పెద్దనోట్లపై మరో షాకింగ్ న్యూస్..!
న్యూఢిల్లీ: రద్దయిన రూ.500, రూ.1000 లకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ ఒకటి ఆందోళన పుట్టిస్తోంది. నవంబరు 8న అత్యధిక చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లను రద్దుచేసి సంచనం సృష్టించిన కేంద్ర ప్రభుత్వం మరో సంచలన ఆర్డినెస్స్ జారీ చేయనుందట. ఈ కొత్త చట్టం ప్రకారం నిషేధిత రూ.500 ,రూ.1000 రూపాయి నోట్లను రూ.10,000పైగా కలిగి ఉండటం ఇకమీదట నేరంగా పరిగణిస్తారు. రూ. 10 వేలకు పైగా రద్దయిన పాత నోట్లను కలిగి వుంటే భారీ జరిమానా విధించనుంది. రూ.50వేల జరిమానా లేదా పట్టుబడిన సొమ్ముకు అయిదు రెట్లు జరిమానా విధించనుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పురపాలక మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో విచారించి, జరిమానాను నిర్ణయిస్తారు. అలాగే డిసెంబర్ 30తరువాత రద్దయిన నోట్లను నేరుగా రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లలో డిపాజిట్ చేయవచ్చు. దీనికి సంబంధించిన గ్రేస్ పీరియడ్ ను తరువాత ప్రకటించనుంది. డిసెంబర్30లోపు ఈ ఉత్తర్వులను విడుదల చేసేందుకు యోచిస్తోందట.
కాగా 80 శాతం చెలామణిలో రూ. 15.44 లక్షల కోట్ల నోట్ల రద్దు తర్వాత డిసెంబర్ 13 నాటికి 12.44 లక్షల కోట్ల డిపాజిట్ అయినట్టు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. డిసెంబర్ 30 గడువు లోపల మొత్తం డిపాజిట్లు రూ.13-13.5 లక్షల కోట్లగా ఉండనుందని ఆర్థిక వేత్తలు అంచనావేస్తున్నారు. పెద్దనోట్ల డిపాజిట్ల గడువు ఈ నెల 30తో ముగియనున్న సంగతి తెలిసిందే.