ఆ పోలీసోళ్ల ఆశలపై ‘బాసర’ నీళ్లు!
ఖలీల్‌వాడి (నిజామాబాద్): ఏళ్ల నుంచి కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్న తమకు త్వరలో ప్రమోషన్లు వస్తాయనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. కొత్త జోనల్ వ్యవస్థతో జిల్లాకు చెందిన పలువురు కానిస్టేబుళ్లు పదోన్నతులకు దూరం అయ్యారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లకు పదోన్నతుల్లో బాసర జోన్ అడ్డంకిగా మారింది. బాసర జోన్ పరిధిలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో జిల్లాల వారిగా కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుల్ పదోన్నతులు కల్పించేది.
317 ఉత్తర్వుల మేరకు జిల్లా పోస్టులు జోనల్ పరిధిలోకి మారాయి. దీంతో ఇతర జిల్లాలకు చెందిన కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు లభించాయి. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతం కావడంతో కానిస్టేబుళ్ల భర్తీలో నిజామాబాద్ జిల్లా కంటే ఎక్కువ మందిని పోస్టుల్లోకి తీసుకుంటున్నారు. జిల్లాల విభజన సందర్భంగా సీనియార్టీ ప్రకారం విభజన జరిగిన జిల్లాలకు కేటాయించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒకే జిల్లాలో అత్యధికంగా కానిస్టేబుళ్లు ఉండటంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లకు పదోన్నతులు రాకుండా పోయాయి.
ఐదేళ్ల నుంచి నిరీక్షణ
జిల్లాలో 1999 బ్యాచ్‌కు చెందిన 80 మంది కానిస్టేబుళ్లుకు బాసర జోన్‌తో ప్రమోషన్ రాకుండా పోయింది. ఐదేళ్ల క్రితమే పదోన్నతి రావాల్సి ఉండేది. గతంలో ఏఆర్ కానిస్టేబుళ్లు, సివిల్ కానిస్టేబుళ్ల పదోన్నతుల విషయంలో ఐదేళ్లు కోర్టులో కేసు నడిచింది. దీంతో ఏఆర్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు ఇచ్చారు. సివిల్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు రాలే దు. అప్పుడే రావాల్సిన ప్రమోషన్ హైకోర్టుతో కేసు తో నిలిచిపోగా ఇప్పుడు బాసర జోన్‌తో పదోన్నతికి గండి పడింది. దీంతో ఈ బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు.
న్యాయం చేయాలని వేడుకోలు
హెడ్‌కానిస్టేబుళ్ల పదోన్నతిలో తమకు జరిగిన అన్యాయంపై 1999 బాŠయ్చ్ కానిస్టేబుళ్లు అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి న్యాయం చేయా లని కోరుతున్నారు. అడిషనల్ డీజీపీ(అడ్మిన్) శివ« దర్‌రెడ్డిని కలిసి ఈ సారి జిల్లాల వారిగా హెడ్‌కానిస్టేబుళ్లకు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని విన్నవించారు.
పదోన్నతిపై వచ్చి డిప్యుటేషన్‌పై వెళ్లారు
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సుమారు 80 మంది కానిస్టేబుళ్లు పదోన్నతిపై జిల్లాకు వచ్చారు. అనంతరం డిప్యుటేషన్‌పై సొంత జిల్లాకు వెళ్లిపోయా రు. దీంతో జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వారు వెళ్లిపోవడంతో ఇక్కడ ఉన్న కానిస్టేబుళ్లకు పనిభారం అవుతోంది. బందోబస్తులు, కేసులతో పాటు హెడ్‌కానిస్టేబుల్ పనులు భారంగా మారినట్లు తెలుస్తోంది. బాసర జోన్ నుంచి పదోన్నతులపై కానిస్టేబుల్స్ రావడంతో జిల్లాలో కానిస్టేబుళ్లలకు పదోన్నతలు లభించవు. అలాగే వారి స్థానంలో జిల్లా వారు పదోన్నతి పొంది ఉంటే కానిస్టేబుల్ పోస్టులు ఖాళీ అయ్యేవి. కానీ ప్రస్తుతం ఖాళీలు కాకపోవడంతో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది.