పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. 8 రైళ్ళు రద్దు..
కాన్పూర్ః గూడ్స్ రైల్లోని నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో ప్రయాణించే అనేక రైళ్ళకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘజియాబాద్-తుండ్లా విభాగానికి చెందిన బర్హాన్-మిత్వాలి స్టేషన్ల మధ్య నడిచే 8 రైళ్ళు రద్దవ్వడంతోపాటు, రాజధాని సహా 14 రైళ్ళను దారి మళ్ళించాల్సి వచ్చినట్లు రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వారు పేర్కొన్నారు.
ఉదయం ఆరున్నర ప్రాంతంలో గూడ్స్ ట్రైన్ లోని నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతో ఆ సమయంలో ఆ మార్గంగుండా వచ్చే సీతాపూర్ సిటీ-కాన్పూర్ పాసింజర్ రైలు హార్డియో జిల్లాలోని బలామావ్ వద్ద నిలిపివేయగా... మరో ఎనిమిది పాసింజర్ రైళ్ళను పూర్తిగా రద్దు చేసినట్లు రైల్వే అధికారి అమిత్ మాల్వియా తెలిపారు. ఈ మార్గంలోని అప్ లైన్ లో వెళ్ళే గౌహతి-ఢిల్లీ రాజధాని, హౌరా-ఢిల్లీ రాజధాని, భువనేశ్వర్-ఢిల్లీ రాజధాని, సీల్దా-ఢిల్లీ రాజధాని, కాన్పూర్-ఢిల్లీ శతాబ్ది రైళ్ళను తుండ్లా-ఆగ్రా-పాల్వాల్ జంక్షన్ల మీదుగా మళ్ళించినట్లు మాల్వియా వెల్లడించారు. అలాగే డౌన్ లైన్లోని మరో ఏడు రైళ్ళను కూడా మార్గం మళ్ళించినట్లు తెలిపిన ఆయన.. ట్రాక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు.