నెల్లిమర్ల: సుమారు 15 రోజుల క్రితం నెల్లిమర్ల పట్టణంలోకి ప్రవేశించిన దుప్పి ఏమైంది? అటవీశాఖ అధికారులే దానిని చంపి మాంసంతో విందు చేసుకున్నారా? లేదంటే తమ ఉన్నతాధికారులకు గాని, ప్రజాప్రతినిధులకు గాని కానుకగా ఇచ్చి స్వామిభక్తిని చాటుకున్నారా?... స్థానికుల ఆరోపణలు, అటవీశాఖ అధికారుల పొంతన లేని సమాధానాలను బట్టి దుప్పిని వారే చంపి వండుకు తినేశారని స్పష్టమవుతోంది. వివరాల్లోకి వెళితే.. నెల్లిమర్ల పట్టణానికి సమీపంలో ఉన్న కొండపైనుంచి సుమారు 15 రోజుల క్రితం 60 కిలోల బరువున్న ఓ దుప్పి జనారణ్యంలోకి ప్రవేశించింది.
ముందుగా రామతీర్ధం జంక్షన్ పాఠశాలలోకి ప్రవేశించి అనంతరం రోడ్డు మీద పరుగులు పెట్టిన దుప్పిని స్థానికులు పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఫారెస్ట్ బీట్ అధికారి కేవిఎన్ రాజు ఆ దుప్పిని ఓ ఆటోలో పూల్‌బాగ్‌లో ఉన్న అటవీశాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ దుప్పికి ప్రథమ చికిత్స అందించినట్లు విలేకరులకు సమాచారమందించారు. తర్వాత విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శన శాలకు అప్పగించినట్లు ఒకసారి, గంట్యాడ మండలంలోని పెదమజ్జిపాలెంను ఆనుకుని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్‌కు తరలించినట్లు మరోసారి, అడవిలోకి తరలిస్తుండగా మరణించిందని మరోసారి చెప్పడంతో అనుమానాలు మొదలయ్యాయి.
దుప్పిని అటవీశాఖ అధికారులే చంపేసి దాని మాంసంతో విందు చేసుకున్నట్లు స్థానికులు ఆరోపించారు. స్వామిభక్తిని చాటుకునేందుకు బడా ప్రజాప్రతినిధులకు అప్పగించినట్లు మరికొంతమంది చెప్పారు. దీనిపై రేంజర్ లక్ష్మీనరసింహంను వివరణ కోరగా నెల్లిమర్లనుంచి తీసుకొచ్చిన దుప్పిని అడవిలోకి తరలిస్తుండగా అదే రోజు చనిపోయిందన్నారు. ఆధారాలు చూపించమని కోరగా వేరే ఉద్యోగి దగ్గర ఉన్నాయని నీళ్లు నమిలారు. కాగా వన్యప్రాణులను రక్షించాల్సిన అటవీశాఖ అధికారులే ఇలా చేస్తే ఎలాగని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపిస్తే దారుణానికి పాల్పడిందెవరో తేలుతుందని చెబుతున్నారు.
ఆ దుప్పిని వండుకు తినేశారు!
Published Tue, Aug 4 2015 3:58 AM | Last Updated on Thu, May 24 2018 1:29 PM
Advertisement
Advertisement