శ్రుతితో అవగాహన చిత్రం
ఏ అంశానికైనా ప్రచారం చాలా అవసరం. ఇందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు వ్యాపార సంస్థలు. ఎంత వ్యయం చేసినా కార్యానికి ప్రయోజనం చేకూరాలి. లేకుంటే బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వ అగ్నిమాపక శాఖ చాలా కసరత్తులు చేసినట్లుంది. దీపావళి పండగ దగ్గర పడుతోంది. ఇది ప్రతి ఇంటా కాంతులు విరజిమ్మే పండగ అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అదే సమయంలో పలు విపత్తులు ఎదురవుతుంటాయి. ఇందుకు కారణం ఆనందంగా కాల్చే పటాసులే. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఘోర ప్రమాదాలను చవి చూడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక శాఖ తగిన చర్యలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా నటి శ్రుతిహాసన్ క్రేజ్‌ను వాడుకునే ప్రయత్నం చేసింది. అర్థం కాలేదా? టపాసులు కాల్చడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, తద్వారా విపత్తులకు గురి కాకుండా సురక్షితంగా, సుఖ సంతోషాలతో పండగను జరుపుకునే విధంగా అవగాహన చిత్రాన్ని రూపొందించారు.
ఇందులో నటి శ్రుతిహాసన్ నటించారు. ఆమెతో చెప్పిస్తే విషయం ప్రజల్లోకి చేరుతుందని, వారు టపాసులు కాల్చడంలో అప్రమత్తం అవుతారని అగ్నిమాపక శాఖ భావిస్తోంది. ఈ అవగాహనా చిత్రాన్ని సినీ థియేటర్లు, టీవీ చానళ్లలో ప్రదర్శించనున్నారు. అంతే కాకుండా నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్రదర్శించడానికి సన్నద్ధమవుతున్నారు. గత ఏడాది చాలా జాగ్రత్తలు తీసుకున్నా అక్కడక్కడా కొంత ముప్పు వాటిల్లింది. పునరావృతం కాకుండా శాఖాధికారులు చెబుతున్నారు.