కుక్కల పెంపకంపై నిషేధం.. పెంచితే కాల్చివేత
బీజింగ్: తూర్పు చైనాలోని ఓ జిల్లా యంత్రాంగం కుక్కుల పెంపకాన్ని నిషేధించింది. ఇళ్లలో ఉన్న పెంపుడు కుక్కలను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి ఉంచుకుంటే, ఇళ్లలోకి వచ్చి కుక్కులను అక్కడికక్కడే కాల్చివేస్తామని అధికారులు హెచ్చరించారు. సెప్టెంబర్ 10 లోగా కుక్కలన్నింటీని తొలగించాలని గడువు విధించారు. షాన్‌డాండ్ ప్రావిన్స్‌లోని డయాంగ్ జిల్లా యంత్రాంగం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
జంతు ప్రేమికులు ఈ నిర్ణయంపై నిరసన తెలియజేసినా జిల్లా యంత్రాంగం ఖాతరు చేయడం లేదు. లైసెన్స్ ఉన్న వారు కూడా కుక్కలను పెంచుకోరాదని ఆంక్షలు విధించింది. జిల్లాలో పరిశుభ్రత, ప్రజల శ్రేయస్సు కోసం ఈ చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది. ఇంతకుమించి కారణాలు చెప్పలేదు. కాగా డయాంగ్ జిల్లా యంత్రాంగం పెంపుడు కుక్కలను నిషేధించడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. చాలా మందికి పెంపుడు కుక్కలున్నాయని, లైసెన్స్‌లు కూడా కలిగి ఉన్నారని చెప్పారు. తన ఇంట్లోకి వచ్చే అధికారం అధికారులకు లేదని, తన కుక్కను ఎలా చంపుతారో చూస్తానని డయాంగ్ జిల్లా వాసి అన్నాడు.