
ఇప్పటివరకు 81 లక్షల చీరలు పంపిణీ..
సాక్షి, హైదరాబాద్: అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లోని మహిళలు, సామాజిక సేవా సంస్థల్లో పని చేస్తున్న మహిళలకు కూడా బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రిమాండ్‌లో ఉన్న మహిళా ఖైదీలకు సైతం ఇవ్వాలని మంత్రి కె.తారకరామారావు చేనేత, జౌళి శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్‌ను ఆదేశించారు. హైదరాబాద్‌లోని అనేక సేవా సంస్థలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల నుంచి బతుకమ్మ చీరల కోసం మంత్రికి విజ్ఞప్తులు వచ్చాయి.
దీంతో చేనేత అధికారులతో మాట్లాడి వారందరికీ చీరల పంపిణీ చేయాలని కేటీఆర్ నిర్ణయించారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్, జిల్లాల్లో కలెక్టర్లు వివిధ సేవా సంస్థలకు చీరలను అందించనున్నారు. రాష్ట్రంలో మూడో రోజు నాటికి 81,08,790 బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది. గురువారం 9,47,347 చీరలను పంపిణీ చేశారని మంత్రి కేటీఆర్ కార్యాలయం తెలిపింది. మొత్తం 1,04,57,610 చీరలకు గాను 81,08,790 చీరల పంపిణీ పూర్తి కావడంతో ఇంకా 23,48,820 చీరల స్టాక్ మిగిలి ఉంది. ఇప్పటివరకు 77.41 శాతం చీరల పంపిణీ పూర్తయింది.