breaking news
Base camps
-
Papikondalu: అడవి తల్లికి గూర్ఖాలుగా బేస్ క్యాంప్ సిబ్బంది
బుట్టాయగూడెం(పశ్చిమ గోదావరి జిల్లా): అరణ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ నిత్యం సవాళ్లతో సావాసం చేసే అడవి తల్లి బిడ్డలు వారు. ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆ అడవిలో వణ్య ప్రాణుల సంరక్షణ, వేటగాళ్ల నుంచి విలువైన వృక్ష సంపదను రక్షించడమే వారి పని. పాపికొండల అభయారణ్యంలోని అణువణువూ జల్లెడ పట్టే బేస్ క్యాంప్ సిబ్బంది కుటుంబాలకు దూరంగా.. అడవి తల్లికి గూర్ఖాలుగా తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిసున్న బేస్‌క్యాంప్ సిబ్బందిపై ప్రత్యేక కథనం.. ఐదు బేస్ క్యాంప్‌లు ఏర్పాటు పాపికొండల అభయారణ్యం ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 1,012.86 చదరపు కిలోమీట్ల మేర విస్తరించింది. మొత్తం 1,01,200 హెక్టార్ల అటవీప్రాంతాన్ని 2008లో కేంద్రప్రభుత్వం జాతీయ పార్కుగా ప్రకటించింది. అటవీ సంరక్షణతో పాటు వన్యప్రాణి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా బుట్టాయగూడెం మండలం గుబ్బల మంగమ్మగుడి సమీపంలో ఒకటి, పోలవరం మండలం టేకూరు ప్రాంతంలో, గడ్డపల్లి సమీపంలో, పాపికొండల అభయారణ్య శివారు ప్రాంతంలో మరో రెండు బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి వాటిలో 25 మంది సిబ్బందిని నియమించారు. వీరంతా అటవీ, వన్యప్రాణి సంరక్షణ కోసం పగలూ రాత్రీ తేడాలేకుండా శ్రమిస్తున్నారు. తగ్గిన స్మగ్లింగ్ బేస్ క్యాంప్‌ల ఏర్పాటుతో అటవీప్రాంతంలో స్మగ్లింగ్ తగ్గుముఖం పట్టింది. గతంలో స్మగ్లర్లు గుట్టుచప్పుడు కాకుండా అటవీసంపదను తరలించేవారు. ప్రస్తుతం బేస్‌క్యాంప్‌లు ఏర్పాటు చేయడం వల్ల అక్రమ రవాణా అరికట్టారు. బేస్ క్యాంప్ సిబ్బంది రాత్రీ, పగలూ గస్తీ కాయడం వల్ల వన్యప్రాణులకు రక్షణ పెరిగిందని ఆ శాఖ అధికారులు అంటున్నారు. రాత్రి వరకూ అడవిలో గస్తీ బేస్‌క్యాంప్ సిబ్బంది అటవీప్రాంతంలో ఏర్పాటు చేసిన మంచె లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇళ్లల్లో ఉంటారు. వంట వార్పు మొత్తం అక్కడే. అప్పుడప్పుడు ఇళ్లకు వెళ్లడం తప్ప అడవే వారికి ప్రపంచం. అడవితల్లికి అండగా ఉంటూ చెట్లు నరికివేతకు గురికాకుండా, వన్యప్రాణుల్ని సంరక్షిస్తుంటారు. ఉదయం 6 గంటలకే నిద్రలేచి వంటావార్పూ సిద్ధం చేసుకుని అడవిలోకి బయల్దేరతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అటవీప్రాంతంలో తిరుగుతూ జంతువుల కదలికలను గుర్తిస్తారు. ఒక్కోసారి రాత్రి వరకూ అటవీప్రాంతంలోనే ఉంటారు. అడవిని నరుకుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి స్మగ్లర్ల ఆటకట్టిస్తారు. అడవిలో సాయంత్రం కాగానే పూర్తిగా నిర్మానుష్యంగా మారుతుంది. చీకటి పడగానే చిరుతలు, ఎలుగుబంట్లతో పాటు పలు జంతువుల అరుపులు వినిపిస్తుంటాయి. ఒక్కోసారి అవి పక్కనుంచి వెళ్తుంటాయి. రోజూ ఎన్నో జంతువులు కనిపిస్తాయి. అయినా వాటి మధ్య ధైర్యంగా బేస్‌క్యాంప్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. బేస్‌క్యాంప్ సిబ్బందిని అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియమిస్తారు. 25 కిలోమీట్ల వాకింగ్ టెస్ట్, హెల్త్ఫిట్నెస్ టెస్ట్ ద్వారా నియమిస్తారు. అడవి సింహాల్లా.. అటవీ ప్రాంతంలో బేస్ క్యాంప్ సిబ్బంది వన్యప్రాణుల మధ్య అడవి సింహాల్లా తిరుగుతుంటారు. ఒక్కోసారి రాత్రిపూట కూడా అడవికి కాపలా కాస్తారు. దీంతో స్మగ్లింగ్ తగ్గింది. పాపికొండల అభయారణ్యంలో ప్రస్తుతం 25 మంది బేస్‌క్యాంప్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, పాపికొండల వైల్డ్‌లైఫ్ మేనేజ్మెంట్ అధికారి జంతువులు కనిపిస్తే దాక్కుంటాం మేము దట్టమైన అటవీప్రాంతంలో తిరుగుతున్న సమయంలో మాకు అనేక అడవి జంతువులు కనిపిస్తాయి. ఆ సమయంలో అవి వెళ్ళిపోయే వరకూ చాటున దాక్కుంటాం. గొర్రగేదెలు, లేళ్లు, ఎలుగుబంట్లు వంటివి మాకు కనిపిస్తుంటాయి. వాటి సంరక్షణ మా బాధ్యత కనుక వాటికి కనిపించకుండా పహారా కాస్తాం. – సోయం వెంకటేశ్వరరావు, బేస్ క్యాంప్ సిబ్బంది, కొరుటూరు చేతి కర్ర, కత్తే ఆయుధం దట్టమైన అటవీప్రాంతంలో పహారా కాసే సమయంలో మా చేతిలో కర్ర, కత్తి మాత్రమే ఉంటాయి. అవే ఆయుధాలు. అవి కూడా ముళ్ల చెట్లు తొలగించడానికే తప్ప జంతువులకు హాని చేయడానికి కాదు. రాత్రీ, పగలూ తేడా లేకుండా కర్రతో శబ్దం చేస్తూ తిరుగుతుంటాం. – యండపల్లి బుచ్చన్న దొర బేస్ క్యాంప్ సిబ్బంది, సరుగుడు కష్టానికి తగ్గ జీతం ఇవ్వాలి మాలో డిగ్రీ వరకూ చదివిన వారు కూడా ఉన్నారు. మా గ్రామాలు అటవీప్రాంతంలో ఉండటం వల్ల బేస్ క్యాంప్‌లో చేరాం. ప్రస్తుతం మాకు జీతం, భోజన ఖర్చులు కలిపి నెలకు రూ. 10 వేల వరకూ ఇస్తున్నారు. మా కష్టానికి తగ్గట్లు జీతాలు పెంచాలి. అడవిలో ఉంటున్న రోజుల్లో మా భోజనానికే ఎక్కువ ఖర్చు అవుతుంది. – కొండ్ల సుధీర్, బేస్ క్యాంప్ సిబ్బంది, పోలవరం -
పీఓకేలో ఉగ్ర స్థావరాలు ధ్వంసం!
న్యూఢిల్లీ: కశ్మీర్లో అలజడి సృష్టించడమే లక్ష్యంగా ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాకిస్తాన్‌కు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని అనుమానిత ఉగ్రవాద స్థావరాలపై గురువారం విరుచుకుపడింది. భారత సైన్యం దాడిలో ముష్కరుల స్థావరాలు ధ్వంసమైనట్లు సమాచారం. వారికి భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు పీఓకేలో తిష్ట వేశారు. పాకిస్తాన్ సైనికుల అండతో భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి కుట్రలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. చలికాలం ప్రారంభం కావడానికంటే ముందే ఉగ్రవాదులను భారత్‌లోకి పంపాలని పాక్ విశ్వప్రయత్నాలు సాగిస్తోంది. భారత సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో పాక్ ఆటలు సాగడం లేదని అధికారులు వెల్లడించారు. పాక్ సైన్యం ఇటీవల తరచుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఎల్ఓసీ వద్ద భారత సైన్యంపై, పౌరులపై కాల్పులకు తెగబడుతోంది. భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్ సైన్యానికి హెచ్చరికలు పంపడంతోపాటు ఉగ్రవాదుల పీచమణచడమే లక్ష్యంగా భారత సైన్యం పీఓకేలో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. అయితే, నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద గురువారం ఎలాంటి కాల్పులు జరగలేదని సైనిక వర్గాలు స్పష్టం చేశాయి. -
పులుల మనుగడకు ప్రత్యేక చర్యలు
రుద్రవరం, న్యూస్‌లైన్ : నల్లమల్ల అడవిలో పులుల మనుగడ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా స్క్వాడ్, నంద్యాల ఇన్చార్జ్ డీఎఫ్ఓ చంద్రశేఖర్ తెలిపారు. చాగలమర్రి, అహోబిలం, రుద్రరవం అటవీ కార్యాలయాల సమీపంలోని బేస్ క్యాంపులు, చెక్ పోస్టులను సోషల్ ఫారెస్టు నర్సరీ, రుద్రవరం కార్యాలయ సమీపంలోని మరో నర్సరీని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఫారెస్టు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుండ్ల బ్రహ్మేశ్వరం అడవి నుంచి రుద్రరవం మీదుగా తిరుపతి వరకు అడవిని కారిడార్‌గా గుర్తించాలని ఉన్నతాధికారులకు నివేదికలు పంపినట్లు తెలిపారు. నంద్యాల అటవీ డివిజన్ పరిధిలో సీసీ కెమెరాల ద్వారా ఎనిమిది, పాదముద్రల ద్వారా మరో నాలుగు పెద్ద పులులున్నట్లు గుర్తించామన్నారు. వీటి మనుగడ కోసం రుద్రవరం, చెలిమా రేంజిలను కారిడార్లుగా గుర్తించి అడవిలోకి ఎవ రూ ప్రవేశించకుండా చర్యలు తీసుకునే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. నంద్యాల అటవీ డివిజన్ పరిధిలోని చెలిమా రేంజిలో 10 హెక్టార్లు, రుద్రవరం రేంజి పరిధిలో 30, బండి ఆత్మకూరు రేంజిలో 10 హెక్టార్లలో మొక్కల పెంపకానికి చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రశేఖర్ చెప్పారు. ఇందుకోసం నారవేపి, ఎర్రచందనం, ఊసరి, నల్లమద్ది, ఎగిసా, జుట్టేగా, రోజ్‌హుడ్ తదితర మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆయన వెంట రేంజర్ రాంసింగ్, డీఆర్ఓ సౌదర్యరాజు, సెక్షన్ ఆఫీసర్లున్నారు.