ఆ 99 కోట్లు గనుక నాకే వస్తే!
తన జనథన్ ఖాతాలో 99,99,99,394 రూపాయలు చూసి షాక్ అయిన మీరట్ మహిళ షీతల్ యాదవ్ వార్త నిన్నే చూశాం. షీతల్ ఓ ఫ్యాక్టరీలో నెలకు 5వేల వేతనానికి పని చేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆ వంద కోట్లు డబ్బు తన అకౌంట్‌లో ఎలా పడిందో తెలుసుకునే విఫలయత్నం చేశాక, తెలిసినవారి సాయంతో ఆమె ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. అయితే ఇలాంటి ఘటనే ఆస్ట్రేలియాలో జరిగినప్పుడు మాత్రం లూక్ బ్రెట్ మూర్ అనే యువకుడు ‘పండుగ’ చేసుకున్నాడు.
మార్చి 2010లో ఆస్ట్రేలియాలోని పెద్ద బ్యాంకుల్లో ఒకటైన సెయింట్ జార్జ్ బ్యాంకులో ఖాత తెరిచాడు లూక్. అదే జూలైలో సాంకేతిక తప్పిదం వల్ల బ్యాంకు నుంచి తన ఖాతాలో డబ్బులు పడటం గమనించాడు. ముందు ఆశ్చర్యపోయినా, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అసలే ఉద్యోగం కూడా పోవడంతో ముందు చేసిన అప్పులన్నీ తీర్చాడు. లగ్జరీ హోటళ్లలో బస చేశాడు. ఖరీదైన కార్లను కొన్నాడు. విలాసవంతమైన ఫిషింగ్ బోట్ సొంతం చేసుకున్నాడు. మద్యం, కొకైన్ మత్తులో తూగాడు. స్ట్రిప్ క‍్లబ్‌లు తిరిగాడు. వందల డాలర్లు అమ‍్మాయిల మీద తగలేశాడు. ఒక‍్కమాటలో చెప్పాలంటే విచ్చలవిడి సుఖజీవితాన్ని గడిపాడు. జూలై 2010 నుంచి ఆగస్ట్ 2012 వరకు బ్యాంక్ నుంచి చేసిన 50 విత్‌డ్రాల్లో 19,88,535.25 డాలర్ల మొత్తం ఖర్చు చేశాడు.
అతడు డ్రగ్ డీలింగ్స్‌లో సంపాదిస్తున్నాడనీ, గ్యాంగ్ స్టర్ అనీ చుట్టుపక్కల అనుమనాలు మొదలయ‍్యాయి. దగ్గిరవాళ్లు కొందరికి తెలిసనా, ‘ఏమీ అడగొద్దు, ఎవరికీ చెప్పొద్దు’ అన్నట్లుగా మౌనంగా ఉండిపోయారు. ‘ ఆ కాలం మొత్తం ఫన్, పార్టీయింగ్ చేశాను’ అంటాడు లూక్. చివరకు డిసెంబర్ 2012లో న్యూ సౌత్ వేల్స్‌లోని అతడి ఇంటిని రైడ్ చేసి, పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మోసపూరితంగా ఆర్థిక సాయం పొందినందుకూ, తెలిసీ నేరపూరితంగా వ్యవహరించినందుకూ’ సిడ్నీ జిల్లా కోర్టు అతడికి రెండేళ్ల మూడు నెలలు జైలుశిక్ష విధించింది. ఆరు నెలలు జైలులో గడిపాక, బెయిల్ మీద విడుదలయ్యాడు. న్యూ సౌత్ వేల్స్ క్రిమినల్ కోర్టు ఆఫ్ అప్పీల్‌ను ఆశ్రయించాడు. లూక్ ప్రవర్తనను తప్పు పడుతూనే, ‘నైతిక తప్పులకు శిక్ష విధించే అవకాశం లేదు’ అన్న కారణంగా న్యాయమూర్తి ఈ డిసెంబర్ 2016లోనే అతడి కేసును కొట్టేశారు.
అయితే అకస్మాత్తు డబ్బుతో వచ్చే జీవితం అంత గొప్పదేమీ కాదని లూక్ అంటాడు. ఒక విధంగా అతి తన జీవితాన్ని నాశనం చేసిందని చెబుతాడు. ప్రస్తుతం లా చదువుతున్న లూక్ రెండేళ్లలో క్రిమినల్ లాయర్ అవుతానంటున్నాడు.