Bank Money
-
బ్యాంకుల నుంచి పింఛన్ డబ్బు విత్‌డ్రా.. ఇకపై ఒక్కరు కాదు ఇద్దరు..
సాక్షి, అమరావతి: ప్రతి నెలా అవ్వాతాతల పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న డబ్బులను బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసే బాధ్యతను ఇకపై ఇద్దరేసి సచివాలయ ఉద్యోగులు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సీఈవో ఏఎండీ ఇంతియాజ్ శనివారం ఉత్తర్వులిచ్చారు. గ్రామాల్లో సచివాలయ పంచాయతీ కార్యదర్శి, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఇద్దరూ కలిసి బ్యాంకుల నుంచి డబ్బులు విత్ డ్రా చేయాలని ఆదేశాలిచ్చారు. పట్టణ ప్రాంతాల్లో వార్డు అడ్మిన్ సెక్రటరీ, వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఈ బాధ్యతను నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ప్రతి నెలా రూ.1,750 కోట్లను ప్రభుత్వం పింఛన్లుగా అందజేస్తోంది. లబ్ధిదారుల సంఖ్య మేరకు పింఛన్ డబ్బులను ఆయా సచివాలయాల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. సచివాలయ సిబ్బంది ఒకరు బ్యాంక్‌కు వెళ్లి ఆ డబ్బులను తీసుకువచ్చి.. వలంటీర్లకు అప్పగిస్తారు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, పట్టణాల్లో వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలు బ్యాంకుల నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారు. కొన్నిచోట్ల సిబ్బంది నగదు విత్ డ్రా చేసి తీసుకెళ్తున్నప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి. వీటి వల్ల లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం మళ్లీ నిధులు విడుదల చేయాల్సి వస్తోంది. ఏప్రిల్ 3న అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలో ఓ సచివాలయ మహిళా ఉద్యోగి బ్యాంక్ నుంచి రూ.16.15 లక్షలు తెస్తుండగా.. దొంగలు దోచుకెళ్లారు. ఇలాంటి ఘటనలను నివారించేందుకు తాజా ఆదేశాలు జారీ చేశారు. బ్యాంక్‌ల నుంచి పింఛన్ డబ్బులు డ్రా చేసిన దగ్గర నుంచి వలంటీర్లు నగదు పంపిణీ చేసే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సచివాలయ ఉద్యోగులిద్దరూ నగదుకు బాధ్యత వహించాలన్నారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల పర్యవేక్షణలోనే సొమ్మును విత్ డ్రా చేయాలన్నారు. ఇది కూడా చదవండి: ఆపరేషన్ కావేరీ.. సూడాన్ నుంచి ఏపీకి 48 మంది క్షేమంగా.. -
ఆ 99 కోట్లు గనుక నాకే వస్తే!
తన జనథన్ ఖాతాలో 99,99,99,394 రూపాయలు చూసి షాక్ అయిన మీరట్ మహిళ షీతల్ యాదవ్ వార్త నిన్నే చూశాం. షీతల్ ఓ ఫ్యాక్టరీలో నెలకు 5వేల వేతనానికి పని చేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆ వంద కోట్లు డబ్బు తన అకౌంట్లో ఎలా పడిందో తెలుసుకునే విఫలయత్నం చేశాక, తెలిసినవారి సాయంతో ఆమె ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. అయితే ఇలాంటి ఘటనే ఆస్ట్రేలియాలో జరిగినప్పుడు మాత్రం లూక్ బ్రెట్ మూర్ అనే యువకుడు ‘పండుగ’ చేసుకున్నాడు. మార్చి 2010లో ఆస్ట్రేలియాలోని పెద్ద బ్యాంకుల్లో ఒకటైన సెయింట్ జార్జ్ బ్యాంకులో ఖాత తెరిచాడు లూక్. అదే జూలైలో సాంకేతిక తప్పిదం వల్ల బ్యాంకు నుంచి తన ఖాతాలో డబ్బులు పడటం గమనించాడు. ముందు ఆశ్చర్యపోయినా, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అసలే ఉద్యోగం కూడా పోవడంతో ముందు చేసిన అప్పులన్నీ తీర్చాడు. లగ్జరీ హోటళ్లలో బస చేశాడు. ఖరీదైన కార్లను కొన్నాడు. విలాసవంతమైన ఫిషింగ్ బోట్ సొంతం చేసుకున్నాడు. మద్యం, కొకైన్ మత్తులో తూగాడు. స్ట్రిప్ క్లబ్‌లు తిరిగాడు. వందల డాలర్లు అమ్మాయిల మీద తగలేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే విచ్చలవిడి సుఖజీవితాన్ని గడిపాడు. జూలై 2010 నుంచి ఆగస్ట్ 2012 వరకు బ్యాంక్ నుంచి చేసిన 50 విత్‌డ్రాల్లో 19,88,535.25 డాలర్ల మొత్తం ఖర్చు చేశాడు. అతడు డ్రగ్ డీలింగ్స్‌లో సంపాదిస్తున్నాడనీ, గ్యాంగ్ స్టర్ అనీ చుట్టుపక్కల అనుమనాలు మొదలయ్యాయి. దగ్గిరవాళ్లు కొందరికి తెలిసనా, ‘ఏమీ అడగొద్దు, ఎవరికీ చెప్పొద్దు’ అన్నట్లుగా మౌనంగా ఉండిపోయారు. ‘ ఆ కాలం మొత్తం ఫన్, పార్టీయింగ్ చేశాను’ అంటాడు లూక్. చివరకు డిసెంబర్ 2012లో న్యూ సౌత్ వేల్స్‌లోని అతడి ఇంటిని రైడ్ చేసి, పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మోసపూరితంగా ఆర్థిక సాయం పొందినందుకూ, తెలిసీ నేరపూరితంగా వ్యవహరించినందుకూ’ సిడ్నీ జిల్లా కోర్టు అతడికి రెండేళ్ల మూడు నెలలు జైలుశిక్ష విధించింది. ఆరు నెలలు జైలులో గడిపాక, బెయిల్ మీద విడుదలయ్యాడు. న్యూ సౌత్ వేల్స్ క్రిమినల్ కోర్టు ఆఫ్ అప్పీల్‌ను ఆశ్రయించాడు. లూక్ ప్రవర్తనను తప్పు పడుతూనే, ‘నైతిక తప్పులకు శిక్ష విధించే అవకాశం లేదు’ అన్న కారణంగా న్యాయమూర్తి ఈ డిసెంబర్ 2016లోనే అతడి కేసును కొట్టేశారు. అయితే అకస్మాత్తు డబ్బుతో వచ్చే జీవితం అంత గొప్పదేమీ కాదని లూక్ అంటాడు. ఒక విధంగా అతి తన జీవితాన్ని నాశనం చేసిందని చెబుతాడు. ప్రస్తుతం లా చదువుతున్న లూక్ రెండేళ్లలో క్రిమినల్ లాయర్ అవుతానంటున్నాడు. -
నవీముంబైలో రూ.10 లక్షల చోరీ
నవీముంబై ఖార్ఘర్లో బ్యాంకు సొమ్ము తరలిస్తుండగా సాయుధ దుండగులు దాడిచేసి రూ.10 లక్షల నగదు తీసుకుని పారిపోయిన సంఘటన గురువారం ఉదయం జరిగింది. ముఖ్యంగా ఈ సంఘటన నగదు తీసుకుని వెళ్లే ప్రైవేటు సెక్యూరిటీ ఏజన్సీ కార్యాలయం ఎదుటే చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవల కాలంలో నవీముంబైలో ఇలాంటి సంఘటన జరగడం ఇది నాలుగోసారి కావడంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. ఖార్ఘర్ సెక్టార్ నంబరు-7లో రెడియంట్ క్యాష్ సర్వీసెస్ మేనేజ్మెంట్ కార్యాలయం ఉంది. ఇక్కడి నుంచి వేర్వేరు బ్యాంకుల ఏటీఎంలలో డబ్బులు నింపేందుకు సిబ్బంది బయలుదేరుతారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో క్యాష్ వ్యాన్లలో డబ్బులు అమరుస్తుండగా అకస్మాత్తుగా ఒక తెల్లరంగు స్కార్పియో వాహనం వచ్చింది. అందులో ఉన్న కొందరు క్యాష్ నింపే సిబ్బంది కళ్లలో కారంపొడి చల్లారు. తమవెంట తెచ్చుకున్న ఆయుధాలతో వారిపై దాడిచేసి గాయపరిచి రూ.10 లక్ష లు తీసుకుని ఉడాయించారు. ఈ దొంగలు సైన్-పన్వేల్ రహదారి మీదుగా పన్వేల్ దిశగా వెళుతుండగా ఓ చోట ట్రాఫిక్‌లో ఇరుక్కున్నారు. పక్కనే ఆగి ఉన్న ఆటో డ్రైవర్‌ను కొట్టి ఆటో తీసుకుని పారిపోయారు. కేసు నమోదుచేసిన పోలీసులకు ఇంతవరకు వారి గురించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. సెక్యూరిటీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల సాయం తీసుకుంటామని డిప్యూటీ పోలీసు కమిషనర్ సంజయ్ ఏనాపురే చెప్పారు. ఇటీవల కాలంలో జుయినగర్, విచంబేగావ్, వాషి కంపెనీల కార్యాలయంలో దోపిడీలు జరిగాయి. ఇందులో జుయినగర్ దోపిడీ ఘటన మినహా మిగతా రెండు కేసులు ఇంతవరకు పోలీసులు పరిష్కరించలేకపోయారు. నవీముంబై పోలీసులు చేపడుతున్న నాకాబందీలు, బీట్ మార్షల్స్ పెట్రోలింగ్ ఫలితాలివ్వడం లేదని ఈ సంఘటనలతో తేలిపోయింది.