bapatla town
-
గంగ పుత్రులకు భరోసా
-
ఘొల్లుమన్న స్టూవర్టుపురం! నూతన సంవత్సర వేడుకల్లో పెను విషాదం
బాపట్లటౌన్: మండల పరిధిలోని స్టువర్టుపురం గ్రామం ఘొల్లుమంది. గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో తల్లీ కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కొత్త సంవత్సరం వేడుకల జరుపుకునే తరుణంలో ఈ దుర్ఘటన జరగడంతో మృతుల కుటుంబాన్ని కలచివేసింది. వెదుళ్ళపల్లి ఎస్ఐ జనార్ధన్ కథనం ప్రకారం.. స్టూవర్టుపురం గ్రామానికి చెందిన పోలా కమలమ్మ (61), పోలా తేజ (33) గ్రామంలోని చర్చికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలవడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటికే తల్లీ కుమారుడు మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తేజ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన స్టూవర్టుపురం గ్రామానికి వచ్చారు. తేజ భార్య అంజలి పిడుగురాళ్లలోని గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. కన్నతల్లిని చూసేందుకు స్వగ్రామానికి వచ్చిన భర్త తేజ, అత్త కమలమ్మ ఇరువురు మృతి చెందడంతో మృతుడి భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. మృతుడి కుటుంబాన్ని ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి కారణమైన వాహనం ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: చికిత్స సమయంలో భార్య మృతి చెందిందని డాక్టర్‌ను షూట్ చేశాడు! -
ఆ దేవుడే జగనన్న రూపంలో వచ్చాడు
సాక్షి, బాపట్లటౌన్: ‘‘నాది బాపట్ల మండలం, నరసాయపాలెం గ్రామం. నేను నరసాయపాలెం–కంకటపాలెం వెళ్లే దారిలో 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నా. నాకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. పిల్లలు పుట్టిన ఐదేళ్లకే నా భర్త అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటినుంచి ఇద్దరు పిల్లలను పెట్టుకొని కాలువకట్ట పక్కనే గుడిసెలో నివశిస్తూ ఉన్నాను. రెక్కల కష్టం మీదనే నా కూతురు, కొడుకుకు పెళ్లిళ్లు చేశాను. దేవుడికి కూడా నా మీద జాలి లేకుండా పోయింది. నా కొడుకుకు పెళ్లి చేసిన తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు. మనుడు పుట్టిన నాలుగేళ్లకే నా కొడుకు చనిపోయాడు. చిన్నప్పటి నుంచి మగ దిక్కులేని సంసారాన్ని ఈదుకొస్తున్నప్పటికీ నాకున్న ఏకైక కొడుకును కూడా దేవుడు పొట్టన పెట్టుకున్నాడు. అప్పటినుంచి నేను, నా కోడలు అదే కాలువకట్ట వెంబడి నివాసం ఉంటూ కాయకష్టం చేసుకుని బతుకుతున్నాం. గడిచిన 20 ఏళ్లుగా వచ్చిన ప్రతి నాయకుడికీ, అధికారికీ నా బాధ చెప్పుకుంటూనే ఉన్నాను. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం మాలాంటి పేదలందరిని గుర్తించి అధికారులే మా ఇంటికి వచ్చి నీకు స్థలాన్ని కేటాయిస్తున్నామని చెప్పడమే కాకుండా, నా పేరుతో రిజిస్ట్రేషన్ చేసి, మాకు కేటాయించిన స్థలాల్లో రోడ్లు పోసి, మెరకలు తోలి మరీ పట్టాలు ఇచ్చారు. ఇల్లు కూడా కట్టిస్తామని చెబుతున్నారు. మాలాంటి పేదల బతుకులు మార్చేందుకు ఆ దేవుడే జగన్మోహన్రెడ్డి రూపంలో ఈ రాష్ట్రానికి వచ్చాడన్నంత సంతోషంగా ఉంది. మేము బతికినంతకాలం ఆయన చేసిన మేలు మరువం.’’ బాపట్ల మండలం నరసాయపాలెంకు చెందిన నంగనం పద్మ భావోద్వేగం ఇది. -
కూరగాయలు సెంచరీ కొట్టేశాయ్‌గా..
సాక్షి, బాపట్ల(గుంటూరు) : కూరగాయల సంచిలో ధరల కుంపటి రగులుతోంది. రూ. 500 తీసుకెళ్తే సగం సంచి కూడా నిండని పరిస్థితుల్లో వంటింటిలో ధరల మంటలు చెలరేగుతున్నాయి. కొండెక్కి కూర్చున్న కూరగాయల ధరలు దిగిరానుంటున్నాయ్. నిత్యావసరాలు సెంచరీ కొట్టేశాయ్. వర్షాభావ పరిస్థితులు ఓ కారణమైతే.. కృత్రిమ కొరత చూపిస్తున్న వ్యాపారులు సామాన్యుడి జీవితంతో చెలగాటమాడుతున్నారు. ఏంకొనేట్లు లేదు...ఏంతినేట్లులేదంటూ సగటు జీవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. కూరగాయల ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశంకేసి దూసుకుపోతూ సామాన్యుడికి భారమవుతున్నాయి. ఈ ఏడాది వార్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతినడంతో ఆహారోత్పత్తులు అందుబాటులో లేవనే సాకు చూపి వ్యాపారులు రోజురోజుకూ ధరలను అమాంతం పెంచేస్తున్నారు. దీంతో సామాన్య ప్రజల ఇంట్లో పప్పులుడకడం లేదు. గంజినీళ్ళతో కడుపు నింపేసుకోవాల్సిన దుర్భర పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. కందిపప్పు రూ.100 నాటౌట్.. కందిపప్పు ధర చుక్కల్ని తాకుతోంది. నిన్న మొన్నటి వరకు కిలో రూ.70 ఉన్న కందిపప్పు ప్రస్తుత ధర రూ.100కు చేరుకుంది. రోజురోజుకీ ధర పెరుగుతోందే తప్ప కిందికి దిగడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో నెలలోపే రూ.150 కు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీంతో పాటు మిగిలిన నిత్యావసర సరుకుల ధరలు తారాజువ్వల్లా దూసుకుపోతున్నాయి. బహిరంగ మార్కెట్లో గతంలో రూ.80 నుంచి రూ.90 ఉన్న మినపపప్పు ప్రస్తుతం కిలో రూ.140 నుండి రూ.160 ల వరకు చేరింది. చింతపండు ధర కిలో రూ.150 దాటింది. ఇక నూనెలు సలసల కాగుతున్నాయి. శనగనూనె కిలో రూ.85ల నుండి రూ.90 ల వరకు ఉంది. విడిగా కిలో నూనె రూ.95కి చేరింది. నిత్యావసరాల్లో ఏది కొనాలన్నా వంద రూపాయలపైనే ఉంటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలదీ అదే తీరు.. నిత్యావసర వస్తువుల ధరలకు ఏమాత్రం తీసిపోనట్లుగా కూరగాయల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎండల ధాటికి కూరగాయల పంటలు ఎండిపోవడంతో దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ ప్రభావం ధరలపై పడి సామాన్యులు కొనలేని స్థితికి చేరుకున్నాయి. టమోటా కిలో రూ.60, బెండకాయలు కిలో రూ.40, బంగాళాదుంపలు కిలో రూ.40, పచ్చిమిరపకాయలు కిలో రూ.80 లుగా ఉన్నాయి. ఏ కూరగాయలు కొనాలన్నా కిలో రూ.30 కంటే దిగువన ఉండటం లేదు. దీంతో.. ఉన్న వాటితో సర్దుకుపోతున్నామని వినియోగదారులు చెబుతున్నారు. 500 రూపాయలు బజారుకు తీసుకెళ్తే కనీసం నాలుగు రోజులకు సరిపడా కూరగాయలు కూడా రావడంలేదని ఆవేదన చెందుతున్నారు. -
‘బెల్టు’ తీస్తేనే బతుకులు బాగు
సాక్షి,బాపట్ల : కుటుంబాల్ని కూల్చేస్తుంది.. చిన్నారుల్ని అనాథల్ని చేసేస్తుంది. ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తుంది. మొత్తంగా సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తోందీ మద్యం. ఎన్నో జీవితాల ఉసురు పోసుకుంటున్న మద్యాన్ని నిషేదిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మూలాల నుంచి ప్రక్షాళన చేసేందుకు బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపుతున్నారు. మరోవైపు మద్యం దుకాణాల లైసెన్సుల్ని తగ్గించే దిశగా రూపుదిద్దుకుంటున్న సర్కారు కార్యచరణపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మద్యం మహమ్మారితో మహిళలు పడుతున్న వేదనలను ప్రజాసంకల్ప యాత్రలో విన్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చలించారు. మద్యం మత్తుకు బానిసలైన మందు బాబులు సాయంత్రానికి తమ కష్టాన్ని తాగుడుకి తగలేస్తూ కుటుంబాలను పస్తులు పెడుతున్నారనే ఆవేదనలు.. మద్యం మత్తులో గొడవలు, ఘర్షణలకు దిగుతూ సంసారాలను వీధిన పెడుతున్న వేదనలు విన్న జగన్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నవరత్నాల పథకాల్లో పొందుపరిచిన హామీ అయిన మద్యం మహమ్మారిని పారదోలేందుకు సమాయత్తమయ్యారు. దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానంటూ ప్రకటించారు. బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపారు. పేద కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న బెల్టుషాపులను తొలగించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మద్యం వ్యాపారం ప్రభుత్వ ఆదాయంగా చూడొద్దని స్పష్టం చేశారు. అవసరమైతే బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేసే షాపుల లైసెన్సులను రద్దు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మద్య నిషేధానికి తొలి అడుగు వేయడంతో మహిళల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేస్తున్న మద్యం రక్కసిని నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కార్యచరణ రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్టుషాపులను పూర్తిగా నిర్మూలించడంతో పాటు మద్యం షాపులను దశల వారీగా తగ్గించి రానున్న ఐదేళ్ళ నాటికి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసేదిశగా అడుగులు వేస్తున్నారు. మామూళ్ల కోసం... గత ప్రభుత్వంలో ఎక్సైజ్, పోలీసు శాఖలు మద్యం వ్యాపారులకు సహకరించారు. బెల్టుదుకాణాల ఏర్పాటుకు అనధికారికంగా అనుమతులిచ్చేశారు. దీనికి ప్రతిఫలంగా ప్రతి నెలా ఆ రెండు శాఖల సిబ్బంది మామూళ్లు పుచ్చుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఎమ్మార్పీ ఉల్లంఘించినా పట్టించుకోకపోవడం.. కొత్తగా బెల్టుదుకాణాలు వెలుస్తున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరించేవారు. ఇకపై ఆ పరిస్థితి కనిపించదు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయించినా చర్యలు తీసుకునేందుకు ఎక్సైజ్ అధికారులు ముందుకొస్తున్నారు. ఇటీవల బాపట్లలోని పాతబస్టాండ్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఉదయం పూట మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు చర్యలు తీసుకున్నారు. బాపట్ల ప్రాంతంలోని స్టువర్టుపురంలో నాటు సారా తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. చాలా వరకు సారా తయారీ మానేసినప్పటికి ప్రకాశం జిల్లా నుంచి దిగుమతవుతోందనే విమర్శలు కూడా లేకపోలేదు. మద్యం మత్తులో మృత్యు ఒడిలోకి.. పూటుగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల మృతి చెందిన వారి సంఖ్య బాపట్ల నియోజకవర్గం బాపట్ల డివిజన్‌లోనే మొదటి స్థానంలో ఉంది. నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం మండలం కోమలిలో 2010 సంవత్సరం ట్రాక్టర్ డ్రైవర్ మద్యం సేవించి ట్రాక్టర్ నడపటం వలన శుభాకార్యానికి వెళ్తుతున్న 11మంది మృత్యువాత పడ్డారు. అదేవిధంగా 2011లో చందోలులో కారుడ్రైవర్ తప్పతాగి చెట్టుకు ఢీకొట్టడం వలన ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మరణించారు. 2018లో జమ్ములపాలెం ప్లైఓవర్ బ్రిడ్జి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బస్టాండ్ వద్ద పూటుగా మద్యం సేవించి ఆర్టీసీ బస్సును ఢీకొట్టి ఇద్దరు మృతి చెందారు. ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్ నుంచి సూర్యలంక సముద్రతీరానికి వచ్చి మద్యం సేవించి కారు నడుపుతూ అప్పికట్ల వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఇలా ఎంతో మంది కుటుంబాల ఉసురు తీస్తున్న మద్యాన్ని నిషేదించాలని పలువురు కోరుతున్నారు. -
వైద్యాధికారుల్లో వేటు భయం
బాపట్లటౌన్, న్యూస్‌లైన్: గర్భిణికి వైద్యం అందించేందుకు నిరాకరించిన స్థానిక ఏరియా వైద్యశాల వైద్యాధికారుల్లో గుబులు మొదలైంది. అందరినీ వేటు భయం వెంటాడుతోంది. పిట్టలవానిపాలెం మండలం మండేవారిపాలెం గ్రామానికి చెందిన నిరుపేద గర్భిణి ఇందిరకు ఈ నెల 25న పురిటి నొప్పులు వచ్చాయి. బంధువులు బాపట్ల ఏరియావైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు వైద్యం చేయలేదు. దీనిపై సోమవారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ స్పందించారు. విచారణ చేపట్టాల్సిందిగా జిల్లా ఆరోగ్యశాఖ కోఆర్డినేటర్‌ను ఆదేశించారు. డీసీ శ్రీదేవి మంగళవారం ఏరియా వైద్యశాలకు వచ్చారు. వివరాలు సేకరించారు. 25న ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యూటీలో ఎవరున్నారు.. గర్భిణికి ఎలాంటి వైద్యం అందించారు.. కేసును ఎందుకు రిఫర్ చేయాల్సి వచ్చింది.. అనేదానిపై దర్యాప్తు చేపట్టారు. రికార్డులు పరిశీలించాక సిబ్బంది అందరినీ దశలవారీగా విచారించారు. అందరి లోపం ఉంది అనంతరం ఆమె‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ ఘటనలో అందరి లోపం ఉందని, డ్యూటీలో ఉన్న డాక్టర్ ఆర్.విజయలక్ష్మి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కేసుకు సంబంధించి డాక్టర్ ఆర్.విజయలక్ష్మి, ఇద్దరు స్టాఫ్ నర్సులు, లేబర్ రూమ్ నర్సు, ఏఎన్ఎం, నర్సింగ్ సూపరింటెండెంట్, మెడికల్ సూపరింటెండెంట్ల నుంచి లిఖితపూర్వకంగా లెటర్లు తీసుకున్నామని, వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు. వేటుపైనే సర్వత్రా చర్చ ఈ కేసుకు సంబంధించి ఎవరిపై వేటు పడుతుందోనన్న భయం ఇప్పుడు వైద్యశాల సిబ్బందిని వెంటాడుతోంది. ఆస్పత్రిలో ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారింది. వైద్యాధికారి చేసిన తప్పుకు తాము ఏం చేస్తామంటూ కొందరు స్టాఫ్‌నర్సులు జిల్లా కోఆర్డినేటర్ ముందు బహిరంగంగానే వాపోయారు. విషయాలన్నీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని డీసీ చెప్పడంతో అటు నర్సులు, ఇటు వైద్యుల్లో కలవరం మొదలైంది. బాధ్యులపై వేటుపడితేనే వైద్యశాలకు మహార్దశ పడుతుందని రోగులు స్పష్టంచేస్తున్నారు. ఉద్యోగమంటే సంతకాలు చేసి వెళ్లడమా: డీసీ ఆగ్రహం ‘వచ్చినప్పుడల్లా వాగుతూనే ఉన్నా. మీలో మార్పు లేదు. జిల్లాలోనే బాపట్లలాంటి అధ్వానసెంటర్ను నేనెక్కడా చూడలేదు. కనీసం నెలలో నాలుగైదు సార్లు వస్తున్నా. మాకేం పనుల్లేక వస్తున్నారనుకుంటున్నారా. చెప్పిన వాటిలో ఒక్కపనినైనా కచ్చితంగా చేస్తున్నారా. ఉద్యోగం అంటే సంతకాలు చేసి వెళ్లిపోవడమా.’ అని శ్రీదేవి ఆస్పత్రి సిబ్బందిపై మండిపడ్డారు. ఆమె ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టాక ఆగ్రహం వ్యక్తంచేశారు. పది రోజుల కిందట తాను వచ్చినప్పుడు స్కానింగ్ సకాలంలో తీసేలా చూడాలని, ఫ్యాన్లకు మరమ్మతులు చేయించాలని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న కేసులు మినహా మిగిలిన అన్ని కేసులకు ఇక్కడే వైద్యసేవలు అందించాలని ఆదేశించినా.. ఒక్కటీ ఎందుకు అమలవడంలేదని సిబ్బందిని నిలదీశారు. నెలరోజులుగా ఆస్పత్రిలో ఎన్ని ఆపరేషన్లు చేశారు.. ఎన్ని కేసులు రిఫర్ చేశారనే విషయాలను రికార్డుల్లో రాశారా అని ప్రశ్నించారు.