సాక్షి, అమరావతి: ప్రతి నెలా అవ్వాతాతల పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న డబ్బులను బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసే బాధ్యతను ఇకపై ఇద్దరేసి సచివాలయ ఉద్యోగులు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సీఈవో ఏఎండీ ఇంతియాజ్ శనివారం ఉత్తర్వులిచ్చారు. గ్రామాల్లో సచివాలయ పంచాయతీ కార్యదర్శి, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఇద్దరూ కలిసి బ్యాంకుల నుంచి డబ్బులు విత్ డ్రా చేయాలని ఆదేశాలిచ్చారు.
పట్టణ ప్రాంతాల్లో వార్డు అడ్మిన్ సెక్రటరీ, వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సెక్రటరీ ఈ బాధ్యతను నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ప్రతి నెలా రూ.1,750 కోట్లను ప్రభుత్వం పింఛన్లుగా అందజేస్తోంది. లబ్ధిదారుల సంఖ్య మేరకు పింఛన్ డబ్బులను ఆయా సచివాలయాల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. సచివాలయ సిబ్బంది ఒకరు బ్యాంక్‌కు వెళ్లి ఆ డబ్బులను తీసుకువచ్చి.. వలంటీర్లకు అప్పగిస్తారు. ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, పట్టణాల్లో వార్డు వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సెక్రటరీలు బ్యాంకుల నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారు. కొన్నిచోట్ల సిబ్బంది నగదు విత్ డ్రా చేసి తీసుకెళ్తున్నప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి. వీటి వల్ల లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం మళ్లీ నిధులు విడుదల చేయాల్సి వస్తోంది.
ఏప్రిల్ 3న అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలో ఓ సచివాలయ మహిళా ఉద్యోగి బ్యాంక్ నుంచి రూ.16.15 లక్షలు తెస్తుండగా.. దొంగలు దోచుకెళ్లారు. ఇలాంటి ఘటనలను నివారించేందుకు తాజా ఆదేశాలు జారీ చేశారు. బ్యాంక్‌ల నుంచి పింఛన్ డబ్బులు డ్రా చేసిన దగ్గర నుంచి వలంటీర్లు నగదు పంపిణీ చేసే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సచివాలయ ఉద్యోగులిద్దరూ నగదుకు బాధ్యత వహించాలన్నారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల పర్యవేక్షణలోనే సొమ్మును విత్ డ్రా చేయాలన్నారు.
ఇది కూడా చదవండి: ఆపరేషన్ కావేరీ.. సూడాన్ నుంచి ఏపీకి 48 మంది క్షేమంగా..
Comments
Please login to add a commentAdd a comment