నరసాయపాలెంలో తనకు కేటాయించిన ప్లాట్‌లో ఇంటిపట్టాను చూపిస్తున్న నంగనం పద్మ
సాక్షి, బాపట్లటౌన్: ‘‘నాది బాపట్ల మండలం, నరసాయపాలెం గ్రామం. నేను నరసాయపాలెం–కంకటపాలెం వెళ్లే దారిలో 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నా. నాకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. పిల్లలు పుట్టిన ఐదేళ్లకే నా భర్త అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటినుంచి ఇద్దరు పిల్లలను పెట్టుకొని కాలువకట్ట పక్కనే గుడిసెలో నివశిస్తూ ఉన్నాను. రెక్కల కష్టం మీదనే నా కూతురు, కొడుకుకు పెళ్లిళ్లు చేశాను. దేవుడికి కూడా నా మీద జాలి లేకుండా పోయింది. నా కొడుకుకు పెళ్లి చేసిన తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు. మనుడు పుట్టిన నాలుగేళ్లకే నా కొడుకు చనిపోయాడు. చిన్నప్పటి నుంచి మగ దిక్కులేని సంసారాన్ని ఈదుకొస్తున్నప్పటికీ నాకున్న ఏకైక కొడుకును కూడా దేవుడు పొట్టన పెట్టుకున్నాడు.
అప్పటినుంచి నేను, నా కోడలు అదే కాలువకట్ట వెంబడి నివాసం ఉంటూ కాయకష్టం చేసుకుని బతుకుతున్నాం. గడిచిన 20 ఏళ్లుగా వచ్చిన ప్రతి నాయకుడికీ, అధికారికీ నా బాధ చెప్పుకుంటూనే ఉన్నాను. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం మాలాంటి పేదలందరిని గుర్తించి అధికారులే మా ఇంటికి వచ్చి నీకు స్థలాన్ని కేటాయిస్తున్నామని చెప్పడమే కాకుండా, నా పేరుతో రిజిస్ట్రేషన్ చేసి, మాకు కేటాయించిన స్థలాల్లో రోడ్లు పోసి, మెరకలు తోలి మరీ పట్టాలు ఇచ్చారు. ఇల్లు కూడా కట్టిస్తామని చెబుతున్నారు. మాలాంటి పేదల బతుకులు మార్చేందుకు ఆ దేవుడే జగన్‌మోహన్‌రెడ్డి రూపంలో ఈ రాష్ట్రానికి వచ్చాడన్నంత సంతోషంగా ఉంది. మేము బతికినంతకాలం ఆయన చేసిన మేలు మరువం.’’ బాపట్ల మండలం నరసాయపాలెంకు చెందిన నంగనం పద్మ భావోద్వేగం ఇది.
Comments
Please login to add a commentAdd a comment