
పుణే: మహా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ జీవన్ నెడుంజెళియన్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జంట చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో జీవన్–విజయ్ జంట 3–6, 6–3, 10–0తో రెండో సీడ్ బ్లేక్ బేల్‌డన్–మాథ్యూ క్రిస్టోఫర్ (ఆ్రస్టేలియా) ద్వయంపై విజయం సాధించింది.
జీవన్–విజయ్ జోడీకి సంయుక్తంగా ఇదే తొలి టైటిల్ కాగా... విజయ్ సుందర్ పుణేలో మూడో సారి విజేతగా నిలిచాడు. తొలి సెట్‌లో పరాజయం పాలైన భారత జంట ఆ తర్వాత ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించింది. 2 ఏస్‌లు సంధించిన జీవన్–విజయ్ జోడీ... 3 డబుల్ ఫాల్ట్స్ చేసింది.
ఈ విజయంతో రూ. 7 లక్షల నగదు బహుమతితో పాటు 100 ర్యాంకింగ్స్ పాయింట్లు భారత ప్లేయర్ల ఖాతాలో చేరాయి. దీంతో ఏటీపీ ర్యాంకింగ్స్‌లో జీవన్ 94వ స్థానానికి, విజయ్ 104వ ర్యాంక్‌కు చేరనున్నారు.