చదివింపు
మంచి మార్కులతో పాస్ అవ్వాలంటేబాగా చదవాలి. మరి డాక్టర్ అవ్వాలంటే?చదివింపు తప్పేట్టులేదు!ఒక గుడి.. అక్కడో స్వామీజీ.. ఓ కొబ్బరికాయ..దాంట్లో పూలు!ఇంత మహిమ చూశాక‘చదివింపు’ తప్పుతుందా?ఈ చదివింపు ఏమిటో మీరూ చదవండి.జాగ్రత్త పడండి... జాగృతం అవండి.
పూలెలా వచ్చాయి?
కొబ్బరికాయకు మూడు కళ్లుంటాయి. అందులో ఒకటి మెత్తగా ఉంటుంది. మొలక వచ్చేది ఆ కన్ను నుంచే. పీచును తొలగించకుండా జాగ్రత్తగా సందు చేసి మెత్తని కన్నుకు రంధ్రం చేస్తారు. నీరంతా ఒంపేసి స్ట్రాతో సన్న మల్లెమొగ్గలను దూర్చి కర్పూరం అతికించి పీచును సరిచేస్తారు. అలాగే... రక్తం కూడా. పూలకు బదులు ఎర్ర రంగు నీటిని సిరంజితో ఇంజెక్ట్ చేస్తారు. ఈ కొబ్బరికాయలను పూజసామగ్రి అమ్మే వారి చేతనే అమ్మిస్తారు.
కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది శిల్ప. ఉదయం పదిన్నరకు విద్యాశాఖ మంత్రి టెన్త్ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారు. ఆ ఫలితాల కోసమే ఆమె ఆందోళన. పరీక్ష బాగా రాశాననే నమ్మకం ఎంతగా ఉన్నప్పటికీ ఏదో మూల భయం. టీవీ పెట్టుకుని చూస్తోంది. ఎంతకీ పదిన్నర కావడం లేదు. ఒకచోట కూర్చోబుద్ధి కావడం లేదు. ఇంటి బయటకు వచ్చింది. ఇంతలో శిల్ప స్నేహితురాలు లలిత పరుగెత్తుకు వస్తోంది. అల్లంత దూరం నుంచే ‘శిల్పా! మన సైన్స్ మాస్టారు చెప్పారు... మనిద్దరం ఫస్ట్ క్లాస్లో పాసయ్యాం. సునీతకేమో సెకండ్ క్లాస్... ఇంకా..’’ అంటూ వగరుస్తూ జాబితా వల్లిస్తోంది.
శిల్ప ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. ‘‘నాన్నా! నన్ను డాక్టర్ చదివిస్తావు కదా!’’ అని గారంగా అడుగుతోంది. ముందెప్పుడో ఇచ్చిన మాటను తండ్రి ఎక్కడ తేలిగ్గా తీసుకుంటాడోనని, మరింత నిర్థారణ చేసుకునే ప్రయత్నం ఆ అమ్మాయిది.
‘‘శిల్పా! మాట తీసుకోవాల్సింది మీ నాన్న దగ్గర కాదు. మల్లోని చెన్రాయుని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టు. డాక్టర్ కావాలని ఆ దేవుణ్నే కోరుకో’’ అన్నది వాళ్లమ్మ సరస్వతి. మరుసటి రోజు ఉదయాన్నే తలంటుకుని శిల్ప, లలిత ఇద్దరూ ఊరికి కనుచూపు మేరలో కొండ మీద ఉన్న ఆలయానికి బయల్దేరారు.
బాలికా.. ఇదేనా నీ కోరిక?!
ఆలయం పరిసరాల్లో కొబ్బరికాయలు, కర్పూరం, అగరుబత్తీలు అమ్మేవాళ్లు వరుసగా కూర్చుని ఉన్నారు. కొబ్బరికాయలు కొన్ని ముదురు రంగులో కొన్ని తాజాగా లేతగా కనిపిస్తున్నాయి. ‘‘ఈ పెద్ద కాయ తీసుకోవే శిల్పా! డాక్టర్ కావాలనే నీ కోరిక పెద్దది కదా మరి’’ అంటూ ఆటపట్టించింది లలిత.
‘‘నీకు మంచి కాయ ఇస్తానుండు’’ అంటూ బుట్టలో అటు కదిలించి ఇటు కదిలించి ఓ కాయను ఇచ్చింది పూజ సామగ్రి అమ్మే ఆమె. ఆలయంలోకి వెళ్లగానే పూజారికంటే ముందే ఓ స్వామీజీ కనిపించాడు. ‘చెన్రాయునికి దణ్ణం పెట్టుకుని ఇక్కడ కూర్చోండి’ అంటూ వారిని అప్పటికే అక్కడ ఉన్న వారి పక్కన కూర్చోబెట్టాడు. వరుసలో శిల్ప వంతు రాగానే లేచి వెళ్లి, తాను తెచ్చిన పూజ సామగ్రిని స్వామీజీ ముందు పెట్టింది.
‘‘డాక్టర్ కావాలని ఉందా? నీ కోరిక నెరవేరుతుంది’’ అంటూ కళ్లు మూసుకుని టెంకాయను నుదుటి మీద ఆనించి మంత్రాలు చదివాడు. క్షణాల్లో స్వామీజీ ముఖం ప్రసన్నంగా మారిపోయింది. ప్రశాంతంగా కళ్లు తెరిచి శిల్పను ఆదరంగా చూశాడు. ‘‘ఈ టెంకాయను దేవుడి దగ్గర కొట్టు’’ అని ఇచ్చాడు. శిల్ప కొబ్బరికాయ కొట్టగానే... అక్కడున్న అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. కళ్లు ఇంతింత చేసుకుని చూశారు. టెంకాయ కొట్టగానే మల్లెపూలు జలజలారాలాయి!
గమనించి, మైండ్ గేమ్ ఆడతారు!
ఇది అనంతపురం జిల్లా, బుక్కపట్నం మండలం, మల్లోని చెన్రాయుని పల్లెలో జరిగింది. కొండ మీద చెన్రాయుని గుడి ఉండడంతో ఆ ఊరికి ఆ పేరే వచ్చింది. చెన్రాయుని గుళ్లో పూజారులు ఈ పని చేయరు. అక్కడికి దొంగ స్వాములు వస్తూ కొన్నాళ్లు ఉండి వెళ్లిపోతుంటారు. ఓ స్వామీజీ ఈ కొబ్బరికాయల తంత్రంతో జనాన్ని మోసం చేయసాగాడు. అతడి దగ్గరకు వచ్చే వాళ్లు కారులో వచ్చారా, ఖరీదైన దుస్తులు వేసుకున్నారా, ఒంటి మీద ఆభరణాలున్నాయా... వంటివన్నీ గమనిస్తారు. వచ్చిన వాళ్ల తాహతుకు తగ్గట్లు టోకరా వేసేవాడు. ముందుగా కొబ్బరికాయలో రక్తం చిందిస్తారు. లక్షలు గుంజిన తర్వాత పూలు తెప్పిస్తారు.
బయటి ఊళ్ల వాళ్లకు జరిగినవి పెద్దగా బయటకు తెలిసేవి కాదు. అయితే శిల్ప విషయంలో... స్వామీజీ అత్యుత్సాహపడ్డట్లున్నాడు. మొదటి ప్రయత్నంలోనే పూలు తెప్పించి గొలుసు కాజేశాడు. టెంకాయలో పూలు తెప్పించి గొలుసు కాజేశాడనే సంగతి ఊరంతా పొక్కిపోయింది. మేము టెంకాయలు తీసుకెళ్లి పూలెలా తెప్పిస్తారో, రక్తం ఎలా తెప్పిస్తారో చేసి చూపించాం. తర్వాత ఊళ్లోని యువకులు సరదాగా ఈ ప్రయోగాలు చేసి నవ్వుకునేవారు. ఇప్పుడా ఊళ్లో ఎవరూ మంత్రాలు, తంత్రాలను నమ్మడం లేదు.
- ఎస్. శంకర శివరావు, జెవివి జాతీయ మేజిక్ కమిటీ కన్వీనర్
పూలొచ్చాయి కదా.. ఆశ నెరవేరినట్లే...
భక్తుల ఆశ్చర్య వదనాలను ఆనందంగా చూస్తున్నాడు స్వామీజీ. ‘‘నీ కోరికను స్వామి మన్నించాడు. నువ్వు డాక్టర్ అవుతావు’’ అని శిల్పతో చెప్పాడు. ఇదంతా చూస్తున్న ఒక భక్తురాలు ‘‘స్వామీ! పోయిన వారం నేను కొట్టిన కొబ్బరికాయ నుంచి రక్తం చిందింది. నాకు పూలెప్పుడు వస్తాయి?’’ ఆశగా అడిగింది. మరో మూడు వారాలకు మీ ఇంటిని పట్టిన పీడ తొలగిపోవాలి. ఐదో వారానికి నీ కొబ్బరికాయలోనూ పూలు రావచ్చు’’ సాలోచనగా చెప్పాడు స్వామీజీ. ఆమె గాల్లోకి చూస్తూ అంతా తమ దయ అని దండం పెట్టుకుంది. మిగిలిన భక్తులు వారి వారి వినతులు వెలిబుచ్చుతున్నారు. తాను వచ్చిన పని పూర్తి కావడంతో శిల్ప ఇంటికి వెళ్లడానికి లేచింది.
ఆ పక్కనే ఉన్న స్వామి అనుచరులు ‘‘స్వామి వారికి దక్షిణ ఇవ్వాలి’’ అనడంతో హుండీలో వేయడానికి తన దగ్గరున్న డబ్బులు తీసింది. ‘‘స్వామి ఉన్న ఫళాన నీ కోరిక నెరవేరేటట్లు చేశారు. ఇంత చిన్న దక్షిణ ఇస్తావా?’’ అన్నారు. మా అమ్మ ఇచ్చిన డబ్బులో పూజ సామాను కొనగా ఇక నా దగ్గర ఇంతే ఉంది’’ అన్నదామె నిస్సహాయంగా. ‘‘నీ మెడలో బంగారు గొలుసుందిగా అమ్మా. నువ్వు డాక్టర్ అయితే ఇలాంటి గొలుసులు ఎన్నో కొనుక్కోవచ్చు. అసలు మీ అమ్మానాన్న అందరూ వారం వారం వస్తుంటే మీ ఇంటికి డబ్బు ఇబ్బడిముబ్బడిగా వచ్చి చేరుతుంది.’’ అని ఊదరగొట్టారు స్వామీజీ శిష్యులు. గత్యంతరం లేనట్లు, తాను చేస్తున్నది తప్పా, ఒప్పా అనే మీమాంసలోనే మెడలోని గొలుసు తీసి హుండీలో వేసి ఇంటి దారి పట్టింది శిల్ప.
ఊరు నోరు తిరిచింది!
ఇంటికెళ్లగానే శిల్ప మెడ బోసిగా ఉందని గుర్తించింది సరస్వతి. జరిగింది తెలుసుకున్నాక ఇంట్లో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలే ఆడపిల్ల. ఆ స్వామీజీ గొలుసుతో సరిపెట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది... అనుకుని అంతటితో ఆ సంగతిని వదిలేశారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఊరంతా తెలిసింది. తెలిసిన వాళ్లంతా వచ్చి పరామర్శిస్తున్నారు. జనవిజ్ఞానవేదిక కార్యకర్తలకూ తెలిసింది. వారొచ్చి ఇందులో తంత్రాలను తెలియచేయడంతో ఊరుఊరంతా స్పందించింది. స్వామీజీకి దేహశుద్ధి చేయాలన్నంత ఉద్రిక్తత ఏర్పడింది ఊరివాళ్లలో. ఇది తెలిసిన స్వామీజీ రాత్రికిరాత్రి పరారయ్యాడు. బంగారు గొలుసు తీసుకున్న చేతులకు ఇనుప గొలుసులు పడేలోపు అప్రమత్తమయ్యాడు స్వామీజీ. ఈ సంఘటనతో గ్రామం చైతన్యవంతమైంది.
- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి