సాక్షి, గుంటూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఉనికి కోల్పోతామన్న భయంతోనే రాష్ట్రంలో ప్రతిపక్షం కులాల మధ్య చిచ్చు పెడుతోందని హోంమంత్రి మేకతోటి సుచరిత నిప్పులు చెరిగారు. ఆదివారం ఆమె గుంటూరు జిల్లా పేరేచర్లలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అశాంతి సృష్టించేందుకు ప్రతిపక్షం చేస్తున్న పనులు దురదృష్టకరమన్నారు.
‘‘ఇంత పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తున్నది ఒక్క జగన్ ప్రభుత్వమే. గుడిసెలు లేని రాష్ట్రం కావాలన్నదే మహానేత దివంగత వైఎస్సార్ ఆలోచన. పేదవారికి సొంతింటి కల నెరవేర్చాలన్నది సీఎం వైఎస్ జగన్ సంకల్పం. లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ దేశంలో చరిత్రగా నిలిచిపోతుంది. ప్రతి మహిళను లక్షాధికారి చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దే. ఆయన గొప్ప చరిత్రకు శ్రీకారం చుట్టారు. భూములు కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని’’ సుచరిత పేర్కొన్నారు. (చదవండి: లోకేష్‌ను హెచ్చరించిన మంత్రి కొడాలి)
కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాల పంపిణీ: శ్రీరంగనాథరాజు
కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్ పేరేచర్లలో ఏర్పాటు చేశామన్నారు. పేరేచర్లలో 18,482 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశామని తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీని ప్రతిపక్ష నేత కేసులు వేసి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు చరిత్ర హీనుడుగా నిలిచిపోతారని ధ్వజమెత్తారు. పేరేచర్ల లేఅవుట్‌ను మోడల్ లేఆవుట్‌గా తీర్చిదిద్దుతామని, రూ.7 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి శ్రీరంగనాథరాజు వెల్లడించారు.(చదవండి: రామతీర్థం ఆలయాన్ని పరిశీలించిన మంత్రులు)
ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబుకు ఇష్టం ఉండదు: మోపిదేవి
నవరత్నాల్లో ప్రధానమైన పథకం ఇళ్ల పట్టాల పంపిణీ అని వైఎస్సార్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. పాదయాత్రలో పేదల కష్టాలను వైఎస్ జగన్ చూశారని, ప్రజలంతా ఆనందంగా ఉండాలన్నదే ఆయన ఆలోచన అని పేర్కొన్నారు. అర్హులైన అందరికీ ఇళ్ల పట్టాల ద్వారా ఆస్తి హక్కు కల్పిస్తున్నామని, ఏడాదిన్నర కాలంలోనే అన్ని హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే చంద్రబాబు.. కులమతాల పేరుతో గొడవ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబుకు ఇష్టం ఉండదని మోపిదేవి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment