నగదు రహిత లావాదేవీలతో మెరుగైన ఆర్థిక వ్యవస్థ
కర్నూలు : నగదు రహిత లావాదేవీలపై బ్యాంకర్లు ఫ్లెక్సీలు, పోస్టర్లు, ఇతర మార్గాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో బుధవారం నగదు రహిత లావాదేవీలపై పోలీసు కుటుంబాలకు అవగాహన సదస్సు నిర్వహించారు. నగదు రహిత లావాదేవీలపై అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని డీజీపీ, రాయలసీమ ఐజీ ఆదేశించినట్లు ఎస్పీ వెల్లడించారు. లావాదేవీలపై అపోహలు తొలగించడం పోలీసుల బాధ్యత అన్నారు. కార్డులు స్వైప్ చేసేటప్పుడు పక్కనున్నవారు పిన్ నెంబర్లు చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్టేట్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు సీనియర్ ఆఫీసర్లు హరిబాబు, కిరణ్‌కుమార్, జానీ బాషా తదితరులు మాట్లాడుతూ ఆండ్రాయిడ్ ఫోన్‌తోనే కాకుండా ఇతర ఫోన్లతో కూడా ఎలాంటి సర్వీసు చార్జీలు లేకుండా డిసెంబర్ 31వ తేదీ వరకు మొబైల్ బ్యాంకింగ్‌ను వాడవచ్చన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, రామచంద్ర, సీఐలు కృష్ణయ్య, మహేశ్వరరెడ్డి, నాగరాజరావు, మధుసూదన్‌రావు, నాగరాజు యాదవ్, పోలీసు కుటుంబాలు, సిబ్బంది పాల్గొన్నారు.