Azad Hind Fouz
-
నేతాజీకి జాతి ఘన నివాళి
న్యూఢిల్లీ: ఆజాద్ హిందు ఫౌజ్ దళపతి, స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని జాతి యావత్తూ ఆయనకి ఘనంగా నివాళులర్పించింది. స్వతంత్ర భారతావని సాధన దిశగా వేసిన సాహసోపేత అడుగులు, బోస్‌ను ‘జాతికి స్ఫూర్తి ప్రదాత’గా నిలిపాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. గొప్ప జాతీయవాది, దూరదృష్టి కలిగిన నాయకుడు నేతాజీ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశవాసులకు పరాక్రమ్ దివస్ (నేతాజీ జన్మదినోత్సవం) శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి నేతాజీ అందించిన సేవలకు ప్రతి భారతీయుడు గర్విస్తాడని ప్రధాని ట్వీట్ చేశారు. అనంతరం ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆవిష్కరించారు. 28 అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పుతో ఉన్న ఈ విగ్రహాన్ని 4కే సామర్థ్యం ఉన్న ప్రొజక్టర్ ద్వారా ప్రదర్శిస్తున్నారు. గ్రానైట్‌తో రూపొందిస్తున్న నేతాజీ విగ్రహ నిర్మాణం పూర్తయ్యాక దీని స్థానంలో ఆ విగ్రహాన్ని స్థాపిస్తారు. కెన్ డూ.. విల్ డూ.. విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రజలందరూ నేతాజీ నుంచి కెన్ డూ (చేయగలము) విల్ డూ (చేస్తాము) అన్న స్ఫూర్తిని పొంది ముందడుగు వెయ్యాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఎందరో త్యాగధనులు, గొప్ప నాయకులు దేశానికి చేసిన సేవల్ని చరిత్ర పుటల నుంచి తొలగించే ప్రయత్నాలు జరిగాయని పరోక్షంగా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. గతంలో జరిగిన తప్పుల్ని సవరించుకుంటున్నామని, వారు దేశానికి సేవల్ని స్మరించుకుంటున్నామని చెప్పారు. దేశానికి స్వాంతంత్య్రం వచ్చిన వందేళ్లలోగా, అంటే 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదగాలన్న లక్ష్యాన్ని ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా 2019 నుంచి 2022 సంవత్సరం వరకు సుభాష్ చంద్రబోస్ ఆప్డా ప్రబంధన్ పురస్కార్‌లు ప్రదానం చేశారు. విపత్తు నిర్వహణలో అద్భతమైన ప్రతిభ చూపించిన సంస్థలకి, వ్యక్తులకి ఈ అవార్డులను ఇస్తున్నారు. జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబెకు నేతాజీ రీసెర్చ్ బ్యూరో నేతాజీ అవార్డుని బహుకరించింది. అబె తరఫున కోల్‌కతాలోని జపాన్‌కు చెందిన కౌన్సెల్ జనరల్ ఈ అవార్డుని స్వీకరించారు. నేతాజీ అవార్డు తనకి ఇవ్వడం గర్వకారణమని షింజో అబె తన సందేశాన్ని పంపించారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల కోసం తాను ప్రయత్నిస్తానని చెప్పారు. ఆ భాగాల్ని అనువదించలేదు నేతాజీ సుభాష్ చంద్రబోస్దిగా అనుమానించిన చితాభస్మానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి జపాన్‌లోని రెంకోజీ ఆలయం అనుమతి ఇచ్చినట్టుగా తాజాగా వెలుగు చూసిన లేఖలో వెల్లడైంది. అప్పట్లో నేతాజీ అనుమానాస్పద మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎంకె ముఖర్జీ కమిషన్‌కు చితాభస్మం డీఎన్ఏ పరీక్షలకు అనుమతినిచ్చినట్టుగా టోక్యోలోని రెంకోజీ ఆలయం ప్రధాన పూజారి 2005లో భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే జపాన్ భాషలో ఉన్న లేఖలో ఆ భాగాన్ని అనువదించలేదని సుభాష్ చంద్రబోస్ సోదరుడు శరత్ బోస్ మనవరాలు మాధురి బోస్ ఆదివారం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. రెంకోజీ ఆలయం చితాభస్మంపై పరీక్షలకు అనుమతించలేదని ఆ కమిషన్ పేర్కొందని గుర్తు చేశారు. దేశ, విదేశాల్లో.. బోస్ జయంతిని సింగపూర్‌లో ఘనంగా జరిపారు. సింగపూర్ స్వాతంత్య్ర సాధనలో బోస్ పాత్రను దేశవాసులు స్మరించుకున్నారు. బోస్ జన్మదినోత్సవాన్ని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని బెంగాల్ సీఎం మమత డిమాండ్ చేశారు. ఆయన జ్ఞాపకార్థం జైహింద్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. నేతాజీ జన్మోత్సవ వేడుకలను తమిళనాడులో గవర్నర్, సీఎం ఘనంగా నిర్వహించారు. బెంగళూరులోని బోస్ విగ్రహాన్ని విధాన సభ ముందు ప్రతిష్టిస్తామని కర్ణాటక సీఎం ప్రకటించారు. ఒడిశాలో బోస్ జన్మస్థల మ్యూజియంలో పలు కార్యక్రమాలు జరిపారు. చండీగఢ్‌లో నేతాజీ నూతన విగ్రహాన్ని సీఎం ఖట్టర్ ఆవిష్కరించారు. At the programme to mark the unveiling of the hologram statue of Netaji Bose. https://t.co/OxRPKqf1Q7 — Narendra Modi (@narendramodi) January 23, 2022 -
ఆజాద్ నారీ ఫౌజ్
స్త్రీలు యుద్ధంలోకి ఎందుకు? స్త్రీల చేతికి తుపాకులెందుకు? ఏమిటీ ప్రశ్న! స్త్రీల సామర్థ్యంపై సందేహమా? స్త్రీల భద్రతపై సంశయమా? ఇంత భారీ డిఫెన్స్ ఫోర్స్‌ని పెట్టుకుని కూడా ‘ఫ్రంట్‌లైన్ వార్’లోకి స్త్రీలను వెళ్లనివ్వడం లేదు మన రక్షణ దళాధిపతులు! మరి.. ఏ బలాలు, దళాలు లేని కాలంలో.. స్వాతంత్య్ర సంగ్రామానికి మహిళల్ని ఏ ధైర్యంతో ఆహ్వానించారు సుభాస్‌చంద్రబోస్?! ధైర్యంతో కాదు. నమ్మకంతో.. మహిళా శక్తిపై నమ్మకంతో! నేడు చంద్రబోస్ జయంతి. ఈ సందర్భంగా.. డెబ్బై ఆరేళ్ల క్రితమే ఆయన స్థాపించిన ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్’ ఆవిర్భావ సందర్భంపై సంక్షిప్త మననం. 1943 జూలై 9, సింగపూర్.. బోస్ మాట్లాడుతున్నాడు.. సుభాస్ చంద్రబోస్! ఎదురుగా భారతీయులు.. అరవై వేల మంది! ఇల్లొదిలి, దేశం వదలి తనెందుకు వచ్చిందీ చెప్పాడు. అయితే అది కాదు అతడు చెప్పబోతున్నదని అక్కడి వారికి అర్థమైపోయింది. ఇంకేదో చెప్పబోతున్నాడు. ఏంటది?‘‘ఆడవాళ్లు కూడా తుపాకులు అందుకోవాలి’’ అన్నాడు బోస్. ఒక్కసారిగా నిశ్శబ్దం! ‘‘వాళ్లొచ్చి ఏం చేస్తారు బోస్.. భారం అవుతారు ఆజాద్ హింద్ ఫౌజ్‌కి’’.. ఎవరో అన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ – ఐఎన్ఎ) .. బోస్ నిర్మించిన సైనిక దళం. గొరిల్లా, ఇన్ఫాంట్రీ, స్పెషల్ ఆపరేషన్స్.. వెరీ డేంజరస్. ఐఎన్ఎ అలికిడి అయితే చాలు.. బ్రిటిష్ ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. ఏడాదైంది బోస్ ఐఎన్ఎ ని తయారుచేసి. అందులోకే ఇప్పుడు మహిళల్ని రమ్మంటున్నాడు. ‘‘ఒంట్లో సత్తువ ఉన్న ప్రతి ఒక్కరూ.. ఇంట్లో దూరిన శత్రువుని తరిమికొట్టడానికి సైన్యంలోకి రావాలి’’ అన్నాడు బోస్. ‘‘ఏం చేస్తారు బోస్.. ఆడవాళ్లు సైన్యంలోకి వచ్చి?’’ మళ్లీ అదే ప్రశ్న. బోస్ గర్జించాడు. ‘‘ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేసిందో అదే చేస్తారు. ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా ఖడ్గాన్ని తిప్పిందో అలాగే ఖడ్గాన్ని తిప్పుతారు. తిరుగుబాటుకు, స్వాతంత్య్ర సంగ్రామానికి అప్పుడున్నది ఒక్క లక్ష్మీబాయే. ఇప్పుడు ప్రతి మహిళా ఒక లక్ష్మీబాయి. నేను నమ్ముతున్నాను.. మహిళా భాగస్వామ్యం కూడా ఉంటే త్వరగా స్వాతంత్య్రం సిద్ధిస్తుంది. నేనునమ్ముతున్నాను.. మహిళలూ కదనరంగంలోకి దుమికితే.. భారతదేశం అణువణువునా స్వాతంత్య్ర కాంక్ష రగులుతోందన్న సంకేతం బ్రిటన్‌కు అందుతుంది’’బోస్ ప్రసంగం ముగించాడు. ముగిస్తూ, చెయ్యి ముందుకు చాపి.. ప్రమాణం చేస్తున్నట్లుగా అన్నాడు. ‘‘మన మహిళా దళం పేరు.. ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్’. ఎవరూ చేతుల్లేపలేదు!‘‘ఇక స్వాతంత్య్రం వచ్చినట్లే’’.. ఎవరో అన్నారు. ‘అవునవును’.. ఇంకో గొంతు. మరికొన్ని వంత గొంతుకలు. మూడ్రోజులు గడిచాయి. చప్పుడు లేదు.నాలుగో రోజు సింగపూర్‌లోనే.. ‘ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్’ (ఐఐఎల్) మీటింగ్ జరుగుతోంది. ఐఐఎల్ మహిళా విభాగం మీటింగ్ అది. అక్కడికి వెళ్లాడు బోస్. ఇండియా బయట ఉండి, ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం పోరాడుతున్న భారతీయులంతా కలిసి పెట్టుకున్న రాజకీయపార్టీ ఐఐఎల్.‘‘నా పేరు బోస్. మీలాగే భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ఒక సైనికుడిని’’ అన్నాడు బోస్. మీటింగ్‌లోని మహిళలు కొందరు సంభ్రమంగా చూశారు. ‘మీలాగే’ అన్న మాట.. వారిలో ఉత్తేజాన్ని నింపింది. ‘‘మీతో కలిసి బ్రిటిష్ వాళ్లపై పోరాటం చేయాలనుకుంటున్నాను’’ అన్నాడు బోస్. బోస్‌తో కలిసి పోరాడాలని అనుకుంటారు ఎవరైనా. కానీ బోసే అంటున్నాడు ‘నేను మీతో కలిసి పోరాడతాను’ అని! ఆశ్చర్యంగా కళ్లింత చేసి చూశారు మహిళలు. సమావేశంలో డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్ ఉన్నారు. సింగపూర్‌లో ఐఐఎల్ మహిళా విభాగంలో ఆమెది కీ రోల్. ఆ సమావేశంలోనే.. బోస్కి మహిళలతో ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ ఇప్పించాలన్న నిర్ణయం జరిగింది. సైనిక వందనం!మహిళలైతే ఉన్నారు. మహిళా సైనికులు ఎక్కడ దొరుకుతారు.. ‘గార్డ్ ఆఫ్ ఆనర్’కి. కష్టపడి ఓ ఇరవై మంది సాధారణ మహిళల్ని ఒప్పించగలిగారు. బోస్ ఐఎన్ఎ దళం నుంచి లీ–ఎన్ఫీల్డ్ 303 రైఫిల్స్ తెప్పించారు. వాటిని ఎలా పట్టుకోవాలో, ఎలా వందన సమర్పణ చేయాలో ఆ ఇరవై మందికి అప్పటికప్పుడు నేర్పించారు. యూనిఫారాల్లేవు. చీరల వస్త్రధారణలోనే గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. వందన సమర్పణ ముగిసింది. బోస్ ప్రసంగం మొదలైంది. ‘‘స్వాతంత్య్రం కోసం దశాబ్దాలుగా మగాళ్లకు దీటుగా మీరూ ముందుకు నడుస్తున్నారు. నాకనిపిస్తున్నది ఏమిటంటే.. ముందుకు నడవడమే కాదు, ముందుకు నడిపించగలరు కూడా మీరు’’.ఆ ఒక్కమాట చాలదా.. తుపాకీని భుజానికెత్తుకోడానికి. ఎత్తుకున్నారు. కానీ, అదంత తేలిగ్గా ఏమీ జరగలేదు. ఆడవాళ్లెందుకు ఆజాద్ హింద్ ఫౌజ్‌లోకి అనే ప్రశ్న మళ్లీ వచ్చింది. బోస్కి సైనిక వందనం చేసిన మహిళల్లో డాక్టర్ నసీరా కయానీ అనే డాక్టర్ కూడా ఉన్నారు. రైఫిల్‌ని ఎత్తిపట్టుకున్న ఆ గ్రూపులో ఉన్న నసీరాను చూసి ఆజాద్ హింద్ ఫౌజ్ కు జనరల్‌గా ఉన్న మొహమ్మద్ జమాన్ కయానీ ఖిన్నుడయ్యాడు. తన భార్యేమిటీ, అకస్మాత్తుగా ఇక్కడ ప్రత్యక్షం అయిందేమిటీ? అని ఆశ్చర్యపోయాడు. ఇంటికి వెళ్లాక నసీరాను కోప్పడ్డాడు. ‘‘డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్ కాలేజ్‌లో నా క్లాస్మేట్. తను రమ్మంటే వెళ్లాను’ అని భర్తకు చెప్పారు నసీరా. ఆర్‌జెఆర్ (రాణి ఝాన్సీ రెజిమెంట్) లో చేరదామని వెళ్లి కూడా, భర్త వద్దనడంతో ఆమె ఆగిపోయారు. పైస్థాయిలోనే ఇలా ఉంటే, కింది స్థాయిలో ఇంట్లో మగాళ్లు మహిళల్ని సైన్యంలోకి వెళ్లనిస్తారా? అయినా ఆర్‌జెఆర్ నిలబడింది. నిలదొక్కుకుంది. కలబడింది. బలపడింది. కదిలివచ్చిన కొద్దిపాటి మహిళలతోనే నేతాజీ మహిళా సైన్యం 1943 అక్టోబర్ నుంచి 1945 మే వరకు ఉరుములా, మెరుపులా వెయ్యి మంది సైనికులతో ఉనికిలో ఉంది. కెప్టెన్ లక్ష్మీ సెహెగల్ (లక్ష్మీ స్వామినాథనే లక్ష్మీ సెహెగల్) ఈ దళాన్ని నడిపించారు. 1945 అక్టోబర్‌లో యుద్ధం పూర్తయింది. అంతకు రెండు నెలల ముందే ఆగస్టులో సుభాస్ చంద్రబోస్ అదృశ్యమయ్యారు. ఆ అదృశ్యశక్తి మహిళలోని పోరాట పటిమకు శక్తినిస్తూ ఎప్పుడూ నడిపిస్తూనే ఉంటుంది. ఆ పటిమను నిరూపించుకోవలసిన అవకాశాన్ని యువతులకు ఇవ్వవలసింది మాత్రం ఇప్పటి మన రక్షణ దళాల అధిపతులే. -
ఆ ఒక్క కుటుంబం కోసం..
న్యూఢిల్లీ: నెహ్రూ–గాంధీ కుటుంబం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ కుటుంబాన్ని కీర్తించడం కోసం స్వాతంత్య్ర పోరాటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, బీఆర్ అంబేడ్కర్, సుభాష్‌చంద్ర బోస్ లాంటి మహానుభావుల త్యాగాల్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారని ఆరోపించారు. ఈ దిగ్గజాలు పోషించిన చారిత్రక పాత్రను భారతీయులంతా తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఎర్రకోటలో మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సుభాష్‌చంద్ర బోస్ అనుచరుల్లో ఒకరైన లాల్టిరామ్ బహూకరించిన టోపీ ధరించి మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యులు బ్రిటిష్ పాలకుల చేతిలో విచారణ ఎదుర్కొన్న ఎర్రకోటలోని జైలుగది సంఖ్య 3లో ఆ శిలాఫలకాన్ని ఏర్పాటుచేయనున్నారు. అదే జైలులో ఒక మ్యూజియాన్ని కూడా నిర్మించనున్నారు. వాళ్ల మార్గదర్శనం ఉండి ఉంటే... స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా బ్రిటిష్ వ్యవస్థ ఆధారంగానే మన విధానాల్ని రూపొందించారని, బ్రిటిషర్ల దృక్కోణంలోనే ఆలోచించారని మోదీ పేర్కొన్నారు. అందుకే విద్య, ఇతర రంగాలకు సంబంధించిన విధానాలు విఫలమయ్యాయని అన్నారు. ‘భారతదేశ చరిత్ర, విలువల పట్ల నేతాజీ ఎంతో గర్వించేవారు. ఇతర దేశాల కోణంలో అన్నింటిని చూడొద్దని ఆయన బోధించారు. 16 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ పాలనలో భారత దేశ దుస్థితి పట్ల కలతచెందారు. జాతీయవాదమే ఆయన సిద్ధాంతం. అదే శ్వాసగా బతికారు. వలస పాలన, అసమానత్వంపై పోరాటంలో భాగం గా ప్రపంచవ్యాప్తంగా ఎందరికో బోస్ స్ఫూర్తిగా నిలిచారు. సుభాష్‌చంద్ర బోస్, సర్దార్ పటేల్ లాంటి మహానుభావులు మార్గదర్శనం లభించినట్లయితే పరిస్థితులు ఇప్పుడు మరోలా ఉండేవి. ఒక కుటుంబాన్ని కీర్తించేందుకు, ఎందరో గొప్ప నాయకుల సేవల్ని విస్మరించడం విచారకరం’ అని మోదీ అన్నారు. విపత్తు సమయంలో సహాయక కార్యక్రమాల్లో విశేష సేవలందించే సిబ్బందికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరిట ఇకపై ఏటా అవార్డు ఇస్తామని మోదీ ప్రకటించారు. పోలీసు స్మారకానికి ఇన్నేళ్లా?.. విధుల నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థం స్మారకం ఏర్పాటుచేయడంతో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని మోదీ ఆరోపించారు. జాతీయ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో మోదీ పోలీసు స్మారకాన్ని ఆవిష్కరించారు. ‘దేశానికి అంకితం చేస్తున్న ఈ స్మారకం పట్ల గర్విస్తున్నా. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా ఇన్నాళ్లూ ఇలాంటి స్మారకాన్ని ఎందుకు ఏర్పాటుచేయలేదని ప్రశ్నిస్తున్నా. 2002లో శంకుస్థాపన జరిగిన ఈ స్మారక నిర్మాణ పనులకు కొన్ని న్యాయపర అడ్డంకులు తలెత్తిన సంగతిని అంగీకరిస్తున్నా. కానీ అంతకుముందున్న ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే స్మారకం ఎప్పుడో పూర్తయ్యేది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఖమ్మం గ్రానైట్‌తో స్మారకం సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆవిష్కరించి న జాతీయ పోలీసు స్మారక చిహ్నాన్ని ఖమ్మం గ్రానైట్‌తో తయారుచేయడం విశేషం. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో 31 అడుగుల పొడ వు, 9 అడుగుల వెడల్పుతో 270 టన్నుల బరువున్న అతి భారీ గ్రానైట్ రాయి తో ఈ స్మారక చిహ్నన్ని రూపొందించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెర్వు మాధారంలోని గాయత్రి గ్రానైట్స్ క్వారీ నుం చి ఈ రాయిని వెలికితీసి ఢిల్లీకి తరలించారు. ఆర్కిటెక్చర్ నిపుణులు ఈ గ్రానైట్‌పై ముం దువైపు స్మారక చిçహ్నాన్ని చెక్కారు. ఈ కార్యక్రమానికి గాయత్రి గ్రానైట్స్ యాజమాన్య ప్రతినిధులు వద్దిరాజు రవిచంద్ర, వెంకటేశ్వర్లు, నిఖిల్‌లను హోం శాఖ అధికారులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. -
నేతాజీకి భారతరత్న ప్రతిపాదించిన పీవీ
న్యూఢిల్లీ : ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు మరణానంతర భారతరత్న పురస్కారం ఇవ్వాలని మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ప్రతిపాదించారు. ఈ విషయం.. నేతాజీకి సంబంధించి రహస్యంగా ఉంచిన పత్రాల్లో కేంద్ర ప్రభుత్వం తాజాగా బహిర్గతం చేసిన వాటిలో ఉంది. మరణానంతర పురస్కారం ఇవ్వాలని పీవీ ప్రతిపాదించటాన్ని బట్టి.. నేతాజీ మరణించినట్లు అప్పటి ప్రభుత్వం అంగీకరించిందని తెలుస్తోంది. 1991 అక్టోబర్ 10న అప్పటి ప్రధాని అయిన పీవీ.. నాటి రాష్ట్రపతి ఆర్.వెంకటరామన్‌కు రాసిన లేఖలో నేతాజీకి మరణానంతర భారత రత్న పురస్కారం ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆ అవార్డును నేతాజీ జన్మదినమైన జనవరి 23న ప్రకటించవచ్చంటూ 1992 జనవరి 19వ తేదీతో పీవీ మరో లేఖను కూడా నాటి రాష్ట్రపతికి రాశారు. అయితే.. దీనికి సంబంధించి అదే ఏడాది జనవరి 22న రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేయగా.. నేతాజీ కుటుంబం ఆ పురస్కారాన్ని స్వీకరించేందుకు తిరస్కరించినట్లు ఒక ఫైల్ చెప్తోంది. అయితే.. పురస్కారాన్ని వెనక్కు తీసుకునే అవకాశం లేకపోవటంతో దానిని హోంమంత్రిత్వ శాఖ వద్దే ఉంచాలని నిర్ణయించినట్లు ఆ పత్రాలు వివరిస్తున్నాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఎన్.కె.సిన్హా శుక్రవారం నేతాజీకి సంబంధించిన మరో 25 పత్రాలను బహిర్గతం చేశారు.