సైబర్ హబ్‌ల మధ్య నాన్‌స్టాప్ విమానం!
ఢిల్లీ: సైబర్ హబ్‌లుగా ప్రఖ్యాతి చెందిన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, భారత్‌లోని బెంగళూరు నగరాల మధ్య నాన్ స్టాప్ విమాన సర్వీసులు నడపాలని ఎయిర్ ఇండియా నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఓ ప్రతిపాదనను పంపించినట్లు ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు శనివారం నాడిక్కడ తెలియజేశారు. బెంగళూరుకు దాదాపు 14 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోకు నేరుగా విమానంలో వెళ్లాలంటే 17 గంటల నుంచి 18 గంటల వరకు సమయం పడుతుందని అంచనా. ఈ నగరాల మధ్య విమాన సర్వీసు అమల్లోకి వస్తే ఇదే ప్రపంచంలోకెల్లా లాంగెస్ట్ రూట్ అవుతుంది.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి అమెరికాలోని సిలికాన్ వ్యాలీని సందర్శించి ప్రసంగించిన అనంతరం ఈ కొత్త విమాన సర్వీసు గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మోదీ భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రికి సిలికాన్ వ్యాలీకి చేరుకొని, రెండు రోజుల పాటు అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా లాంగెస్ట్ నాన్ స్టాఫ్ విమాన సర్వీసును ఖాంటాస్ విమానయాన సంస్థ నిర్వహిస్తోంది. అమెరికాలోని డల్లాస్ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీ మధ్య (13,730 కిమీ) ఈ విమాన సర్వీసు నడుస్తోంది. దీన్ని ఎమిరేట్స్ విమాన సర్వీసు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బ్రేక్ చేయనుంది. దుబాయ్, పనామా నగరాల మధ్య (13,730) నాన్ స్టాప్ విమానాలను నడపాలని ఎమిరేట్స్ ఎయిర్ వేస్ నిర్ణయించింది. బెంగళూరు నుంచి శాన్ ఫ్రాన్సిస్కో నగరాల మధ్య నాన్ స్టాప్ విమాన సర్వీసును ప్రారంభించాలనే ఎయిర్ ఇండియా ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రపంచంలో అదే లాంగెస్ట్ రూట్ విమాన సర్వీసు అవుతుంది.