లక్ష్యం ఒకటే..ఉత్తర్వులు వేరు
- ఏప్రిల్ 15–22 వరకు ‘అమ్మ ఒడి’ నిర్వహణ
- 24 నుంచి మే 10 వరకు ‘మన ఊరు మన బడి’
- 23 నుంచి వేసవి సెలవులు ప్రకటన ... అంతలోనే ఈ ఉత్తర్వు
- ఎస్.ఎస్.ఏ.కు ... విద్యాశాఖకు కొరవడిన సమన్వయం
- తలలు పట్టుకుంటున్న క్షేత్రస్థాయి అధికారులు
రాయవరం: లక్ష్యం ఒక్కటే ... ఉత్తర్వులు వేర్వేరుగా రావడంతో విద్యాశాఖ అయోమయానికి గురవుతోంది. మొన్నటి వరకు విద్యాశాఖలో భాగమైన సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు విద్యాశాఖ ఈ నెల 24 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. రెండు కార్యక్రమాల లక్ష్యం బడి ఈడు చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడమే. ఒకే కార్యక్రమం నిర్వహణ కోసం విద్యాశాఖ, ఎస్.ఎస్.ఏ. వేర్వేరుగా ఉత్తర్వులు ఇవ్వడంపై రెండు శాఖల మధ్య ఉన్న సమన్వయలోపం బట్టబయలైంది.
గందరగోళంలో ఉపాధ్యాయులు..
ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు ‘అమ్మ ఒడి’ కార్యక్రమం పేరుతో బడిఈడు చిన్నారులను బడిలో చేర్చుకునే కార్యక్రమాన్ని పాఠశాలల్లో నిర్వహించారు. ఎస్ఎస్ఏ రాష్ట్ర ప్రాజెక్టు కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు నిర్వహించారు. ఆయా పాఠశాలల పరిధిలో ఐదేళ్లు పైబడిన విద్యార్థులను ఒకటో తరగతిలో చేర్చుకునే చర్యలు చేపట్టారు. ప్రతి పాఠశాల పరిధిలో ర్యాలీలు నిర్వహించి, తల్లిదండ్రులతో అవగాహనా సమావేశాలు ఏర్పాటు చేశారు. అన్ని మండలాల్లోనూ ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు ‘అమ్మ ఒడి’ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. జిల్లాలో 30,240 మందిని ఒకటో తరగతిలో చేర్పించారు.
.మే 10వరకు ‘మన ఊరు మన బడి’
‘అమ్మ ఒడి’ పేరుతో ఎస్ఎస్ఏ అధికారులు చేపట్టిన కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు తిరిగి ‘మన ఊరు మన బడి’ పేరుతో చేపట్టనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్లు నిండిన చిన్నారులను ఒకటో తరగతిలో చేర్పించాలని, 5వ తరగతి పూర్తయిన వారికి 6వ తరగతిలో చేర్పించాలని, 7వ తరగతి పూర్తయిన వారిని 8వ తరగతిలో చేర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న కార్యక్రమాలు గత వారం రోజులుగా ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు ఒకటే కావడం గమనార్హం. పైగా ప్రస్తుత వేసవి సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలి. ఒకే ఆశయంతో విద్యాశాఖ, ఎస్ఎస్ఏ వేర్వేరుగా ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఒక పక్క విద్యాశాఖా మంత్రి ఈ నెల 23 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లుగా ప్రకటించగా... అధికారులు సెలవుల్లో కార్యక్రమాలు నిర్వహించాలని ప్రకటించడం విశేషం.
నవ్వులపాలవుతున్నాం...
ఒకే కార్యక్రమాన్ని రెండుసార్లు నిర్వహించడం హాస్యాస్పదం. విద్యాశాఖలో ఉన్నతాధికారుల మధ్య సమన్వయలేమిని బయటపెడుతోంది. – కవి శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయు.
ఇదేమి ఉత్తర్వులు...
ఒకే కార్యక్రమంపై విద్యాశాఖ, ఎస్ఎస్ఏ వేర్వేరుగా ఉత్తర్వులు ఇవ్వడం సమన్వయలోపాన్ని బట్టబయలు చేస్తోంది. విద్యాశాఖ రాష్ట్ర అధికారులు ఉపాధ్యాయుల మధ్య గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నారు. ఎస్సీఈఆర్టీ, ఎస్ఎస్ఏ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ మధ్య సమన్వయం కొరవడింది. – టి.కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్.