ప్రిక్వార్టర్స్‌లో శ్రీకృష్ణప్రియ
♦ తొలి రౌండ్లో నాలుగో సీడ్‌పై విజయం
♦ చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ
తైపీ: భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సింధు, సైనా నెహ్వాల్ స్ఫూర్తితో మరో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రీకృష్ణప్రియ అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటుకుంది. చైనీస్ తైపీ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో 19 ఏళ్ల శ్రీకృష్ణప్రియ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 79వ ర్యాంకర్ శ్రీకృష్ణప్రియ 21–17, 20–22, 21–9తో నాలుగో సీడ్, ప్రపంచ 28వ ర్యాంకర్ చియాంగ్ మీ హుయ్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించింది.
41 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు గేముల్లో గట్టిపోటీ ఎదుర్కొన్న శ్రీకృష్ణప్రియ నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం చెలరేగిపోయింది. ఆరంభంలోనే 5–0తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె ఆ తర్వాత అదే జోరును కొనసాగించి తన ప్రత్యర్థికి ఏమాత్రం కోలుకునే అవకాశం ఇవ్వకుండా గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న శ్రీకృష్ణప్రియ విదేశీ గడ్డపై ఓ గ్రాండ్‌ప్రి గోల్డ్ స్థాయి టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరడం ఇదే ప్రథమం.
అంతకుముందు ఈ ఏడాది జనవరిలో భారత్‌లో జరిగిన సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో శ్రీకృష్ణప్రియ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో షువో యున్ సంగ్ (చైనీస్ తైపీ)తో తలపడుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి చుక్కా సాయి ఉత్తేజిత రావు తొలి రౌండ్లో 7–21, 17–21తో నా యోంగ్ కిమ్ (కొరియా) చేతిలో ఓడిపోయింది.
పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్ కుర్రాడు సిరిల్ వర్మ ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. రెండో రౌండ్లో సిరిల్ వర్మ 16–21, 21–17, 21–17తో చియా హావో లీ (చైనీస్ తైపీ)పై గెలిచాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో భారత్‌కే చెందిన అభిషేక్ 17–21, 21–17, 6–21తో సెయోంగ్ హూన్ వూ (కొరియా) చేతిలో, హర్షీల్ డాని 12–21, 6–21తో హా యంగ్ వూంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయారు.