Water Treatment
-
బీజీఆర్ ఎనర్జీ చేతికి ఏపీ పవర్ వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్టు
రూ.650 కోట్ల ఆర్డర్లు చెన్నై: ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) దిగ్గజం బీజీఆర్ ఎనర్జీ, వాటర్ ట్రీట్మెంట్ వ్యాపారంలోకి ప్రవేశించింది. రూ.650 కోట్ల విలువైన రెండు ఆర్డర్లను సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నంలో ఉన్న పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి రూ.210 కోట్ల ఆర్డర్‌ను సాధించామని బీజీఆర్ ఎనర్జీ తెలిపింది. ఈ ఆర్డర్లో భాగంగా 800 మెగావాట్ల మూడు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వివరించింది. ఇక చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ నుంచి రూ.440 కోట్ల ఆర్డర్‌ను పొందామని పేర్కొంది. ఈ ఆర్డర్లో భాగంగా చెన్నై సమీపంలోని కొడంగైయ్యూర్లో రోజుకు 45 మిలియన్ లీటర్ల సామర్థ్యమున్న టెర్షియరీ ట్రీట్మెంట్ రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వివరించింది. ఈ రెండు ఆర్డర్లతో తమ ఆర్డర్ల బుక్ విలువ రూ.10,425 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ ఆర్డర్ల నేపథ్యంలో బీఎస్ఈలో బీజీఆర్ ఎనర్జీ షేర్ 7 శాతం వృద్ధితో రూ.125కు ఎగసింది. -
‘నిధుల మంజూరుకు ముఖ్యమంత్రికి విన్నవిస్తాం’
కోలారు : బెంగుళూరులోని కోరమంగల చల్లఘట్ట మురుగు నీటి శుద్ధీకరణ కేంద్రం నుంచి శుద్ధీకరించిన నీటిని కోలారుకు తీసుకు వచ్చే పథకానికి సంబంధించి డీపీఆర్ సిద్ధం చేయడానికి వెంటనే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రికి విన్నవిస్తామని జిల్లా కలెక్టర్ డీకే రవి తెలిపారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే జిల్లాధికారుల సమావేశానికి హజరవుతున్న సందర్భంగా శనివారం తన కార్యాలయంలో అధికారుల సమావేశం నిర్వహించారు. కోరమంగల చల్లఘట్ట మురుగునీటి శుద్ధీకరణ కేంద్రం నుంచి కోలారు చెరువులకు నీటిని అందించే పథకానికి డీపీఆర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. అయితే ఒకటిన్నర నెల గడిచినా ఆర్థిక శాఖ నుంచి డీపీఆర్ తయారీకి అవసరమైన నిధులు మంజూరు కాలేదు. దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతామన్నారు. అటవీశాఖ ముళబాగిలు తాలూకాలో నీలగిరి పెంచడానికి ముందుకు వస్తున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి నీలగిరి పెంచకుండా ఆదేశించాలని విన్నవిస్తామన్నారు. ఇదిలా ఉండగా తాలూకాలోని హొన్నేహళ్లి ఆర్డీపీఆర్ శిక్షణా కేంద్రం నిర్మాణానికి భూసేనా మండళికి రూ.50 లక్షల విడుదల చేసినా ఇంకా పనులు ప్రారంభించకపోవడంపై ఆ విభాగం అధికారిని కలెక్టర్ మందలించారు. తాలూకాలోని మద్దేరి వద్ద అటవీ శాఖ భూమి ఆక్రమణపై వెంటనే సర్వే జరిపి నివేదిక సమర్పించాలని అటవీశాఖ అధికారి జగదీష్‌కు సూచించారు. జిల్లాలో హాస్టల్, తాగునీటి సమస్య గురించి ముఖ్యమంత్రి సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ పెద్దప్పయ్య, జెడ్పీ సీఈఓ వినోద్ప్రియ తదితరులు ఉన్నారు.