
మునగాల: రెండు కిడ్నీలు చెడిపోవడంతో పాటు వయస్సు మీదపడడంతో కేవలం వృద్ధాప్య పింఛన్‌తోనే బతుకు వెళ్లదీస్తున్న వృద్ధ దంపతులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. వివరాలు.. మండలంలోని బరాఖత్‌గూడెం గ్రామానికి చెందిన జిల్లేపల్లి లచ్చయ్య (80), ఎల్లమ్మ (70) దంపతుల ఒక్కగానొక్క కుమారుడు పదేళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందాడు. నాటి నుంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
కాగా రెండేళ్ల కిందట లచ్చయ్యకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఇద్దరు ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్‌తోనే కాలం వెళ్లదీస్తున్నారు. కనీసం మందులు కొనుగోలు చేసే స్థోమత లేకపోవడంతో తమను దాతలు ఎవరైనా ఆదుకోవాలని ఈ వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. మా ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదని భార్య ఎల్లమ్మ తెలిపింది. పింఛన్ పైసలతో పూట గడవడమే కష్టంగానే ఉందని వాపోయింది. ఆపన్నహస్తం అందించి ఆదుకుంటే రుణపడి ఉంటామని ఎల్లమ్మ చెబుతోంది.