డ్రైన్లో తేలుతూ.. పసికందు మృతదేహం
సాక్షి, అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్) : తల్లి పొత్తిళ్లలో నిద్రించాల్సిన ఆ పసికందు మురుగు కాల్వ పాలయ్యాడు. ఏ తల్లికి భారమయ్యాడో మరి కళ్లు కూడా పూర్తిగా తెరవకుండానే అందరికీ దూరమయ్యాడు. డ్రైనేజీలో ఓ మగ శిశువు మృతదేహం లభ్యమైన ఘటన పాయకాపురం శాంతినగర్‌లో సోమవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం శాంతినగర్ శారదా విద్యాలయం రోడ్డులోని ప్రధాన డ్రైన్లో ఓ శిశువు ఆకారం ఉన్న మృతదేహం తేలుతూ స్థానికులకు కనిపించింది.
దీంతో వారు స్థానిక నా యకులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు డ్రైన్ మధ్యలో ఉన్న ఆ శిశువును బయటకు తీశారు. పేగులు మొత్తం బయటపడి ఉన్నాయి. సుమారు రెండు రోజుల వయస్సు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. స్థానికులు ఎవరైనా కావాలని పడేశారా లేక ఎక్కడైనా పుట్టి చనిపోయిన బిడ్డను ఇలా కాల్వలో వదిలేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నున్న సీఐ ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి వివరాలను సేకరిస్తున్నారు.