నిమజ్జనం షురూ..
సాక్షి, సిటీబ్యూరో :
భాగ్యనగరంలో కన్నుల పండువగా జరిగే వినాయక చవితి ఉత్సవాల్లో మరో అంకానికి తెరలేవనుంది. బుధవారం నుంచి నిమజ్జన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మహత్తర ఘట్టానికి హుస్సేన్‌సాగర్ సహా సరూర్‌నగర్, ఐడీఎల్ , ప్రగతినగర్, ముల్కం చెరువు, దుర్గం చెరువు, పాతనగరంలోని రాజన్నబావి, మీరాలం చెరువులు వేదిక కానున్నాయి. గ్రేటర్ పరిధిలో ఈసారి సుమారు లక్షకుపైగా గణేష్ ప్రతిమలను ప్రతిష్టించిన యువతరం మిన్నంటిన ఉత్సాహంతో సంబరాలు జరుపుకుంటోంది. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని వీలును బట్టి మూడు, ఐదు, ఏడు, తొమ్మిది రోజుల్లో విగ్రహాల నిమజ్జనానికి సన్నద్ధం కావాలని నగర పోలీ సులు సూచించిన నేపథ్యంలో.. నేటి నుంచి పలువురు గణేషునికి బైబై చెప్పేందుకు సిద్ధమౌతున్నారు. కాగా ఈ నెల 18న అనంత చతుర్దశి రోజునే నగరంలో గ ణేష్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. మంటపాల నిర్వాహకులు తమ వీలుని బట్టి నిమజ్జనం ఎప్పుడు చేయాలో నిర్ణయించుకోవాలని, ఎవరి ఒత్తిడికి తలొగ్గరాదని ఆయన కోరారు.
యంత్రాంగం ఏర్పాట్లు
గణనాథుల నిమజ్జనానికి హుస్సేన్‌సాగర్ వద్ద బుధవారం నుంచి ఎనిమిది భారీ క్రేన్లను ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అవసరాన్ని బట్టి క్రేన్ల సంఖ్యను పెంచుతామని పేర్కొన్నారు. సరూర్‌నగర్ (మినీట్యాంక్‌బండ్) వద్ద రెండు క్రే న్లు బుధవారం నుంచి అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. నిమజ్జనం జరిగే ప్రాంతాలు, చెరువుల పరిసరాలను హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుల కమిషనరేట్లకు చెందిన ఉన్నతాధికారులు మంగళవారం తనిఖీ చేశారు.
పెరిగిన పర్యావరణ స్పృహ
గతం కంటే భిన్నంగా ఈ ఏడాది పర్యావరణ స్పృహ పెరిగింది. ఈసారి నగరవాసులు మ ట్టితో చేసిన చిన్న, పెద్ద పరిమాణంలో ఉన్న గణనాథ ప్రతిమలను విరివిగా కొనుగోలు చేయడం విశేషం. గ్రేటర్ పరిధిలో ఈసారి 50 వేలకుపైగా మట్టి విగ్రహాలు అమ్ముడైనట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ), ఇతర హానికారక రసాయనాలు, రంగులతో చేసిన ప్రతిమల వల్ల ఏర్పడే అనర్థాలను నగరవాసులు గుర్తించడం పట్ల పలువరు పర్యావరణ వేత్తలు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
వెరైటీ గణనాథులిక్కడే..
కవాడిగూడలోని మోతీలాల్ నెహ్రునగర్‌లో 60 అడుగుల భారీ మట్టి వినాయకుడు
ఖైరతాబాద్ గణనాథుడు ఎత్తు 59 అడుగులు. 20 అడుగుల కంటే ఎత్తై అగరుబత్తి
నింబోలిఅడ్డ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 35 అడుగుల భారీ మట్టి గణపతి విగ్ర హం
}మణికంఠ అయ్యప్ప భక్త సమాజం ఆధ్వర్యంలో చైతన్యపురి కమలానగర్లో 35 అడుగుల భారీ గణనాథుడు
చైతన్యపురిలో శ్రీ అయ్యప్ప మణికంఠ భక్త సమాజం ఆధ్వర్యంలో 35 అడుగుల గణనాథ ప్రతిమ
చెప్పల్‌బజార్‌లో యంగ్‌మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30 అడుగుల భారీ గణపతి
జియాగూడలోని శ్రీసాయినగర్‌లో ఆల్‌ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన 27 అడుగుల మహాగణపతి
వనస్థలిపురంలో శ్రీరాం గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 22 అడుగుల మట్టి విగ్రహం
అభిమన్యు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వనస్థలిపురం రెడ్వాటర్ ట్యాంక్ వద్ద దూదితో తయారు చేసిన పర్యావరణ వినాయకుడు
న్యూ నాగోలు కాలనీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన అనంత పద్మనాభ స్వామి ఆకారంలో వినాయకుడు
కొత్తపేట న్యూ మారుతినగర్లో లింగాల రాహుల్‌గౌడ్ ఆధ్వర్యంలో నెలకొల్పిన విరాట్ విశ్వరూపం ఆకారంలో వినాయకుడు
సెల్ఫ్‌ఫైనాన్స్ కాలనీలో ఏర్పాటు చేసిన భారీ శేషతల్పంపై వినాయకుడు
భారీ బందోబస్తు: సీవీ ఆనంద్
చైతన్యపురి: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వినాయక విగ్రహాలు నిమజ్జనం జరిగే చెరువుల వద్ద అదనపు బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌ను సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సరూర్‌నగర్ చెరువులో ఈ ఏడాది 6500కి పైగా చిన్న పెద్ద విగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం ఉందన్నారు.
నిమజ్జనం నిమిత్తం గత సంవత్సరం ఎనిమిది క్రేన్లు ఏర్పాటు చేయగా.. ఈసారి అవసరాన్ని బట్టి మరో రెండు అదనంగా సిద్ధం చేస్తున్నట్లు సీపీ తెలి పారు. మూడు బీఎస్ఎఫ్ కంపెనీలు, ఇతర జిల్లాల నుంచి అదనపు బలగాల ను రప్పించనున్నట్లు వెల్లడించారు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఇటీవల చోటుచేసుకున్న బాంబు పేలుళ్లు, ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో అవసరమైన ప్రాంతా ల్లో ఆకస్మిక తనిఖీలు, వెహికల్, లాడ్జీల్లో చెకింగ్లు నిర్వహిస్తున్నామన్నారు. సైబరాబాద్ పరిధిలో 2500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రతి పాదనలు పంపామని పేర్కొన్నారు. చెరువు పూడిక తీసే పనులను జీహెచ్ఎంసీ అధికారుల సహకారంతో చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు ముగిసేలా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని స్పష్టం చే శారు. అనంతరం సరూర్‌నగర్ చెరువులో నిమజ్జన ప్రదేశాలను గుర్తించేందు కు మోటార్ బోట్లో తిరిగారు. ఆయన వెంట ఎల్బీనగర్ డీసీపీ రవివర్మ, ఏసీపీ వెంకట్‌రెడ్డి, సరూర్‌నగర్ సీఐ నర్సింహారావు పలువురు ఎస్ఐలు ఉన్నారు.