కోలారు : బెంగుళూరులోని కోరమంగల చల్లఘట్ట మురుగు నీటి శుద్ధీకరణ కేంద్రం నుంచి శుద్ధీకరించిన నీటిని కోలారుకు తీసుకు వచ్చే పథకానికి సంబంధించి డీపీఆర్ సిద్ధం చేయడానికి వెంటనే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రికి విన్నవిస్తామని జిల్లా కలెక్టర్ డీకే రవి తెలిపారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే జిల్లాధికారుల సమావేశానికి హజరవుతున్న సందర్భంగా శనివారం తన కార్యాలయంలో అధికారుల సమావేశం నిర్వహించారు.
కోరమంగల చల్లఘట్ట మురుగునీటి శుద్ధీకరణ కేంద్రం నుంచి కోలారు చెరువులకు నీటిని అందించే పథకానికి డీపీఆర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. అయితే ఒకటిన్నర నెల గడిచినా ఆర్థిక శాఖ నుంచి డీపీఆర్ తయారీకి అవసరమైన నిధులు మంజూరు కాలేదు. దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతామన్నారు. అటవీశాఖ ముళబాగిలు తాలూకాలో నీలగిరి పెంచడానికి ముందుకు వస్తున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి నీలగిరి పెంచకుండా ఆదేశించాలని విన్నవిస్తామన్నారు.
ఇదిలా ఉండగా తాలూకాలోని హొన్నేహళ్లి ఆర్‌డీపీఆర్ శిక్షణా కేంద్రం నిర్మాణానికి భూసేనా మండళికి రూ.50 లక్షల విడుదల చేసినా ఇంకా పనులు ప్రారంభించకపోవడంపై ఆ విభాగం అధికారిని కలెక్టర్ మందలించారు. తాలూకాలోని మద్దేరి వద్ద అటవీ శాఖ భూమి ఆక్రమణపై వెంటనే సర్వే జరిపి నివేదిక సమర్పించాలని అటవీశాఖ అధికారి జగదీష్‌కు సూచించారు. జిల్లాలో హాస్టల్, తాగునీటి సమస్య గురించి ముఖ్యమంత్రి సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ పెద్దప్పయ్య, జెడ్పీ సీఈఓ వినోద్‌ప్రియ తదితరులు ఉన్నారు.
‘నిధుల మంజూరుకు ముఖ్యమంత్రికి విన్నవిస్తాం’
Published Sun, Oct 12 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM
Advertisement
Advertisement