Bank branch
-
ఛత్తీస్‌గఢ్‌లో ఉత్తుత్తి ‘ఎస్బీఐ’ శాఖ
జంజ్‌గిర్–చంపా(ఛత్తీస్‌గఢ్): ఆన్లైన్ మోసాల బారినపడిన బాధితులు మొట్టమొదట న్యాయం కోసం వెళ్లేది బ్యాంక్ బ్రాంచ్ వద్దకే. అలాంటి బ్యాంక్ కార్యాలయం నకిలీ అని తేలితే?. ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి మోసం ఒకటి తాజాగా వెలుగుచూసింది. ఈ ఉదంతంలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పేరిట కొందరు మోసగాళ్లు నకిలీ ఎస్బీఐ బ్రాంచ్‌ను తెరచి జనం నుంచి డబ్బులు ‘ఫిక్స్డ్’ డిపాజిట్లు తీసుకోవడం మొదలెట్టారు. శక్తి జిల్లా అదనపు ఎస్పీ రామాపటేల్ తెలిపిన వివరాల ప్రకారం.. శక్తి జిల్లాలోని మల్ఖారౌదా పోలీస్‌స్టేషన్‌పరిధిలోని ఛంపోరా గ్రామంలో సెప్టెంబర్ 18వ తేదీన కొత్తగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ తెరుచుకుంది. అక్కడి దుకాణసముదాయంలో ఒక షాప్‌ను అద్దెకు తీసుకుని కంప్యూటర్లు, ఇతర బ్యాంకింగ్ సామగ్రితో ఎస్బీఐ శాఖను కొందరు మొదలుపెట్టారు. అయితే ఈ బ్రాంచ్‌పై అనుమానం వచ్చిన ఒక వ్యక్తి పోలీసులు, బ్యాంక్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదుచేశారు. దీంతో హుతాశులైన పోలీసులు, కొర్బా పట్టణంలోని ఎస్బీఐ రీజనల్ ఆఫీస్ బృందంతో కలిసి ఈ నకిలీ బ్రాంచ్‌కు హుటాహుటిన వచ్చారు. అప్పుడు ఆ నకిలీ బ్రాంచ్‌లో ఐదుగురు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అక్కడి ఉద్యోగులకు తాము నకిలీ బ్రాంచ్‌లో పనిచేస్తున్నామన్న విషయం కూడా తెలీదని వార్తలొచ్చాయి. బ్యాంక్ మేనేజర్‌గా చెప్పుకునే ఒక వ్యక్తి వీరిని ఇంటర్వ్యూ చేసి నియమించుకున్నాడని సమాచారం. దీంతో ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీసులు ప్రశ్నించడం మొదలెట్టారు. బ్రాంచ్‌లోని కంప్యూటర్లు, ఇతర మెటీరియల్‌ను స్వా«దీనం చేసుకున్నారు. అయితే ఈ నకిలీ బ్రాంచ్ వల్ల ఎవరైనా మోసపోయారా? ఎంత మంది డిపాజిట్లు చేశారు? ఇతర తరహా లావాదేవీలు జరిగాయా? అనే వివరాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. -
నకిలీ బంగారంతో రూ 2.71 కోట్లకు టోకరా
గుంటూరు రూరల్: గుంటూరు నగర శివారులోని ఒక బ్యాంకు బ్రాంచిలో భారీ మోసం బయటపడింది. కొందరు వ్యక్తులు నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందినట్టు వెల్లడైంది. ఇందులో బ్యాంకు అప్రైజర్ ప్రమేయం కూడా ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవహారం బయటపడకుండా కొందరు అధికారులు నిజమైన బంగారం తాకట్టు పెట్టిన వారికి వారు వడ్డీతో కలిపి చెల్లించాల్సిన మొత్తం కంటే ఎక్కువ కట్టాలని నోటీసులు పంపడం, ఆడిట్లో అసలు విషయాలు వెలుగుచూడటంతో మొత్తం గుట్టంతా రట్టయింది. మొత్తం 107 మంది నకిలీ బంగారంతో రుణాలు పొందినట్లు వెల్లడైంది. నిజమైన బంగారంతో రుణాలు పొందిన ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి ఎక్కువ మొత్తానికి ఎందుకు నోటీసులు ఇచ్చారని ప్రశి్నంచినందుకు వారిని కూడా ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంపై ఆడిట్ ధికారులు, బ్యాంక్ అధికారులు గుంటూరు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం నల్లపాడు సీఐ రాంబాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంటూరు – అమరావతి రోడ్డు గోరంట్ల గ్రామంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో ఆడిట్ నిర్వహిస్తుండగా వెండి వస్తువులకు బంగారు పూత పూసి బంగారు వస్తువులుగా చూపి పలువురు కోట్ల రూపాయలు రుణాలు పొందారని బ్యాంక్ ఇంటర్నల్ అధికారి అనిల్ డెకాబె, బ్యాంక్ రీజినల్ మేనేజర్ ధనరాజ్ ఫిర్యాదు చేశారు. 2021 జనవరి 29 నుంచి 2023 నవంబరు 16 వరకు ఆడిట్ నిర్వహించగా 107 ఖాతాలలో నకిలీ బంగారంతో రుణాలు పొందినట్లు గుర్తించారు. వీటిలో దాదాపు 100 ఖాతాలలో నకిలీ బంగారం పెట్టి రుణం పొందే సమయంలో రీ అప్రైజల్ కూడా నిర్వహించలేదని గుర్తించారు. ఈ విధంగా నకిలీ బంగారంతో రూ.2.71 కోట్లు బ్యాంకుకు టోకరా వేసినట్లు తేలిందన్నారు. లోన్ అప్లికేషన్స్, అప్రైజల్ తదితర పరిశీలనలు చేయకుండా రుణాలు ఇ చ్చి నట్లు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. నిజమైన బంగారంతో రుణాలు పొందిన పలువురు ఖాతాదారులకు వారు తీసుకున్న రుణం కంటే రెండు రెట్లకు నోటీసులు రావడంతో వారంతా కూడా పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. -
జూలై ఒకటి నుంచి ఎస్బీఐ కొత్త రూల్స్!
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై ఒకటి నుంచి కొత్త నిబందనలను అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబందనలను ప్రతి ఖాతాదారుడు తెలుసుకోవాలి అని స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ ను కోరింది. ఎటిఎమ్ నుంచి నగదు విత్ డ్రా, బ్రాంచీ నుంచి నగదు విత్ డ్రా, చెక్ బుక్ వంటి అంశాలకు సంబంధించిన చార్జీల విషయంలో మార్పులు చేసినట్లు పేర్కొంది. ఈ కొత్త రూల్స్ కేవలం బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్ బీడి) ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది. జూలై ఒకటి నుంచి బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులు ఎటిఎమ్ ద్వారా నెలలో నాలుగు సార్లకు మించి ఎక్కువ సార్లు నగదు విత్ డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి లావాదేవిపై రూ.15 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి నెలలో నాలగు సార్లకు మించి డబ్బులు తీసుకుంటే కూడా అదే చార్జీలు పడతాయి. ఇక బీఎస్ బీడి ఖాతాదారులకు ఎస్బీఐ ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ లీవ్స్‌ను ఉచితంగా అందిస్తుంది. వీటి తర్వాత మరో 10 చెక్ లీవ్స్ కావాలంటే రూ.40 ఛార్జీ పడుతుంది. అలాగే జీఎస్టీ అదనం. ఇక 25 చెక్ లీవ్స్‌కు అయితే రూ.75 చార్జీ ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ చెక్ బుక్ (10 చెక్ లీవ్స్) కోసం అయితే రూ.50 కట్టాలి అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. కానీ ఈ రూల్స్ సీనియర్ సిటిజన్స్ కి వర్తించవు. చదవండి: కొత్త ఇళ్లు కొనేవారికి కేంద్రం గుడ్ న్యూస్! -
3 నెలల్లో భారత్‌లో ఇరాన్ బ్యాంక్ శాఖ
న్యూఢిల్లీ: ఇరాన్‌లోని సిస్తాన్–బెలూచిస్తాన్‌లో ఉన్న చాబహార్ పోర్టు త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాగలదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇందుకు సంబంధించిన లావాదేవీల నిర్వహణ కోసం ఇరాన్‌కి చెందిన ఒక బ్యాంకు ముంబైలో శాఖను ప్రారంభించనుందని, దీనికి కేంద్రం అనుమతులిచ్చిందని ఆయన చెప్పారు. మూడు నెలల్లో ఇది ప్రారంభమవుతుందన్నారు. ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మొహమ్మద్ జావద్ జరీఫ్‌తో మంగళవారం సమావేశమైన సందర్భంగా గడ్కరీ ఈ విషయాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య వస్తు మార్పిడి విధానం మొదలైన పలు ప్రతిపాదనలు జరీఫ్ ప్రస్తావించినట్లు ఆయన పేర్కొన్నారు. భారత్ నుంచి ఉక్కు తీసుకుని, ప్రతిగా యూరియా సరఫరా చేసేందుకు ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. మరోవైపు, ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోవడాన్ని కొనసాగించేలా.. అమెరికా ఆంక్షల నుంచి భారత్ మరోసారి మినహాయింపులు పొందగలదని ఆశిస్తున్నట్లు జరీఫ్ చెప్పారు. -
నా 55 కోట్లు ఎక్కడ?
బ్యాంకుకు తాళం వేసిన వృద్ధురాలు టీనగర్(చెన్నై) : తన బ్యాంకు ఖాతాలోని రూ. 55 కోట్లు ఏమయ్యాయంటూ ఓ వృద్ధురాలు బ్యాంకు శాఖకు తాళం వేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తిరుపూర్ జిల్లా పాపినికి చెందిన అరుక్కాత్తాళ్(65) కాంగేయంలోని భారత్ స్టేట్ బ్యాంకుకు తరచూ వచ్చి తన డబ్బెక్కడ అంటూ ఉద్యోగులను ప్రశ్నిస్తోంది. గురువారంఉద్యోగులు లోపల ఉండగానే బ్యాంకుకు తాళం వేసి అక్కడే బైఠాయించింద్ని పోలీసులొచ్చి తాళం తీసి వారిని విడిపించారు. వృద్ధురాలిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి విచారించి విడిచిపెట్టారు. మళ్లీ శుక్రవారం మధ్యాహ్నం తాళంతో వచ్చిన ఆమెను ఉద్యోగులు అడ్డుకున్నారు. -
సిండికేట్ బ్యాంక్ స్కామ్ పై సీబీఐ ఎఫ్ఐఆర్
వెయ్యి కోట్ల ఫ్రాడ్‌పై బ్యాంకు శాఖల్లో సోదాలు న్యూఢిల్లీ: దాదాపు రూ. 1,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి సిండికేట్ బ్యాంక్ శాఖల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. జైపూర్, ఢిల్లీ ఎన్సీఆర్, ఉదయ్‌పూర్‌లోని పది చోట్ల సోదాలు జరిపిన సీబీఐ అయిదుగురు అధికారులు, నలుగురు వ్యాపారవేత్తలపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. బ్యాంక్ సిబ్బందితో కుమ్మక్కై రాజస్తాన్‌లో సిండికేట్ బ్యాంక్‌కి చెందిన మూడు శాఖల్లో వీరు ఏకంగా 386 ఖాతాలు తెరిచారని ... నకిలీ చెక్కులు, లెటర్ ఆఫ్ క్రెడిట్లు, ఎల్ఐసీ పాలసీలతో రూ. 1,000 కోట్ల మోసానికి పాల్పడ్డారని అభియోగాలు చేసింది. 2011-16 మధ్య కాలంలో చోటుచేసుకున్న ఈ అవకతవకలు బ్యాంక్ సిబ్బంది సహకారం లేకుండా సాధ్యపడేవి కావని సీబీఐ వర్గాలు తెలిపాయి. వ్యాపారవేత్తలు నకిలీ చెక్కులు డిపాజిట్ చే సి, ఆ తర్వాత వాటిని డిస్కౌంటింగ్పై క్యాష్ చేసుకునేవారని (ఉదాహరణకు చెక్కు విలువ రూ. 100 అయితే, డిస్కౌంటు పోగా తక్షణం రూ.90 చేతికి వస్తుంది) వివరించాయి. ఎక్కువగా రూ. 2.5 కోట్ల నుంచి రూ. 4 కోట్ల విలువ చేసే చెక్కులు జమయ్యేవని సీబీఐ వర్గాలు తెలిపాయి. సీబీఐ సోదాల దరిమిలా బుధవారం ఎన్ఎస్ఈలో సిండికేట్ బ్యాంక్ షేరు ధర 1.78 శాతం క్షీణించి రూ. 60.75 వద్ద ముగిసింది. -
ప్రజల వద్దకు బ్యాంకర్లు
విజయనగరం అర్బన్: బ్యాంకుల్లో బారులు తీరి నించునే రోజులు పోయి బ్యాంకర్లే గ్రామాలకు వచ్చి వినియోగదారుల ముందు బారులు తీరుతున్నారు. బ్యాంక్ శాఖకు పరిధిలో ఉన్న ప్రజలు, ఖాతాదారులకు అందుబాటులో బ్యాంక్ అధికారులు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆదేశాలు జిల్లా లీడ్ బ్యాంక్ కార్యాలయానికి బుధవారం వచ్చాయి. ఏడాదిగా కేంద్రప్రభుత్వం అందిస్తున్న సేవింగ్ ఖాతాల ప్రారంభించడం, బీమా, రుణ, పెన్షన్ పథకాలను విస్తృత స్థాయిలో ప్రచారం చేసి ప్రాచుర్యంలోకి తీసుకురావాలని, ఆ దిశగా ప్రజలకు తెలియజే కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లాలోని ప్రతి బ్యాంక్ శాఖ సిబ్బంది కృషి చేయాలని సూచించారు. బ్యాంక్ శాఖలు లేని గ్రామాల్లో బిజినెస్ కరెస్పాండెంట్లను తక్షణమే నియమించుకోవాలని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు బ్యాంక్ పరిధిలో గ్రామాలకు ప్రతి బుధవారం మధ్యాహ్నం పూట బ్యాంకర్లు విధిగా వెళ్లి జన్మభూమి కమిటీల సమక్షంలో ప్రజలకు ఖాతాదారులకు, గ్రామ సభలను నిర్వహించాలి. అదే పట్టణ పరిధిల్లో అయితే బ్యాంక్ కార్యాలయం ఆవరణలో ఖాతాదారులకు ప్రతి బుధవారం మధ్యాహ్నం పూట అవగాహన సదస్సులను నిర్వహించాలి. నివేదికలు పంపాలి: లీడ్ బ్యాంక్ మేనేజర్ రాష్ట్ర స్థాయి లీడ్ బ్యాంక్ ఆదేశాల మేర కు బ్యాంకర్లు ప్రతి బుధవారం జన్మభూమి కమిటీలతో నిర్వహించిన సదస్సుల నివేదికను జిల్లా కేంద్రాలకు పంపాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎ.గురవయ్య తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రతి బుధవారం గ్రామాలకు వెళ్లి గ్రామ సభలను నిర్వహించాలని తెలి పారు. అదే పట్టణ ప్రాంతాలలో అయితే ప్రతి బుధవారం బ్యాంక్ కార్యాలయం ఆవరణలో నిర్వహించాలని ఆదేశాలొచ్చాయని చెప్పారు. వారంలో అందజేసిన వివిధ రకాల సేవలకు ఖాతాదారులకు వివరిస్తూ బ్యాంకింగ్ వ్యవస్థ తాలూకా ప్రాధాన్యతను వివరించాలని పేర్కొన్నారు.