నేతాజీకి భారతరత్న ప్రతిపాదించిన పీవీ
న్యూఢిల్లీ : ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు మరణానంతర భారతరత్న పురస్కారం ఇవ్వాలని మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు ప్రతిపాదించారు. ఈ విషయం.. నేతాజీకి సంబంధించి రహస్యంగా ఉంచిన పత్రాల్లో కేంద్ర ప్రభుత్వం తాజాగా బహిర్గతం చేసిన వాటిలో ఉంది. మరణానంతర పురస్కారం ఇవ్వాలని పీవీ ప్రతిపాదించటాన్ని బట్టి.. నేతాజీ మరణించినట్లు అప్పటి ప్రభుత్వం అంగీకరించిందని తెలుస్తోంది. 1991 అక్టోబర్ 10న అప్పటి ప్రధాని అయిన పీవీ.. నాటి రాష్ట్రపతి ఆర్.వెంకటరామన్‌కు రాసిన లేఖలో నేతాజీకి మరణానంతర భారత రత్న పురస్కారం ఇవ్వాలని ప్రతిపాదించారు.
ఆ అవార్డును నేతాజీ జన్మదినమైన జనవరి 23న ప్రకటించవచ్చంటూ 1992 జనవరి 19వ తేదీతో పీవీ మరో లేఖను కూడా నాటి రాష్ట్రపతికి రాశారు. అయితే.. దీనికి సంబంధించి అదే ఏడాది జనవరి 22న రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేయగా.. నేతాజీ కుటుంబం ఆ పురస్కారాన్ని స్వీకరించేందుకు తిరస్కరించినట్లు ఒక ఫైల్ చెప్తోంది. అయితే.. పురస్కారాన్ని వెనక్కు తీసుకునే అవకాశం లేకపోవటంతో దానిని హోంమంత్రిత్వ శాఖ వద్దే ఉంచాలని నిర్ణయించినట్లు ఆ పత్రాలు వివరిస్తున్నాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఎన్.కె.సిన్హా శుక్రవారం నేతాజీకి సంబంధించిన మరో 25 పత్రాలను బహిర్గతం చేశారు.