‘బక్షి’ సిఫారసుల అమలుపై కేంద్రం వెనకడుగు: ప్రకాష్ బక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అమలవుతున్న మూడంచెల సహకార వ్యవస్థలో పునాది స్థానంలో ఉన్న ‘ప్యాక్స్’ను రద్దు చేయాలన్న నాబార్డ్ చైర్మన్ ప్రకాష్ బక్షి కమిటీ సిఫారసుల అమలుపై కేంద్రం వెనకడుగు వేసింది. ప్యాక్స్ కేవలం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు(డీసీసీబీ), రాష్ట్ర సహకార బ్యాంక్(ఆప్కాబ్)కు ‘బిజినెస్ కరస్పాండెంట్లు’గానే వ్యవహరించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను ‘నాబార్డ్’ ఉపసంహరించుకుంది. పాత ఆదేశాలను సవరిస్తూ, ప్యాక్స్ గతంలోలాగే యథావిధిగా కార్యకలాపాలు నిర్వర్తించవచ్చని ‘నాబార్డ్’ ఇటీవలే తాజా మార్గదర్శకాలను జారీచేసింది.
వ్యవసాయరంగపు పెట్టుబడి అవసరాలు తీర్చడానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(ప్యాక్స్), జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లు, రాష్ట్ర సహకార బ్యాంకు(ఆప్కాబ్)లతో కూడిన మూడంచెల వ్యవస్థ ప్రస్తుతం ఉంది. ఈ వ్యవస్థ విపరీతమైన రాజకీయ జోక్యం కారణంగా కాలక్రమంలో తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. ఖాయిలా పడుతున్న సహకార రంగాన్ని మెరుగు పరచేందుకు ప్రభుత్వం పలు కమిటీలను వేసింది. ఈ క్రమంలో తాజాగా కేంద్రం నాబార్డు చైర్మన్ ప్రకాశ్ బక్షి ఆధ్వర్యంలో మరో కమిటీని వేసింది. ఇందులో వ్యవసాయ రుణాలు ఇవ్వడం లాంటి బ్యాంకింగ్ బాధ్యతల నుంచి ప్యాక్స్ ను తప్పించాలని, వాటి కార్యకలాపాలను ‘బిజినెస్ కరస్పాండెంట్లు’గా మాత్రమే పరిమితం చేయాలన్నది ప్రధాన సిఫారసు. దీనిపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. అన్ని వైపుల నుంచి వ్యతిరేకత రావడంతో కేంద్రం వెనక్కు తగ్గింది.