అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలివ్వకుండా..
కోజికోడ్: మతవిశ్వాసాల పేరుతో ఓ వ్యక్తి అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఇవ్వకుండా 24 గంటలు అడ్డుకున్న ఘటన కేరళలో జరిగింది. అబు బక్ర్ అనే వ్యక్తి భార్య కోజికోడ్‌లోని ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. అయితే, మసీదులో ఐదు ప్రార్థనలు (ఆజాన్) పూర్తయ్యేవరకు శిశువుకు మొదటి ఆహారం అందివ్వకూడదంటూ అతడు అడ్డుకున్నాడు.
అతని తీరుపై వైద్యులు, పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. 24 గంటలపాటు తల్లిపాలు ఇవ్వకుంటే శిశువు ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశముందని చెప్పారు. దీంతో వాదనకు దిగిన అతను తన భార్య, శిశువును తీసుకొని ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వారు ఎక్కడికి వెళ్లారనే సమాచారం తెలియరాలేదు.
‘ఐదు అజాన్లు వినేవరకు అతను తన కొడుకుకు తల్లిపాలు ఇవ్వనివ్వబోనని అడ్డుకున్నాడు’ అని ఆస్పత్రి వైద్యుడు సాజి సీకే తెలిపారు. ‘ఇలా చేయడం వల్ల శిశువు ప్రాణాలు తీవ్ర ప్రమాదంలో పడే అవకాశమందని చెప్పినా అతను వినిపించుకోలేదు. నవజాత శిశువుకు ప్రతిరెండుగంటలకు ఒకసారి తల్లిపాలు, లేదా పాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల శిశువుకు ఎలాంటి ప్రాణాపాయ ముప్పు వాటిల్లకుండా చూడొచ్చు’ అని ఆయన తెలిపారు. భార్యను శిశువును తీసుకొని వెళ్లతున్న అతనిని ఒప్పించేందుకు వైద్యులు, పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, సిటీ మెడికల్ కాలేజీకి వెళుతున్నానంటూ అతను గుర్తుతెలియని ప్రదేశానికి వెళ్లిపోయాడని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.