‘సర్.. నాకు ఐదు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి! మంచిదేనా?’
Banking Tips: ఇవాళ రేపు అవసరానికో బ్యాంక్ ఖాతా తెరవాల్సి వస్తోంది. అలాగే ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటున్నవాళ్లు చాలామందే ఉంటున్నారు. అయితే ఇలా ఎక్కువగా కలిగి ఉండడం వల్ల లాభం కంటే.. ఇబ్బందులే ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా ఖాతాదారుడికి తెలియకుండానే డబ్బును పొగొట్టుకోవాల్సి వస్తుంది. అందుకే అవసరం లేని అకౌంట్లను క్లోజ్ చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు బ్యాంకింగ్ నిపుణులు.
‘మినిమమ్’ ట్రబుల్
ఎక్కువ ఖాతాలు ఉంటే.. వాటిల్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి. అన్ని ఖాతాల్లో ఎంతో కొంత డబ్బును డిపాజిట్ చేయాలి. ప్రధాన బ్యాంకుల్లో అకౌంట్లలో(జీరో బ్యాలెన్స్ అకౌంట్లు మినహాయించి) మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ ఛార్జీలు వెయ్యి, మూడు, ఐదు వేలు, పది వేలు ఇలా ఉంటోంది. ఉదాహరణకు.. ఐదు బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే.. పది, పాతిక, యాభై.. ఇలా వేల రూపాయల్లో డబ్బును ఖాతాల్లో ‘మినిమమ్ బ్యాలెన్స్’ రూపంలో ఉంచాల్సి వస్తుంది. ఇదికాకుండా ఇతర ఛార్జీల వసూలు ఉంటుంది. ఇలా ఎలా చూసినా ఇబ్బందే!.
శాలరీ అకౌంట్లే ఎక్కువ!
బ్యాంకులు స్టూడెంట్ అకౌంట్లు, శాలరీ అకౌంట్లుగా ‘జీరో బ్యాలెన్స్’ అకౌంట్లతో టార్గెట్లను పూర్తి చేసుకుంటాయి. ముఖ్యంగా ఉద్యోగులు కంపెనీలు మారినప్పుడు.. మరో అకౌంట్‌కు ఎక్కువగా మారిపోవాల్సి వస్తోంది. అలాంటి సందర్భాల్లో బద్ధకాన్ని వదిలి బ్యాంకులకు వెళ్లి పాత బ్యాంక్ ఖాతాను(అవసరం లేకుంటే) మూసివేయడమే మంచిది. ఎందుకంటే శాలరీ అకౌంట్లు, జీరో బ్యాలెన్స్ అకౌంట్లో చాలాకాలం డిపాజిట్ చేయకుండా ఉంటే.. సాధారణ సేవింగ్స్ అకౌంట్‌కు మారిపోతాయి. అప్పుడు కచ్చితంగా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మెయింటెన్ చేయకపోతే.. సర్ ఛార్జీలు పడుతూనే పోతుంటాయి. ఒకానొక దశకు వచ్చేసరికి అవి వేల రూపాయల్లోకి కూడా కూడా చేరుకోవచ్చు!!.
ఐటీ రిటర్న్స్ టైంలో..
కొన్ని అకౌంట్లు సంవత్సరాల తరబడి అలాగే ఉండిపోతాయి. బ్యాంకులు వాటిని మూసేయవు. కాకపోతే ఎక్కువ కాలం ట్రాన్జాక్షన్స్ జరగని అకౌంట్లను సాధారణంగా కొన్ని బ్యాంకులు డీయాక్టివేట్ చేస్తాయి. ఒకవేళ ఆ అకౌంట్లను తిరిగి ఉపయోగించుకోవాలనుకుంటే(యాక్టివేషన్ కోసం) రాతపూర్వకంగా రిక్వెస్ట్ లెటర్‌తో బ్యాంక్‌ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పైగా సేవింగ్స్ ఖాతాల్లో(అవసరం లేనివి, పెద్దగా ఉపయోగించని అకౌంట్లు) మినిమమ్ బ్యాలెన్స్‌తో ఎలాంటి రాబడీ రాకపోగా, ఆదాయ పన్ను రిటర్నుల సమయంలో అన్ని ఖాతాల వివరాలు అందించాల్సి ఉంటుంది. అలాగే వాటి నుంచి డబ్బు సర్‌ఛార్జీల రూపంలో కట్ అయినప్పుడల్లా.. మరింత డిపాజిట్ జమ చేయాల్సి ఉంటుంది. ఇక కార్డుల మెయింటెనెన్స్, ఏటీఎం ఛార్జీలు, మొబైల్ అలర్టు అంటూ పడే ఛార్జీల సంగతి సరేసరి!.
ఇలా చేస్తే బెటర్
ఒక వ్యక్తికి సగటున శాలరీ అకౌంట్, అవసరాలకు తగ్గట్లు పర్మినెంట్ అకౌంట్లు, ఉమ్మడి ఖాతాలు ఉంటే చాలు. ఉద్యోగం మారినప్పుడు వేతన ఖాతాలు మారుతుంటాయి. వీలుంటే ఉద్యోగం మారినా.. పర్మినెంట్ అకౌంట్‌నే శాలరీ అకౌంట్‌గా మార్చేసుకునే ప్రయత్నం చేయాలి. కొత్త ఖాతాకి వెళ్లినప్పుడు మాత్రం.. అవసరం లేని పాత ఖాతాల్ని మూసేయడం మంచిది. ముఖ్యంగా పీఎఫ్ అకౌంట్ల విషయంలోనూ పాత అకౌంట్లను క్లోజ్ చేసి.. కొత్త అకౌంట్లకు షిఫ్ట్ చేయడం వల్ల ఒక అదనపు అకౌంట్‌ను మెయింటెన్ చేయాల్సిన బాధ తప్పుతుంది. ఇక ఇన్వెస్ట్మెంట్ల కోసం ప్రత్యేకంగా ఖాతాలు తీసుకోకుండా.. పర్మినెంట్ అకౌంట్‌నే ఉపయోగించాలి.
బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీలు వస్తాయన్నది తెలిసిందే. కానీ, ఖాతాదారుడు అన్ని ఖాతాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండలేడుగా!. కాబట్టే.. అవసరాలకు తగ్గట్లు రెండు లేదా మూడు అకౌంట్ల కంటే ఎక్కువ కలిగి ఉండకపోవడమే మంచిదని ఆర్థిక సలహాదారులు చెప్తున్నారు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేప్పుడు సింగిల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటే పని తేలిక అవుతుంది. వీటికి తోడు బ్యాంక్ ట్రాన్జాక్షన్స్ను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం, పాస్ వర్డ్‌లను, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యవహారాలను తేలికగా గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుంది.