మాయావతికి సొంత ఎమ్మెల్యే ఝలక్
లక్నో: ఉత్తరప్రదేశ్లో సొంతపార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఝలక్ ఇచ్చాడు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ప్రారంభంకానుండగా పార్టీని కాదని అధికార పక్షంలో దూరాడు. సమాజ్ వాది పార్టీలో చేరిపోయాడు. ప్రస్తుతానికి దళిత వర్గాలన్నీ తనవైపునకు తిప్పుకున్న మాయావతి ఇప్పుడు అగ్రకులస్తులను, బ్రాహ్మణులను సంప్రదించే పనుల్లో ఉండగా ఈ సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
అయోధ్య ప్రసాద్ పాల్ అనే వ్యక్తి ఫతేపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. గతంలో మాయావతి ప్రభుత్వంలో అతడు మంత్రిగా కూడా పనిచేశాడు. కానీ, అనూహ్యంగా మంగళవారం సాయంత్రం అఖిలేశ్ నివాసానికి వెళ్లి తాను ఎస్పీలో చేరుతున్నట్లు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు సమాజ్ వాది పార్టీ విధి విధానాలు బాగా నచ్చాయని, అందుకే తాను అందులో చేరుతున్నట్లు చెప్పారు. ఇటీవల బీఎస్పీకి చెందిన స్వామి ప్రసాద్ మౌర్య, బ్రజేశ్ పాఠక్, కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపేలో చేరుతున్న విషయం తెలిసిందే.