూడా జరగడం లేదు. దీనిపై ఉపాధి హామీ చింతపల్లి ఏపీడీ నాగేశ్వరరావును వివరణ కోరగా త్వరలో అక్కడ పనులు ప్రారంభిస్తామన్నారు. -
శాటిలైట్ స్టేషన్ల ఏర్పాటు కలేనా?
నిధుల కొరతే ప్రధాన అడ్డంకి ముందుకు కదలని ప్రతిపాదనలు బెజవాడ స్టేషన్‌కు తప్పని రద్దీ సాక్షి, విజయవాడ : దక్షిణ భారతదేశంలోనే కీలక రైల్వే జంక్షన్‌గా ఉన్న విజయవాడలో శాటిలైట్ స్టేషన్ల అభివృద్ధి కలగానే మిగులుతోంది. ఈ స్టేషన్‌కి ఉన్న రద్దీని తట్టుకునేందుకు ప్రత్యామ్నాయంగా శాటిలైట్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని 2010లో రైల్వే శాఖ నిర్ణయించింది. దీనికోసం గుణదల, సింగ్‌నగర్, రాయనపాడు ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు స్థలాల పరిశీలన కూడా జరిగింది. నిధుల కొరత కారణంగా ఇది ఆచరణకు నోచుకోలేదు. గత రెండేళ్లుగా రైల్వేలో అభివృద్ధి పనులకు కేటాయిస్తున్న బడ్జెట్ గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే టెండర్లు ఖరారైన పనులు కూడా నిధుల వెసులుబాటు చూసుకుని చేస్తున్నారు. ఈ తరుణంలో అదనపు నిధులు రాకుండా ఈ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. సరిపోని ప్లాట్‌ఫారాలు... విజయవాడ రైల్వేస్టేషన్లో పది ప్లాట్‌ఫారాలు ఉన్నా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నది మాత్రం ఏడే. ఈ స్టేషన్ మీదుగా రోజుకు 350 వరకు రైళ్లు, గూడ్స్‌లు ప్రయాణిస్తుంటాయి. రోజూ 180 వరకు పాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తుండగా అందులో ఎక్కువ భాగం రైళ్లను ఒకటి నుంచి ఏడు ప్లాట్‌ఫారాలపైకి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. దీంతో 8, 9, 10 ప్లాట్‌ఫారాలు బోసిపోతున్నాయి. 2004 పుష్కరాల సమయంలో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి ఈ ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేశారు. వీటికి గుంటూరు, తెనాలి, ఖాజీపేట నుంచి రైళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి ఖాజీపేట, విశాఖపట్నం వెళ్లే అవకాశం లేదు. దీంతో ప్రధానమైన రైళ్లన్నింటినీ ఒకటి నుంచి ఏడు ప్లాట్‌ఫారాలకే పరిమితం చేయాల్సి వస్తోంది. శివారు ప్రాంతాల్లో రైళ్లను రాత్రి వేళల్లో ఎటువంటి రక్షణ లేకుండా నిలపవడం ప్రమాదకరం. రాజరాజేశ్వరీపేట వంటి ప్రాంతంలో రైలును నిలిపిన సమయంలో ఎవరైనా దోపిడీకి పాల్పడినా పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎటువంటి ఘటనలూ జరగకపోవడం తమ అదృష్టమేనని రైల్వే అధికారులే అంగీకరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము చేయగలిగింది కూడా ఏమీ లేదని వారు చెబుతున్నారు. భవిష్యత్‌లో మరిన్ని రైళ్లు పెరిగే అవకాశం ఉండటంతో 8, 9, 10 ప్లాట్‌ఫారాలను కూడా పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడంతో పాటు శాటిలైట్ స్టేషన్ల ఏర్పాటు తప్పనిసరి కానుంది. శాటిలైట్ స్టేషన్ ఎందుకంటే.. శాటిలైట్ స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల కొన్ని రైళ్లను విజయవాడ జంక్షన్‌కు రాకుండా చేయవచ్చు. హౌరా, చెన్నై, ముంబై వంటి నగరాల్లో ఈ శాటిలైట్ స్టేషన్లు ఇప్పటికే వినియోగంలో ఉన్నాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే రైళ్లను విజయవాడ స్టేషన్‌కు రాకుండా శాటిలైట్ స్టేషన్ల అభివృద్ధి ద్వారా నేరుగా వెళ్లేలా చేయాలన్నది అధికారుల ప్రతిపాదన. ఇప్పటికే గూడ్స్ రైళ్ల కోసం ఉన్న లూప్‌లైన్‌ను పటిష్టపరచడం ద్వారా దీన్ని అమలు చేయవచ్చని భావించిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. విజయవాడ డీఆర్ఎంగా అనురాగ్ ఉన్న సమయంలో ఆయన గుణదల స్టేషన్‌ను పరిశీలించి వచ్చారు. అక్కడ విస్తరణకు స్థలం సరిపోదని నిర్ణయించారు. అనంతరం సింగ్‌నగర్ ఫ్లైవోవర్ వద్ద దీన్ని ఏర్పాటు చేయడం కోసం పరిశీలించారు. మరో ప్రతిపాదనలో భాగంగా రాయనపాడు వద్ద రైల్వే స్థలం కావాల్సినంత ఉండటంతో అక్కడ ఏర్పాటు కోసం పరిశీలన జరిపారు. ఈ ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపారు. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే రైలు విజయవాడ స్టేషన్లోకి వచ్చిన తర్వాత ఇంజన్ వెనక్కి మార్చి మళ్లీ వెనక్కి పంపాల్సి ఉంటుంది. దీనివల్ల 20 నిమిషాల సమయం వృథా అవుతోంది. అదే శాటిలైట్ స్టేషన్లు అభివృద్ధి అయితే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు రైల్వే జంక్షన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపి వచ్చే బడ్జెట్లోనైనా వీటికి నిధులు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.