band aid
-
నోటి పుండ్లకు బ్యాండ్ ఎయిడ్!
నోట్లో తరచూ పుండ్లు ఏర్పడుతూంటే కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. మందులు వాడదామా? అంటే అవి నోట్లో నిలబడవు కాబట్టి ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు షెఫీల్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పరిష్కారాన్ని కనుక్కున్నారు. పుండ్లు ఉన్న చోట అతుక్కుపోయే బ్యాండ్ఎయిడ్ ఒకదాన్ని వీరు అభివృద్ధి చేశారు. ప్రత్యేకమైన ప్లాస్టిక్స్తో తయారు చేసిన ఈ బ్యాండ్ఎయిడ్ నేరుగా పుండ్లపైకే మందులు అందించడం ద్వారా అది తొందరగా మానేందుకు సాయపడుతుంది. ఇది కేవలం నోటి పుండ్లకు మాత్రమే కాకుండా ఓరల్ లిచెన్ ప్లానస్, ఆఫథాస్ స్టోమటాటిస్వంటి ఇతర సమస్యలకు కూడా వాడుకోవచ్చునని డాక్టర్ క్రెయిగ్ మర్డోక్ తెలిపారు. డెర్మాట్రీట్ అని పిలుస్తున్న ఈ సరికొత్త బ్యాండ్ ఎయిడ్ నోటి సమస్యలకు ఇప్పటివరకూ వాడుతున్న క్రీములు, మౌత్వాష్లలో స్టెరాయిడ్లు ఉంటాయని, ఫలితంగా సైడ్ఎఫెక్ట్స్ కూడా ఎక్కువని చెప్పారు. డెర్మాట్రీట్... సమస్య ఉన్న ప్రాంతంలో మాత్రమే పనిచేస్తుంది కాబట్టి దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయని వివరించారు. మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా డెర్మాట్రీట్ ద్వారా మరిన్ని వ్యాధులకు మందులు అందించేదిగా మార్చవచ్చునని నిపుణుల అంచనా. -
మధుమేహరోగుల గాయాన్ని తగ్గించే బ్యాండేజీ
చికాగో: మధుమేహంతో బాధపడేవారికి చిన్న గాయమైనా సరే.. అంత తేలిగ్గా మానదు. అది తగ్గే వరకు వారి బాధ వర్ణణాతీతం. అలాంటి వారికోసమే నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త బ్యాండేజీని తయారు చేశారు. ఎస్డీఎఫ్–1 ప్రొటీ తో కూడిన ఈ ప్లాస్టిక్ బ్యాండేజీ నుంచి ప్రోటీ నిదానంగా విడుదలవుతుంది. ఈ బ్యాండేజీని గాయమైన చోట అతికిస్తే అక్కడ కొత్త రక్తనాళాలు వేగంగా పెరిగేట్టు చేయడమే కాకుండా గాయాలను తొందరగా మానిపోయేందుకు సహకరించే మూలకణాలను ఆకర్షిస్తుంది. ఫలితంగా రక్తప్రసరణ పెరిగి గాయం త్వరగా మానిపోతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు స్పర్శ జ్ఞానం తక్కువగా ఉండడంవల్ల కొన్ని సార్లు గాయాల నొప్పి కూడా తెలియకపోవడంతో చికిత్స తీసుకోరు. ఫలితంగా ఈ గాయాలైన అవయవాలను తొలగించాల్సిన పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. పైగా రక్తంలో చక్కెర మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల రక్త ప్రసరణ తగ్గిపోయి గాయం మానేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఇటువంటి సమస్యలన్నింటినీ ఈ బ్యాండేజీ పరిష్కరిస్తుందని చెబుతున్నారు.