the Forest Department
-
ఆ దుప్పిని వండుకు తినేశారు!
నెల్లిమర్ల: సుమారు 15 రోజుల క్రితం నెల్లిమర్ల పట్టణంలోకి ప్రవేశించిన దుప్పి ఏమైంది? అటవీశాఖ అధికారులే దానిని చంపి మాంసంతో విందు చేసుకున్నారా? లేదంటే తమ ఉన్నతాధికారులకు గాని, ప్రజాప్రతినిధులకు గాని కానుకగా ఇచ్చి స్వామిభక్తిని చాటుకున్నారా?... స్థానికుల ఆరోపణలు, అటవీశాఖ అధికారుల పొంతన లేని సమాధానాలను బట్టి దుప్పిని వారే చంపి వండుకు తినేశారని స్పష్టమవుతోంది. వివరాల్లోకి వెళితే.. నెల్లిమర్ల పట్టణానికి సమీపంలో ఉన్న కొండపైనుంచి సుమారు 15 రోజుల క్రితం 60 కిలోల బరువున్న ఓ దుప్పి జనారణ్యంలోకి ప్రవేశించింది. ముందుగా రామతీర్ధం జంక్షన్ పాఠశాలలోకి ప్రవేశించి అనంతరం రోడ్డు మీద పరుగులు పెట్టిన దుప్పిని స్థానికులు పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఫారెస్ట్ బీట్ అధికారి కేవిఎన్ రాజు ఆ దుప్పిని ఓ ఆటోలో పూల్‌బాగ్‌లో ఉన్న అటవీశాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ దుప్పికి ప్రథమ చికిత్స అందించినట్లు విలేకరులకు సమాచారమందించారు. తర్వాత విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శన శాలకు అప్పగించినట్లు ఒకసారి, గంట్యాడ మండలంలోని పెదమజ్జిపాలెంను ఆనుకుని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్‌కు తరలించినట్లు మరోసారి, అడవిలోకి తరలిస్తుండగా మరణించిందని మరోసారి చెప్పడంతో అనుమానాలు మొదలయ్యాయి. దుప్పిని అటవీశాఖ అధికారులే చంపేసి దాని మాంసంతో విందు చేసుకున్నట్లు స్థానికులు ఆరోపించారు. స్వామిభక్తిని చాటుకునేందుకు బడా ప్రజాప్రతినిధులకు అప్పగించినట్లు మరికొంతమంది చెప్పారు. దీనిపై రేంజర్ లక్ష్మీనరసింహంను వివరణ కోరగా నెల్లిమర్లనుంచి తీసుకొచ్చిన దుప్పిని అడవిలోకి తరలిస్తుండగా అదే రోజు చనిపోయిందన్నారు. ఆధారాలు చూపించమని కోరగా వేరే ఉద్యోగి దగ్గర ఉన్నాయని నీళ్లు నమిలారు. కాగా వన్యప్రాణులను రక్షించాల్సిన అటవీశాఖ అధికారులే ఇలా చేస్తే ఎలాగని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపిస్తే దారుణానికి పాల్పడిందెవరో తేలుతుందని చెబుతున్నారు. -
ఔషధ నగరి.. పరిహారం కిరికిరి!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ముచ్చర్ల ఔషధనగరికి అడుగడుగునా చిక్కుముళ్లు ఎదురవుతున్నాయి. భూసేకరణ ప్రక్రియ కొలిక్కిరాకపోవడం ప్రాజెక్టు అంకురార్పణపై ప్రభావం చూపుతోంది. భూములు కోల్పోయే రైతాంగానికి పరిహారం చెల్లించే అంశంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఫార్మాసిటీకి పునాదిరాయి ఇప్పట్లో పడే అవకాశం కనిపించడంలేదు. ఔషధనగరి పనులు చకచకా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వస్థాయిలో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, పరిహారం చెల్లించే విషయంలో స్పష్టత వ చ్చేవరకు అడుగుముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడింది. దాదాపు 10,939 ఎకరాల్లో ఫార్మాసిటీని స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూములను సేకరించి టీఐఐసీకి అప్పగించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు కసరత్తు చేసిన జిల్లా అధికారులకు ప్రతిబంధకాలే ఎదురవుతున్నాయి. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఫార్మాసిటీతో నిర్వాసితులుగా మారే రైతాంగం నష్టపరిహారంపై బెట్టువీడడంలేదు. మరీ ముఖ్యంగా పట్టాదారులు కనీస ధర (మార్కెట్ వాల్యూ) కంటే అధికంగా మూడింతలు పరిహారం చెల్లిస్తేనే భూములు అప్పగిస్తామని భీష్మించారు. బహిరంగ మార్కెట్లో కూడా దాదాపు ఎకరాకు రూ.15 లక్షల వరకు ధర పలుకుతుండగా.. కేవలం ఏడున్నర లక్షలకు భూములను లాక్కోవడం సమంజసంకాదని వాదిస్తున్నారు. ముచ్చర్లలోని సర్వే నం.288లో రెవెన్యూ రికార్డు ప్రకారం 2,746 ఎకరాలు ఉండాల్సివుండగా, ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ (ఈటీఎస్) సర్వేలో 1,917 ఎకరాలు మాత్రమే తేలింది. ఇదే సర్వే నంబర్లో 381.32 ఎకరాల పట్టా భూములను 151 మంది సాగు చేసుకుంటున్నారు. మరో 293.20 ఎకరాలు 150 మందికి అసైన్డ్ చేశారు. వీరందరూ ప్రస్తుతం నష్టపరిహారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాల్సిందేనని పట్టాదారులు పట్టుబడుతుండడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో యంత్రాంగం పడిపోయింది. పట్టాదారులతో ఇప్పటికే పలుమార్లు సంప్రదింపులు జరిపినప్పటికీ ససేమిరా అంటుండడం.. సాధ్యమైనంత త్వరగా భూములను బదలాయించాలని టీఐఐసీ ఒత్తిడి పెంచుతుండడం రెవెన్యూ అధికారులకు చిరాకు కలిగిస్తోంది. మరోవైపు పట్టాదారులకు పరిహారం చెల్లించే విషయం కొలిక్కివస్తే.. అసైన్డ్‌దారులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించే అంశంపై అడుగు ముందుకేయాలని భావిస్తోంది. పట్టాలు పొందినా, కబ్జాలో లేన ందున పరిహారం ఇచ్చే విషయంలో తర్జనభర్జనలు పడుతోంది. అయితే, ప్రభుత్వం పొజిషన్ చూపకపోవడంతోనే అసైన్డ్‌దారులు కబ్జాలో లేరని, అది వారి తప్పుగా భావించడంలో అర్థంలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై స్పష్టత వస్తేకానీ భూసేకరణ సాఫీగా జరిగే అవకాశంలేదు. -
‘నిధుల మంజూరుకు ముఖ్యమంత్రికి విన్నవిస్తాం’
కోలారు : బెంగుళూరులోని కోరమంగల చల్లఘట్ట మురుగు నీటి శుద్ధీకరణ కేంద్రం నుంచి శుద్ధీకరించిన నీటిని కోలారుకు తీసుకు వచ్చే పథకానికి సంబంధించి డీపీఆర్ సిద్ధం చేయడానికి వెంటనే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రికి విన్నవిస్తామని జిల్లా కలెక్టర్ డీకే రవి తెలిపారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే జిల్లాధికారుల సమావేశానికి హజరవుతున్న సందర్భంగా శనివారం తన కార్యాలయంలో అధికారుల సమావేశం నిర్వహించారు. కోరమంగల చల్లఘట్ట మురుగునీటి శుద్ధీకరణ కేంద్రం నుంచి కోలారు చెరువులకు నీటిని అందించే పథకానికి డీపీఆర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. అయితే ఒకటిన్నర నెల గడిచినా ఆర్థిక శాఖ నుంచి డీపీఆర్ తయారీకి అవసరమైన నిధులు మంజూరు కాలేదు. దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతామన్నారు. అటవీశాఖ ముళబాగిలు తాలూకాలో నీలగిరి పెంచడానికి ముందుకు వస్తున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి నీలగిరి పెంచకుండా ఆదేశించాలని విన్నవిస్తామన్నారు. ఇదిలా ఉండగా తాలూకాలోని హొన్నేహళ్లి ఆర్డీపీఆర్ శిక్షణా కేంద్రం నిర్మాణానికి భూసేనా మండళికి రూ.50 లక్షల విడుదల చేసినా ఇంకా పనులు ప్రారంభించకపోవడంపై ఆ విభాగం అధికారిని కలెక్టర్ మందలించారు. తాలూకాలోని మద్దేరి వద్ద అటవీ శాఖ భూమి ఆక్రమణపై వెంటనే సర్వే జరిపి నివేదిక సమర్పించాలని అటవీశాఖ అధికారి జగదీష్‌కు సూచించారు. జిల్లాలో హాస్టల్, తాగునీటి సమస్య గురించి ముఖ్యమంత్రి సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ పెద్దప్పయ్య, జెడ్పీ సీఈఓ వినోద్ప్రియ తదితరులు ఉన్నారు. -
అటవీ గ్రామాల్లో తుపాకుల మోత
పోలీసులు జల్లెడ పట్టినా కనిపించని ఫలితం యథేచ్ఛగా వన్యప్రాణుల వేట కొంతమంది చేతివాటమే కారణమంటున్న గ్రామీణులు పలమనేరు, న్యూస్‌లైన్: పలమనేరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంత గ్రామాల్లో నాటు తుపాకుల మోత తగ్గడం లేదు. ఎన్నికల నేపథ్యంలో రెండు నెల లుగా పోలీసులు పెద్ద సంఖ్యలో తుపాకులను స్వా ధీనం చేసుకున్నారు. ఇంకా కొన్నిచోట్ల కాల్పులు జరుగుతుండడం అధికారులను కలవరానికి గురిచేస్తోంది. వేటగాళ్లు కౌండిన్య అడవిలో యథేచ్ఛగా వన్యప్రాణుల వేట సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పలమనేరు నియోజకవర్గానికి దక్షిణం వైపున కౌండిన్య అడవి విస్తరించి ఉంది. ఈ అడవిలో జింకలు, దుప్పులు, నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లు వేల సంఖ్యలో ఉన్నాయి. అందుకే వేటగాళ్ల కన్ను ఈ ప్రాంతంపై పడింది. పల మనేరు, బెరైడ్డిపల్లె, గంగవరం, వి.కోట మండలాల్లోని 40 అటవీ ప్రాంత గ్రామాల్లో 200 మంది నాటు తుపాకులు కలిగిన వేటగాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరు రాత్రిపూట వన్యప్రాణులను వేటాడుతున్నారు. తనిఖీలు చేస్తున్నా ఫలితం శూన్యం రెండు నెలల నుంచి పోలీసులు నాటు తుపాకులను జల్లెడ పడుతున్నారు. పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధి లో అత్యధికంగా 53, గంగవరంలో 30, పెద్దపంజాణిలో 20, బెరైడ్డిపల్లెలో 15, వి.కోటలో 7 తుపాకులను సీజ్ చేశారు. అయినప్పటికీ వేటగాళ్లు మాత్రం వేట సాగిస్తున్నారు. వీరికి తుపాకులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థంగాక అటవీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొందరు పోలీసుల చేతివాటం వల్లే పోలీసు శాఖలో కొంతమంది చేతివాటం వల్లే తుపాకులు వేటగాళ్ల చేతిలోకి వెళుతున్నాయన్న ఆరోపణలున్నాయి. స్వాధీనం చేసుకుంటున్నా మామూళ్లు ఇచ్చి విడిపించుకుంటున్నట్లు తెలుస్తోంది. పలమనేరు పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ పాత్ర ఇందులో ప్రధానంగా ఉన్నట్లు వినికిడి. ఇప్పటికైనా అటవీ శాఖ, పోలీసులు సంయుక్త సహకారంతో వేటగాళ్ల ఆట కట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
మాకేదీ ఉపాధి హమీ..?
25 గిరిజన గ్రామాల్లో కానరాని ఉపాధి పనులు ఎండుతున్న డొక్కలు కడుపు నింపుకునేందుకు రోజ్ఉడ్ అమ్మకాలు కొయ్యూరు, న్యూస్‌లైన్ : వలసలు నిరోధించేందుకు, పేదరికాన్ని తొలగించేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం మారు మూల గిరిజనులకు చేరడం లేదు. రెక్కల కష్టం చేద్దామంటే పనులు లేకపోవడంతో ఆదివాసీలు డొక్కలు ఎండిపోతున్నాయి. దీంతో నేరం నాది కాదుఆకలిది అన్నట్లుగా వారు అడవిలో దొరికే రోజ్‌వుడ్‌ను అమ్ముకుంటున్నారు. మూడేళ్లుగా ఉపాధి పనులు లేకపోవడంతో యూ.చీడిపాలెం పంచాయతీలోని పలు గ్రామాల నుంచి ఏటా 500 మంది వరకు పొట్టచేత బట్టుకుని ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. మండల కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో యూ.చీడిపాలెం పంచాయతీ ఉంది. దీనిలో పాతిక గ్రామాలున్నాయి. అయితే ఈ పల్లెల్లో 2011నుంచి ఉపాధి హామీ పథకం అమలు కావడంలేదు. ఏదో కారణంతో నాటి వీఆర్పీని తొలగించారు.అప్పటి నుంచి అక్కడ వీఆర్పీ లేరు.దీంతో పనులు ఆగిపోయాయి. ఫలితంగా గిరిజనులు పనులు లేక ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు.పంచాయతీలో పది ఆదివాసీ గ్రామాలున్నాయి. వారికి పనులు లేకపోవడంతో దగ్గరలో ఉన్న అడవి నుంచి రోజ్ఉడ్ ముక్కలను తీసుకువస్తున్నారు.వారమంతా కష్టపడితే చేతికి రూ.వెయ్యి వరకు డబ్బులు వస్తాయి. అందులోనూ అప్పుడప్పుడు అధికారులు దాడులు చేసి కొంత లాక్కుంటుంటారు. అదే ఉపాధి పనులు ఉండి ఉంటే ఏ గిరిజనుడు కూడా ముక్కలు అమ్ముకునే పరిస్థితి ఉండదు. కొయ్యూరు మండలానికి అటవీ శాఖ అధికారి ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్నా ఫలితం శూన్యం. శ్రమశక్తి సంఘాలు లేక అవస్థలు ఎక్కడైనా ఉపాధి పనులు నిర్వహించాలంటే శ్రమశక్తి సంఘాలు ఉండాలి. అతతే యూ.చీడిపాలెంలో అలాంటి సంఘాలు లేవు.అవి లేవన్న సాకుతో అధికారులు పనులు ఇవ్వడం లేదు. అయితే ఆ సంఘాలను ఏర్పాటు చేయాల్సిన అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీఆర్పీలు లేని చోట్ల సీనియర్ మేట్లను వీఆర్పీలుగా తీసుకుంటారు. అక్కడ అది కూడా జరగడం లేదు. దీనిపై ఉపాధి హామీ చింతపల్లి ఏపీడీ నాగేశ్వరరావును వివరణ కోరగా త్వరలో అక్కడ పనులు ప్రారంభిస్తామన్నారు.