అమరుల కుటుంబాలకు పార్టీ టికెట్లు : లోక్‌సత్తా
కామారెడ్డి, న్యూస్‌లైన్:
సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న తెలంగాణ అమరుల వీరుల కుటుంబాల సభ్యులకు తమ పార్టీ అవకాశం ఇస్తుందని లోక్‌సత్తా తెలంగాణ రాష్ర్టశాఖ అధ్యక్షుడు బండారు రామ్మోహన్‌రావ్ అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన వారి కుటుంబాలు, తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతం చేసిన కవులు, కళాకారులను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోదని, తాము మాత్రం వారు పోటీకి ఆసక్తి చూపితే టిక్కెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే సరిపోదని, ప్రజల సమస్యలు పరిష్కారమై, ప్రజల ఆకాంక్షలు నెరవేరాల్సి ఉందన్నారు.
లోక్‌సత్తా ప్రజల ఎజెండాతో పనిచేస్తుందని, వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిన వెంటనే తమ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట శాఖలను ప్రకటించి, అందరికన్నా ముందున్నదన్నారు. విభజన సందర్భంలో లోక్‌సత్తా చెప్పిన ఏడు అంశాలకు ఆమోదం లభించిందన్నారు. సమావేశంలో లోక్‌సత్తా నేతలు మర్రి రాంరెడ్డి, రవీందర్, విజేందర్‌రెడ్డి, మొయినొద్దిన్, గీతామూర్తి, ఏకేలత, వేదశ్రీ, రమణారావ్, పద్మ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.