- 25 గిరిజన గ్రామాల్లో కానరాని ఉపాధి పనులు
- ఎండుతున్న డొక్కలు
- కడుపు నింపుకునేందుకు రోజ్‌ఉడ్ అమ్మకాలు
కొయ్యూరు, న్యూస్‌లైన్ : వలసలు నిరోధించేందుకు, పేదరికాన్ని తొలగించేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం మారు మూల గిరిజనులకు చేరడం లేదు. రెక్కల కష్టం చేద్దామంటే పనులు లేకపోవడంతో ఆదివాసీలు డొక్కలు ఎండిపోతున్నాయి. దీంతో నేరం నాది కాదుఆకలిది అన్నట్లుగా వారు అడవిలో దొరికే రోజ్‌వుడ్‌ను అమ్ముకుంటున్నారు. మూడేళ్లుగా ఉపాధి పనులు లేకపోవడంతో యూ.చీడిపాలెం పంచాయతీలోని పలు గ్రామాల నుంచి ఏటా 500 మంది వరకు పొట్టచేత బట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు.
మండల కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో యూ.చీడిపాలెం పంచాయతీ ఉంది. దీనిలో పాతిక గ్రామాలున్నాయి. అయితే ఈ పల్లెల్లో 2011నుంచి ఉపాధి హామీ పథకం అమలు కావడంలేదు. ఏదో కారణంతో నాటి వీఆర్‌పీని తొలగించారు.అప్పటి నుంచి అక్కడ వీఆర్‌పీ లేరు.దీంతో పనులు ఆగిపోయాయి. ఫలితంగా గిరిజనులు పనులు లేక ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు.పంచాయతీలో పది ఆదివాసీ గ్రామాలున్నాయి. వారికి పనులు లేకపోవడంతో దగ్గరలో ఉన్న అడవి నుంచి రోజ్‌ఉడ్ ముక్కలను తీసుకువస్తున్నారు.వారమంతా కష్టపడితే చేతికి రూ.వెయ్యి వరకు డబ్బులు వస్తాయి. అందులోనూ అప్పుడప్పుడు అధికారులు దాడులు చేసి కొంత లాక్కుంటుంటారు. అదే ఉపాధి పనులు ఉండి ఉంటే ఏ గిరిజనుడు కూడా ముక్కలు అమ్ముకునే పరిస్థితి ఉండదు. కొయ్యూరు మండలానికి అటవీ శాఖ అధికారి ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్నా ఫలితం శూన్యం.
శ్రమశక్తి సంఘాలు లేక అవస్థలు
ఎక్కడైనా ఉపాధి పనులు నిర్వహించాలంటే శ్రమశక్తి సంఘాలు ఉండాలి. అతతే యూ.చీడిపాలెంలో అలాంటి సంఘాలు లేవు.అవి లేవన్న సాకుతో అధికారులు పనులు ఇవ్వడం లేదు. అయితే ఆ సంఘాలను ఏర్పాటు చేయాల్సిన అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీఆర్‌పీలు లేని చోట్ల సీనియర్ మేట్లను వీఆర్‌పీలుగా తీసుకుంటారు. అక్కడ అది కూడా జరగడం లేదు. దీనిపై ఉపాధి హామీ చింతపల్లి ఏపీడీ నాగేశ్వరరావును వివరణ కోరగా త్వరలో అక్కడ పనులు ప్రారంభిస్తామన్నారు.