barakhath gudem
-
వృద్ధుల కన్నీటి గాథ: ఒక్కగానొక్క కొడుకు మృతి.. కిడ్నీలు ఫెయిల్.. పింఛనే ఆధారం
మునగాల: రెండు కిడ్నీలు చెడిపోవడంతో పాటు వయస్సు మీదపడడంతో కేవలం వృద్ధాప్య పింఛన్‌తోనే బతుకు వెళ్లదీస్తున్న వృద్ధ దంపతులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. వివరాలు.. మండలంలోని బరాఖత్‌గూడెం గ్రామానికి చెందిన జిల్లేపల్లి లచ్చయ్య (80), ఎల్లమ్మ (70) దంపతుల ఒక్కగానొక్క కుమారుడు పదేళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందాడు. నాటి నుంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా రెండేళ్ల కిందట లచ్చయ్యకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఇద్దరు ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్‌తోనే కాలం వెళ్లదీస్తున్నారు. కనీసం మందులు కొనుగోలు చేసే స్థోమత లేకపోవడంతో తమను దాతలు ఎవరైనా ఆదుకోవాలని ఈ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. మా ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదని భార్య ఎల్లమ్మ తెలిపింది. పింఛన్ పైసలతో పూట గడవడమే కష్టంగానే ఉందని వాపోయింది. ఆపన్నహస్తం అందించి ఆదుకుంటే రుణపడి ఉంటామని ఎల్లమ్మ చెబుతోంది. -
సీసీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
బరాఖత్‌గూడెం(మునగాల): మండంలోని బరాఖత్‌గూడెం గ్రామపంచాయతీలోని ఒకటవ వార్డులో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నిధలు నుంచి రూ.ఐదు లక్షలతో నిర్మించే సీసీరోడ్డు నిర్మాణపు పనులకు శనివారం జెడ్పీటీసీ సభ్యుడు కోల ఉపేందర్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే నిధులు నుంచి ఇప్పటికే లక్షల రూపాయల నిధులతో మండలంలోని పలు గ్రామాలలో సీసీరోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. జిల్లా పరిషత్ సమవేశాల్లో ఎప్పటికప్పుడు మండల సమస్యలను ప్రస్తావిస్తూ పరిష్కారానికి తన వంతు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కాలే జయమ్మ, ఎంపీటీసీ సభ్యులు అమరబోయిన మట్టయ్య యాదవ్, జిల్లా వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ వేనేపల్లి రమేష్, మాజీ సర్పంచ్ గడ్డం చంద్రారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలే సామియేలు, షేక్ హాబీబ్, గ్రామపెద్దలు ఎనుగుల నాగేశ్వరరావు, కాలే సామియేలు, మొలుగూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.