నకిలీ చెలా‘మనీ’
సాక్షి, ముంబై: నకిలీ నోట్లు తరలిస్తున్న ఓ బంగ్లాదేశీయున్ని ఏటీఎస్ అధికారులు గురువారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అరెస్టు చేశారు. తనిఖీ చేయగా అతడి నుంచి రూ.2.50 లక్షల నకిలీ నోట్లు లభ్యమయ్యాయి. మాన్ ఖుర్ద్ రైల్వే స్టేషన్ సమీపంలోకి నకిలీ నోట్లు తీసుకుని వస్తున్నట్లు ముంబై ఏటీఎస్ బృందానికి సమాచారం అందింది. ఆ ప్రకారం వారు మారువేషాల్లో కాపు కాశారు. అనుకున్న ప్రకారం అక్కడికి ఓ వ్యక్తి వచ్చాడు.
కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారించగా తడబడుతూ సమాధానం ఇచ్చాడు. సంచిలో సోదా చేయగా భారత్ కరెన్సీ దొరికింది. అవి నకిలీ నోట్లని తేలింది. నిందితుడు బంగ్లాదేశ్‌కు చెందిన దిలావర్ హుసెన్(27)గా గుర్తించారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లో రూ.500 నోట్లు 304, రూ.1000 నోట్లు 79, మరికొన్ని వంద రూపాయల నోట్లు ఉన్నాయి. హాకర్ల ద్వారా వీటిని చెలామని చేస్తున్నట్లు తెలిసింది.అయితే వీటిని ఎక్కడి నుంచి, ఎవరికి ఇచ్చేందుకు తెచ్చాడో వివరాలు సేకరిస్తున్నారు.