- పోలీసులు జల్లెడ పట్టినా కనిపించని ఫలితం
- యథేచ్ఛగా వన్యప్రాణుల వేట
- కొంతమంది చేతివాటమే కారణమంటున్న గ్రామీణులు
పలమనేరు, న్యూస్‌లైన్: పలమనేరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంత గ్రామాల్లో నాటు తుపాకుల మోత తగ్గడం లేదు. ఎన్నికల నేపథ్యంలో రెండు నెల లుగా పోలీసులు పెద్ద సంఖ్యలో తుపాకులను స్వా ధీనం చేసుకున్నారు. ఇంకా కొన్నిచోట్ల కాల్పులు జరుగుతుండడం అధికారులను కలవరానికి గురిచేస్తోంది. వేటగాళ్లు కౌండిన్య అడవిలో యథేచ్ఛగా వన్యప్రాణుల వేట సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పలమనేరు నియోజకవర్గానికి దక్షిణం వైపున కౌండిన్య అడవి విస్తరించి ఉంది.
ఈ అడవిలో జింకలు, దుప్పులు, నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లు వేల సంఖ్యలో ఉన్నాయి. అందుకే వేటగాళ్ల కన్ను ఈ ప్రాంతంపై పడింది. పల మనేరు, బెరైడ్డిపల్లె, గంగవరం, వి.కోట మండలాల్లోని 40 అటవీ ప్రాంత గ్రామాల్లో 200 మంది నాటు తుపాకులు కలిగిన వేటగాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరు రాత్రిపూట వన్యప్రాణులను వేటాడుతున్నారు.
తనిఖీలు చేస్తున్నా ఫలితం శూన్యం
రెండు నెలల నుంచి పోలీసులు నాటు తుపాకులను జల్లెడ పడుతున్నారు. పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధి లో అత్యధికంగా 53, గంగవరంలో 30, పెద్దపంజాణిలో 20, బెరైడ్డిపల్లెలో 15, వి.కోటలో 7 తుపాకులను సీజ్ చేశారు. అయినప్పటికీ వేటగాళ్లు మాత్రం వేట సాగిస్తున్నారు. వీరికి తుపాకులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థంగాక అటవీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
కొందరు పోలీసుల చేతివాటం వల్లే
పోలీసు శాఖలో కొంతమంది చేతివాటం వల్లే తుపాకులు వేటగాళ్ల చేతిలోకి వెళుతున్నాయన్న ఆరోపణలున్నాయి. స్వాధీనం చేసుకుంటున్నా మామూళ్లు ఇచ్చి విడిపించుకుంటున్నట్లు తెలుస్తోంది. పలమనేరు పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ పాత్ర ఇందులో ప్రధానంగా ఉన్నట్లు వినికిడి. ఇప్పటికైనా అటవీ శాఖ, పోలీసులు సంయుక్త సహకారంతో వేటగాళ్ల ఆట కట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.