Batukhamma sarees distributed
-
తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ చీరల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) బ్రేక్ వేసింది. ఈ నెల 12న బతుకమ్మ పండుగ పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన చీరల పంపిణీ కార్యక్రమానికి సీఈసీ అనుమతి నిరాకరించింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. బతుకమ్మ చీరల పంపిణీకి ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తింపు అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ గత నెల 28న సీఈసీకి వివరణ కోరుతూ లేఖ రాయగా, కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ కేపీ సింగ్ బుధవారం ఈ మేరకు బదులిచ్చారు. ఈ విషయాన్ని రజత్ కుమార్ హైదరాబాద్‌లోని మీడియా ప్రతినిధులకు ధ్రువీకరించారు. రాష్ట్రంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఓటర్లకు ప్రలోభపెట్టేందుకు వ్యక్తిగత లబ్ధి కలిగించే బతుకమ్మ చీరలు, రైతు బంధు చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోందని విపక్ష పార్టీలు కాంగ్రెస్, టీడీపీలు సైతం పలుమార్లు రజత్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం రావడం గమనార్హం. చీరల ఉత్పత్తి ద్వారా రాష్ట్రంలోని చేనేత కార్మికులకు చేతి నిండా పని కల్పించడంతో పాటు తెలంగాణ పండుగ బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు ప్రభుత్వం ఉచితంగా చీరలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్త నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రకటించడంపై నిషేధం అమల్లో ఉంది. అయితే గతేడాదే ప్రారంభించిన చీరల పంపిణీ కార్యక్రమాన్ని పాత కార్యక్రమంగా పరిగణించి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తుందని రాష్ట్రంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం భావించింది. కానీ, అనూహ్య రీతిలో అనుమతి నిరాకరించడంతో ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇక గోదాముల్లోనే చీరలు ఈ ఏడాది రూ.280 కోట్ల వ్యయంతో బతుకమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. 90 లక్షల మంది తెల్ల రేషన్‌కార్డు కలిగిన 18 ఏళ్ల పేద మహిళలు ఈ కార్యక్రమానికి అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది పంపిణీ చేసిన చీరల నాణ్యత పట్ల మహిళల నుంచి అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో ఈ ఏడాది ప్రభుత్వం చీరల నాణ్యతపై ప్రత్యేక దృష్టిసారించింది. 80 రంగుల్లో జరీ బార్డర్‌తో వివిధ డిజైన్లలో 90 లక్షల చీరల తయారీ పనులను సిరిసిల్ల మరమగ్గాల కార్మికులకు అప్పగించింది. సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమల్లోని 121 మ్యాక్స్ సంఘాలు, మరమగ్గాల ఎస్ఎస్ఐ యూనిట్లకు సంబంధించిన 77 పరిశ్రమల్లో వస్త్ర ఉత్పత్తిని చేపట్టారు. సిరిసిల్లలోని 23,024 మరమగ్గాలపై 8500 మంది కార్మికులు గత 4 నెలలుగా రాత్రింబవళ్లు పని చేసి ఈ చీరలను తయారు చేస్తున్నారు. కనీసం ఒక్కో కార్మికుడికి ఈ కార్యక్రమం ద్వారా రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. బతుకమ్మ చీరల పంపిణీకి మరోవారం మాత్రమే ఉండగా, ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం నాటికి 53 లక్షల చీరలు జిల్లాల్లోని గోదాములకు చేరాయి. మరో ఐదారు రోజుల్లో మిగిలిన 37లక్షల చీరలను జిల్లాలకు సరఫరా చేసేందుకు చేనేత, జౌళి శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అడ్డురావడంతో ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసే వరకు చీరలు పంపిణీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఉత్పత్తి చేసిన చీరలను ఏం చేయాలన్న అంశంపై ప్రభుత్వం ఎన్నికల తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
అనాథాశ్రమాల్లోని మహిళలకూ బతుకమ్మ చీరలు
ఇప్పటివరకు 81 లక్షల చీరలు పంపిణీ.. సాక్షి, హైదరాబాద్: అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లోని మహిళలు, సామాజిక సేవా సంస్థల్లో పని చేస్తున్న మహిళలకు కూడా బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రిమాండ్‌లో ఉన్న మహిళా ఖైదీలకు సైతం ఇవ్వాలని మంత్రి కె.తారకరామారావు చేనేత, జౌళి శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్‌ను ఆదేశించారు. హైదరాబాద్‌లోని అనేక సేవా సంస్థలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల నుంచి బతుకమ్మ చీరల కోసం మంత్రికి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో చేనేత అధికారులతో మాట్లాడి వారందరికీ చీరల పంపిణీ చేయాలని కేటీఆర్ నిర్ణయించారు. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లాల్లో కలెక్టర్లు వివిధ సేవా సంస్థలకు చీరలను అందించనున్నారు. రాష్ట్రంలో మూడో రోజు నాటికి 81,08,790 బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది. గురువారం 9,47,347 చీరలను పంపిణీ చేశారని మంత్రి కేటీఆర్ కార్యాలయం తెలిపింది. మొత్తం 1,04,57,610 చీరలకు గాను 81,08,790 చీరల పంపిణీ పూర్తి కావడంతో ఇంకా 23,48,820 చీరల స్టాక్ మిగిలి ఉంది. ఇప్పటివరకు 77.41 శాతం చీరల పంపిణీ పూర్తయింది.