హైదరాబాద్: బీసీ కాలేజీ హాస్టళ్ల అడ్మిషన్ల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పటిష్టం చేయనుంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ విద్యా సంవత్సరం (2015-16) నుంచి బీసీ కాలేజీ హాస్టళ్ల అడ్మిషన్లను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని కోసం ఒక వెబ్‌సైట్‌ను రూపొందించాలని భావి స్తున్నారు. బీసీ కులాల ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఒక కాలేజీ హాస్టల్‌లో ఉంటూ మరోచోట డే స్కాలర్‌గా కొనసాగే అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. కాలేజీ హాస్టళ్లలో ప్రవేశాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనున్నారు. మెరిట్ ఆధారంగా అన్ని బీసీ కులాలకు సమాన ప్రాతినిధ్యం లభించేలా చూడాలని భావిస్తున్నారు. హాస్టళ్లలో ప్రవేశానికి ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాన్ని మరింత పటిష్టం చేసేవిధంగా నియమ, నిబంధనలను రూపొందిస్తున్నారు.
ఒకే రిజర్వేషన్ విధానానికి రూపకల్పన
ప్రస్తుతం బీసీ స్టడీ సెంటర్లు, గురుకుల పాఠశాలలు, ప్రీ, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో వివిధ రకాల రిజర్వేషన్ విధానాలను అనుసరిస్తున్న విషయం తెలిసిందే. వీటన్నింటిలో ఒకే విధమైన రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. వీటిల్లో బీసీలకు 80-85 శాతం వరకు సీట్లు కేటాయించి, ఎస్సీ, ఎస్టీ, ఇతరులను మిగతా 20 శాతంలో సర్దుబాటు చేయాలనే ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు.
ప్రస్తుతం స్టడీ సర్కిళ్లలో బీసీలకు 66 శాతం, రెసిడెన్షియల్ స్కూళ్లలో 69 శాతం, ప్రీ, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో 76 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. వీటిలో మిగిలిన కోటాలను ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాలకు కేటాయిస్తున్నారు. దీనివల్ల బీసీ వర్గాలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదని, అందువల్ల ఒకే విధమైన రిజర్వేషన్ విధానానికి అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. దీనికి ప్రభుత్వస్థాయిలో ఆమోదముద్రపడాల్సి ఉంది.
ఇక ఆన్‌లైన్‌లో బీసీ కాలేజీ హాస్టళ్ల అడ్మిషన్లు
Published Fri, May 22 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM
Advertisement
Advertisement