'ఇండియాతో దొడ్డిదారి దౌత్యం ఉండదు'
ఇస్లామాబాద్: ఉడీ ఉగ్రదాడి, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ సర్జికట్ స్ట్రైక్స్ తర్వాత నెలకొన్న ఉద్రిక్తతలను నివారించే క్రమంలో దొడ్డిదారి దౌత్యాన్ని నెరపబోమని పాక్ ప్రధాని భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. ఇరుదేశాల అభిలాషను బట్టి ఎలాంటి సంవాదమైనా నేరుగానే తప్ప మరోదారిలో చేయబోమని స్పష్టం చేశారు. రేడియో పాకిస్థాన్ కు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ అన్ని దేశాలతోనూ మైత్రిని కోరుకుంటోందన్న సర్తాజ్ అజీజ్.. అభివృద్ధి ఎజెండాతో అమెరికా, బ్రిటన్, యురోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్ తోపాటు మిగతా దేశాలతోనూ స్నేహం చేస్తున్నమన్నారు. ఇటు దక్షిణ ఆసియా దేశాలతోనూ సత్సంబంధాలు నెరుపుతున్నామన్న ఆయన.. ప్రతిష్ఠాత్మక తజకిస్థాన్-అఫ్ఘానిస్థాన్-పాకిస్థాన్-ఇండియా(తైపీ) సహజవాయు గ్యాస్ పైప్ లైన్ తోపాటు సెంట్రల్ ఏసియా-సౌత్ ఏసియా పవర్ ప్రాజెక్ట్(కాసా) నిర్మాణాలకు తమ వంతు సహకారం అందిస్తున్నామని తెలిపారు.