Bc college
-
వసతి..దుర్గతి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని బీసీ కళాశాల వసతిగృహాల్లో ఆకలికేకలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి విడుదల చేయాల్సిన బడ్జెట్‌ను ఏడాది పైగా పెండింగ్ పెట్టింది. దీంతో ఎక్కడి బిల్లులు అక్కడే ఆగిపోయాయి. బియ్యం మాత్రమే ప్రభుత్వం సరఫరా చేస్తోంది. మిగిలిన సరుకులన్నీ బయటి మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. భవనాలకు అద్దెలు చెల్లించాలని యజమానులు ఒకవైపు ఒత్తిడి చేస్తుండగా, వెంటనే బిల్లులు చెల్లించకుంటే కరెంటు కట్ చేస్తామని ఆ శాఖ అధికారులు మరోవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కనీసం కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలకు కూడా డబ్బు చెల్లించలేక వసతి గృహ సంక్షేమాధికారులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా బీసీ కళాశాల సంక్షేమ వసతిగృహాలకు నయాపైసా బడ్జెట్ విడుదల చేయలేదు. డైట్ బిల్లులే రూ.1,89,85,484 పెండింగ్ పడ్డాయి. విద్యుత్ బిల్లులకు రూ.10 లక్షలను విడుదల చేయాల్సి ఉంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల వసతి సౌకర్యాలు చూడడానికి సంబంధిత అధికారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేవలం బియ్యం ఇచ్చి సర్కారు సరిపెట్టుకుంటోంది. పలు సరుకుల సరఫరాకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదు. దీంతో వారు కొన్ని సరుకులను నాణ్యత లేనివి సరఫరా చేస్తున్నారు. అలాగే అనేక మంది వసతిగృహ సంక్షేమాధికారులు బయటి మార్కెట్ నుంచి సరుకులు కొనుగోలు చేస్తున్నారు. నెలల తరబడి డైట్ చార్జీలు విడుదల కాకపోవడంతో సంబంధిత షాపుల యజమానులు కూడా సరుకులను అప్పుగా ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారని వార్డెన్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అధిక వడ్డీలకు అప్పు చేసి వసతిగృహాలను నిర్వహిస్తున్నట్లు వారు చెబుతున్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటికి అద్దెలు విడుదల చేయకపోవడంతో యజమానులు ఒత్తిడి తెస్తున్నారు. అలాగే విద్యుత్ బిల్లులు ప్రతి నెలా చెల్లించకపోవడంతో సంబంధిత శాఖ సిబ్బంది పలుమార్లు కనెక్షన్ కట్ చేస్తున్నారు. ఎన్ని వసతిగృహాలు, ఎంత పెండింగ్ ... జిల్లాలో 28 బీసీ కళాశాల వసతిగృహాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 4,400 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీటికి డైట్ చార్జీలు రూ.1.89 కోట్లు, విద్యుత్ బిల్లులు రూ.10 లక్షలు, అద్దెలు రూ.1.20 కోట్లు, టెలిఫోన్ బిల్లులు రూ.2.85 లక్షలు, ఓఓఈ (అదర్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్) రూ.4.30 లక్షలు, మెటీరియల్ సప్లయ్‌కు గాను రూ.2 లక్షలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నేటి (ఈ నెల 20)లోపు బడ్జెట్ విడుదల చేయకుంటే, ఇప్పటికే ట్రెజరీకి వెళ్లిన బిల్లులన్నీ వెనక్కి వచ్చే ప్రమాదముంది. బడ్జెట్ విడుదలయ్యే అవకాశాలున్నాయి నేటిలోగా బడ్జెట్ విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే అవసరమైన బిల్లులన్నీ ట్రెజరీకి పంపాం. ఏడాది కాలంగా బీసీ వసతిగృహాలకు బిల్లులు పెండింగ్ ఉన్న మాట వాస్తవమే. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫ్రీజింగ్ ఉన్న కారణంగా బిల్లులు మంజూరు కాలేదు. బిల్లులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ద్వారా తమ శాఖ డైరెక్టర్‌కు గత నెలలో నివేదికలు పంపాము. – కె.లాలాలజపతిరావు, ఇన్చార్జ్ డీబీసీడబ్ల్యూఓ కోర్టు నోటీసులు పంపించారు ఏడాదిగా అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని కోర్టు నోటీసు పంపారు. వెంటనే అద్దె చెల్లించాలని, లేని పక్షంలో ఖాళీ చేయాలని జిల్లా బీసీ సంక్షేమాధికారికి పంపిన నోటీసులో పేర్కొన్నారు. అద్దె దాదాపు రూ.6 లక్షలు, విద్యుత్ బిల్లులు రూ.లక్ష, డైట్ బిల్లులు రూ.10 లక్షల వరకు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికే పలు చోట్ల అప్పులు చేశాం. ఇంకా ఎక్కడి నుంచి తేవాలో తెలియడం లేదు. కూరగాయలు, గుడ్లు, అరటి పండ్లు తదితర వాటికి కూడా డబ్బు చెల్లించలేని స్థితిలో ఉన్నాం. – కె.హారతీదేవి, బీసీ బాలికల వసతిగృహం సంక్షేమాధికారిణి, కర్నూలు రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంది 14 నెలలుగా అద్దె దాదాపు రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంది. భవన యజమాని ఒత్తిడి చేస్తున్నారు. 2017 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు రూ.12 లక్షల డైట్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. రూ.2లక్షలు విద్యుత్ బిల్లులు వెంటనే చెల్లించాలని ఆ శాఖ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఏడాది కాలంగా అప్పులు చేసి విద్యార్థులకు భోజనం పెట్టాం. పలుమార్లు సమస్యను జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లాం. – ఎన్.గిరిజాదేవి, పాణ్యం బీసీ బాలుర హెచ్‌డబ్ల్యూఓ -
ఎల్ఎండీలో బీసీ బాలికల గురుకుల కళాశాలకు అనుమతి
తిమ్మాపూర్: ఎల్ఎండీలోని మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల(బాలికలు)ను జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 16 బీసీ గురుకుల పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయగా.. జిల్లాలో ఎల్ఎండీలోని బాలికల గురుకుల పాఠశాల ఒకటి. 2016–17 విద్యా సంవత్సరంలోనే జూనియర్ కళాశాల ప్రారంభమవుతుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. తిమ్మాపూర్‌లోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలను కళాశాలగా అప్‌గ్రేడ్ చేయడంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకోనున్నట్లు ప్రిన్సిపాల్ నాగభూషణం తెలిపారు. ఒక్కో కోర్సులో 40 సీట్లు భర్తీ చేస్తామని, వీటికి ఇప్పటికే రాత పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. అయితే ఆగస్టులో జూనియర్ కళాశాల మొదటి సంవత్సరం తరగతుల నిర్వహించాల్సి ఉందని చెప్పారు. పక్కా భవనంలో గదులు లేని కారణంగా భవనం అద్దెకు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలిపారు. -
ఇక ఆన్లైన్లో బీసీ కాలేజీ హాస్టళ్ల అడ్మిషన్లు
హైదరాబాద్: బీసీ కాలేజీ హాస్టళ్ల అడ్మిషన్ల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పటిష్టం చేయనుంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ విద్యా సంవత్సరం (2015-16) నుంచి బీసీ కాలేజీ హాస్టళ్ల అడ్మిషన్లను ఆన్లైన్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని కోసం ఒక వెబ్‌సైట్‌ను రూపొందించాలని భావి స్తున్నారు. బీసీ కులాల ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఒక కాలేజీ హాస్టల్లో ఉంటూ మరోచోట డే స్కాలర్‌గా కొనసాగే అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. కాలేజీ హాస్టళ్లలో ప్రవేశాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనున్నారు. మెరిట్ ఆధారంగా అన్ని బీసీ కులాలకు సమాన ప్రాతినిధ్యం లభించేలా చూడాలని భావిస్తున్నారు. హాస్టళ్లలో ప్రవేశానికి ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాన్ని మరింత పటిష్టం చేసేవిధంగా నియమ, నిబంధనలను రూపొందిస్తున్నారు. ఒకే రిజర్వేషన్ విధానానికి రూపకల్పన ప్రస్తుతం బీసీ స్టడీ సెంటర్లు, గురుకుల పాఠశాలలు, ప్రీ, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో వివిధ రకాల రిజర్వేషన్ విధానాలను అనుసరిస్తున్న విషయం తెలిసిందే. వీటన్నింటిలో ఒకే విధమైన రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. వీటిల్లో బీసీలకు 80-85 శాతం వరకు సీట్లు కేటాయించి, ఎస్సీ, ఎస్టీ, ఇతరులను మిగతా 20 శాతంలో సర్దుబాటు చేయాలనే ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. ప్రస్తుతం స్టడీ సర్కిళ్లలో బీసీలకు 66 శాతం, రెసిడెన్షియల్ స్కూళ్లలో 69 శాతం, ప్రీ, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో 76 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. వీటిలో మిగిలిన కోటాలను ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాలకు కేటాయిస్తున్నారు. దీనివల్ల బీసీ వర్గాలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదని, అందువల్ల ఒకే విధమైన రిజర్వేషన్ విధానానికి అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. దీనికి ప్రభుత్వస్థాయిలో ఆమోదముద్రపడాల్సి ఉంది. -
మూసేస్తాం..
•నిధులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన కళాశాలల హెచ్‌డబ్ల్యూఓలు •ఓపిక పట్టాలన్న డీబీసీడబ్ల్యూఓ •జిల్లాలో బకాయిలు రూ.2.05 కోట్లు కర్నూలు(అర్బన్) : బీసీ కళాశాల వసతి గృహాలకు వెంటనే పెండింగ్‌లో ఉన్న బడ్జెట్‌ను విడుదల చేయకుంటే హాస్టళ్లను మూసి వేస్తామని బీసీలోని బీసీ కళాశాల వసతి గృహ సంక్షేమాధికారులు తెగేసి చెప్పారు. బుధవారం 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 28 మంది హెచ్‌డబ్ల్యూఓలు జిలా బీసీ సంక్షేమాధికారి బి. సంజీవరాజును కలిసి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా వివరించారు. 2014 ఆగష్టు నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్‌ను విడుదల చేయకపోవడంతో ఒక్కో హెచ్‌డబ్ల్యూఓ లక్షల రూపాయల్లో అప్పులు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన డైట్‌కు కూడా బడ్జెట్ విడుదల చేయకుంటే సరుకులు ఎక్కడి నుంచి తెచ్చి వండి పెట్టాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యం మాత్రం ప్రభుత్వం సరఫరా చేస్తుండగా, మిగిలిన ఉప్పు, పప్పు, చింతపండు, కారం, నూనె, కూరగాయలు, పాలు, పెరుగు, కోడిగుడ్లు తదితర సరుకులన్నింటిని బయటి మార్కెట్ నుంచి కొనుగోలు చేయాల్సిందేనన్నారు. అప్పులు చేసి నిత్యావసర సరుకులను కొనుగోలు చేయడమే కష్టంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి యజమానులు అద్దెలు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు. విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే కనెక్షన్లు కట్ చేస్తామని విద్యుత్‌శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా బడ్జెట్‌ను విడుదల చేయకుంటే వసతి గృహాలను నడపలేమని వారు స్పష్టం చేశారు. దీంతో జిల్లా బీసీ సంక్షేమాధికారి బి. సంజీవరాజు వెంటనే బీసీ సంక్షేమశాఖ డెరైక్టరేట్‌కు ఫోన్ చేసి జిల్లాలోని బీసీ కళాశాలలకు చెందిన బడ్జెట్ విడుదలపై వాకబు చేశారు. ఒక వారం రోజులు ఓపిక పడితే బడ్జెట్ విడుదల చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చినట్లు చెప్పారు. దీంతో ఈ నెల 20వ తేదీలోగా బడ్జెట్ విడుదల కాకపోతే హాస్టళ్లకు తాళాలు వేసి జిల్లా అధికారికి అందజేస్తామని హెచ్‌డబ్ల్యూఓలు చెప్పారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమాధికారి మాట్లాడుతూ.. డైట్, ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లులు కలిపి సెప్టెంబర్ నుంచి జనవరి వరకు మొత్తం రూ.2,05,62,095 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. డైట్‌కు రూ.1,72,18,740, ఇంటి అద్దెలు రూ.29,13,355, విద్యుత్ బిల్లులు రూ. 4,30,000లను చెల్లించాల్సి ఉందన్నారు.