చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
► సమాచార చట్టం కమిషనర్ డాక్టర్ ఎస్. ఇంతియాజ్ అహ్మద్
ఒంగోలు టౌన్: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకుని సామాజిక స్పృహ, మానవతా విలువలతో మెలగాలని రాష్ట్ర సమాచార చట్టం కమిషనర్ డాక్టర్ ఎస్. ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. స్థానిక ఎస్ఎస్ఎన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం, సమాచార హక్కు చట్టం అనే అంశాలపై శనివారం అవగాహన సదస్సున నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డాక్టర్ ఎస్. ఇంతియాజ్ అహ్మద్ పాల్గొని విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.
సమాజంలో అన్ని రకాల రుగ్మతలున్నాయని, దీంతో నైతిక విలువలు పతనమవుతున్నాయన్నారు. తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులున్నా తమ పిల్లలను బాధ్యతతో చదివిస్తున్నారన్నారు.వృద్ధాప్యంలో తల్లిదండ్రుల అవసరాలను గుర్తించాలన్నారు. మానవతా విలువలను పెంపొందించుకోవాలని, లేకుంటే పశువులతో సమానమన్నారు. నిత్యం వార్తాపత్రికలు తప్పనిసరిగా చదవాలని, మన చుట్టూ సమాజంలో జరిగే సంఘటనలు, విషయాలను తెలుసుకోవాలన్నారు. మనం తెలుసుకున్న విషయాలను పది మందికి ఉపయోగపడేలా తెలియజెప్పి సహాయపడాలన్నారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సమాచార హక్కుచట్టాన్ని మనదేశంలో అమల్లోకి వచ్చిందన్నారు. ఈ చట్టం ఎంతో గొప్పదని, ఏ ప్రభుత్వ కార్యాలయం లేదా ప్రైవేట్ సంస్థలోనైనా సమాచారం పొందే హక్కు ప్రజలకు లభించిందన్నారు. ఈ చట్టం ద్వారా సమాజాన్నిబాగుపరచవచ్చన్నారు. వాస్తవాలు, నిజాయితీ కోసం న్యాయపరమైన హక్కుల కోసం ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలన్నారు. ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నటుకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే యజమానులని, ప్రభుత్వం నిర్ణయించిన విధానాలు, చేసిన చట్టాలు సరిగా అమలవుతున్నాయా లేదా ప్రజలే పర్యవేక్షించాలన్నారు. చట్టప్రకారం కోరిన సమాచారం 30 రోజుల్లో ఇవ్వకుంటే కమిషనర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ చట్టాన్ని గ్రామాల బాగు కోసం వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర సమాచార ప్రచార ఐక్యవేదిక అధ్యక్షురాలు ఎం.మాధవి మాట్లాడుతూ దేశ ప్రతిష్టను భంగపరిచే హక్కు ఎవ్వరికీ లేదన్నారు. ఎవరైనా సరే సంస్థలు, సంఘాలను కొన్ని పరిమితులకు లోబడి ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అనంతరం శాలువ, జ్ఞాపికలతో అతిథులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ వెంకటకృష్ణమూర్తి, ఎంబీఎ విభాగ అధిపతి ఆనందకుమార్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.