ఆ ఎత్తివేతపై ట్రంప్ అప్పీల్!
ఏడు ముస్లిం దేశాల పౌరులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఫెడరల్ జడ్జీ ఇచ్చిన ఉత్తర్వులను ట్రంప్ సర్కారు సవాల్ చేసింది. ట్రావెల్ బ్యాన్‌ను ఎత్తివేస్తూ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలంటూ అమెరికా న్యాయశాఖ శనివారం ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసింది. ఏడు ముస్లిం దేశాల నుంచి వలస వచ్చే వారిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధాన్ని సియాటెల్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి జేమ్స్ రాబర్ట్ తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే.
కోర్టు ఉత్తర్వులతో ట్రావెల్ బ్యాన్‌ను తాత్కాలికంగా అమెరికా అధికారులు ఉపసంహరించుకోవడంతో ఏడు ముస్లిం మెజారిటీ దేశాలకు చెందిన పౌరులు అమెరికాలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. లండన్, పారిస్ నుంచి న్యూయార్క్, వాషింగ్టన్ వచ్చేందుకు ప్రామాణిక వీసా ఉన్న ఆయా దేశాల పౌరులు ప్రయత్నిస్తున్నారు. ఫెడరల్ జడ్జీ ఆదేశాలతో ప్రభుత్వ ఏజెన్సీలు, అంతర్జాతీయ విమానాయాన సంస్థలు కూడా ట్రావెల్ బ్యాన్ ఆదేశాలను ఉపసంహరించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఫెడరల్ జడ్జీ ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేసి.. తిరిగి నిషేధాన్ని అమల్లోకి తీసుకురావాలని ట్రంప్ సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసింది.
ఏడు ముస్లిం మెజారిటీ దేశాలనుంచి వలసలపై తన కార్యనిర్వాహక ఆదేశాలపై సియాటెల్ డిస్ట్రిక్ట్ జడ్జి తాత్కాలికంగా నిషేధం విధించటంపై ట్రంప్ మండిపడుతున్న సంగతి తెలిసిందే. ‘జడ్జిది పిచ్చి నిర్ణయం’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం అర్థరాత్రి వెల్లడైన ఆదేశాలపై స్పందిస్తూ.. ‘సోకాల్డ్ న్యాయమూర్తి (జేమ్స్ రాబర్ట్) తీసుకున్న నిర్ణయం దేశం నుంచి చట్టాన్ని వేరుచేస్తోంది. ఇది పిచ్చి నిర్ణయం. ఇది తిరగబడుతుంది’ అని ట్విటర్ వేదికగా ఆగ్రహించారు. అయితే, ఒక అధ్యక్షుడు ఫెడరల్ జడ్జిపై ఇలా వ్యాఖ్యలు చేయడం అమెరికాలో ఇదే తొలిసారి అని, ట్రంప్‌లో న్యాయస్థానాన్ని ధిక్కరించే ధోరణి కనిపిస్తున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.