కన్నీటి కథ
మృత్యువు ఎంత కర్కశమైనది! పచ్చగా చిగురించాల్సిన జీవితాన్ని చూస్తే ఎందుకంత కళ్లలో నిప్పులు పోసుకుంటుంది! భవిష్యత్ పై ఆశలు పెట్టుకుంటే, రేపటి గురించి ఎన్నో కలలు కంటే ఎంత నిర్దాక్షిణ్యంగా బతుకును తుంచేస్తుంది! అందుకేనేమో... ఉద్యోగంలో చేరడానికి తల్లి నగలు తాకట్టు పెట్టి ఇంటికి వస్తున్న ఆ యువకుడిని దార్లో పొంచి ఉండి మరీ క్రూరంగా కాటేసింది. భర్త కనుమరుగైతే, కూలి చేసి మరీ కొడుకును ప్రయోజకుడిని చేసి, అతడు రేపోమాపో ఉద్యోగంలో చేరతాడని ఆశపడ్డ కన్నతల్లిపై అశనిపాతంలా విరుచుకుపడింది. అదుపు తప్పిన కారు రూపంలో దూసుకువచ్చి ఆ కుర్రాడిని బలి తీసుకోవడమే కాదు.. ఆటో డ్రైవర్‌ను కూడా మింగేసి కడుపు నింపుకుంది.
నక్కపల్లి : జాతీయ రహదారిపై గొడిచర్ల సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా మరోవ్యక్తి తీవ్రగాయాల పాలయ్యాడు. పాయకరావుపేట నుంచి నక్కపల్లి వైపు వెళ్తున్న ఆటోను రాజమండ్రి నుంచి విశాఖ వెళ్తున్న కారు అదుపుతప్పి గొడిచర్ల సమీపంలో ఢీ కొట్టింది. దాంతో ఆటో రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి బోల్తాపడింది. ఈ ఘటనలో నక్కపల్లి మండలం సీహెచ్ఎల్పురానికి చెందిన ఆటోడ్రైవర్ తంతటి చంటి(32), వేంపాడుకొత్తూరుకు చెందిన దాడి జనార్దన్(25) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హైవే పెట్రోలింగ్ సిబ్బంది తుని ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. వీరితోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న మనబానవానిపాలెంకు చెందిన గొర్ల నాగేష్ గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.
నగలు తాకట్టుపెట్టి వస్తూ...
మృతుల్లో వేంపాడు కొత్తూరుకు చెంది న దాడి జనార్దన్ నిరుద్యోగి. ఇంకా వివాహం కాలేదు. తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి ఉంటున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఎంపిక కావడంతో ఉద్యోగంలో చేరేందుకు డబ్బులు అవసరమయ్యాయి. పుస్తెల తాడు, ఇతర నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు తీసుకురావాలని తల్లి చెప్పడంతో పాయకరావుపేట స్టేట్‌బ్యాంకులో ఆభరణాలపై రూ. 19 వేలు తీసుకున్నాడు. ఆటోలో ఇంటికి బయలుదేరాడు. కొద్ది క్షణాల్లో ఇంటికి చేరి రెండు రోజుల్లో హైదరాబాద్ వెళ్లి ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఇంతలోనే మృత్యువు ఆటోప్రమాదం రూపంలో కబళించింది.
ఇంటి పెద్ద దిక్కు లేకపోయినప్పటికీ కూలిపని చేసుకుంటూ కొడుకును చదివించానని, తీరా చేతికి అందివచ్చిన తర్వాత ఇలా అకాలమరణం చెందుతాడని ఊహించలేదంటూ జనార్దన్ తల్లి నాగలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తనకు తలకొరివి పెడతాడనుకుంటే తనే పెట్టాల్సిన దుస్థితి ఎదురైందని రోదిస్తోంది. ప్రమాదంలో మరణించిన సీహెచ్‌ఎల్‌పురం గ్రామానికి చెందిన తంతట చంటి ఆటోను బాడుగకు తీసుకుని నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ప్రమాదంలో ఇతను మరణించడంతో భార్య, పిల్లలు రోడ్డున పడ్డారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ రామకృష్ణ పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రమాద విషయం తెలిసిన పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత, స్థానిక నాయకులు వెంకటేష్, బాబ్జిరాజు ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.