hostels admissions
-
కాలేజీ హాస్టళ్లలో కొత్త అడ్మిషన్లు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లో కొత్త అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కోవిడ్–19 నేపథ్యంలో మూతబడ్డ సంక్షేమ వసతి గృహాలు ఈనెల 18 నుంచి పునఃప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పోస్టుమెట్రిక్ హాస్టళ్లు మాత్రమే తెరుచుకోగా, వీటిలో కాలేజీ విద్యార్థులు వసతి పొందుతున్నారు. 2020–21 విద్యా సంవత్సరంలో కోర్సు ముగిసిన విద్యార్థులు హాస్టల్ నుంచి రిలీవ్ కాగా.. వారి స్థానంలో ఫ్రెషర్స్‌కు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు సంబంధించి 550 పోస్టుమెట్రిక్ వసతి గృహాలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 1.5 లక్షల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. తాజాగా ఈ హాస్టళ్లలో నూతన అడ్మిషన్లకు ప్రభుత్వం ఆమోదించడంతో దాదాపు 40 వేల మంది విద్యార్థులకు అవకాశం కలగనుంది. ఏయే హాస్టల్లో ఎంతమందికి ప్రవేశాలు కల్పించాలనే దానిపై క్షేత్ర స్థాయిలో అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భౌతిక దూరానికి ప్రాధాన్యం..: ఒక్కో కాలేజీ హాస్టల్లో 150 నుంచి 220 మంది వరకు విద్యార్థులు వసతి పొందుతున్నారు. పెద్ద భవనం, అధిక సంఖ్యలో గదులున్న చోట ఎక్కువ మంది విద్యార్థులుండగా.. చిన్నపాటి భవనాల్లోని హాస్టళ్లలో 120 నుంచి 150 మంది విద్యార్థులుంటున్నారు. వసతి గృహాల్లో భౌతిక దూరానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో గది విస్తీర్ణాన్ని బట్టి విద్యార్థుల సంఖ్యను ఖరారు చేయాలని సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు పంపారు. ఈ నేపథ్యంలో వసతి గృహ సంక్షేమాధికారులు శనివారం నాటికి ప్రతిపాదనలు రూపొందించి ఆయా జిల్లాల సంక్షేమాధికారులకు పంపినట్లు సమాచారం. వీటికి జిల్లా సంక్షేమ శాఖ అధికారుల ఆమోదం లభించిన తర్వాత కొత్త అడ్మిషన్లు ప్రారంభిస్తారు. అలాగే ప్రీ మెట్రిక్ హాస్టళ్ల ప్రారంభంపైనా అధికారులు దృష్టి సారించారు. వచ్చేనెల 1 నుంచి వీటిని ప్రారంభించేలా అధికారులు ప్రణాళికలు తయారు చేసి రాష్ట్ర కార్యాలయానికి నివేదించారు. -
ఇక ఆన్లైన్లో బీసీ కాలేజీ హాస్టళ్ల అడ్మిషన్లు
హైదరాబాద్: బీసీ కాలేజీ హాస్టళ్ల అడ్మిషన్ల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పటిష్టం చేయనుంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ విద్యా సంవత్సరం (2015-16) నుంచి బీసీ కాలేజీ హాస్టళ్ల అడ్మిషన్లను ఆన్లైన్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని కోసం ఒక వెబ్‌సైట్‌ను రూపొందించాలని భావి స్తున్నారు. బీసీ కులాల ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఒక కాలేజీ హాస్టల్లో ఉంటూ మరోచోట డే స్కాలర్‌గా కొనసాగే అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. కాలేజీ హాస్టళ్లలో ప్రవేశాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనున్నారు. మెరిట్ ఆధారంగా అన్ని బీసీ కులాలకు సమాన ప్రాతినిధ్యం లభించేలా చూడాలని భావిస్తున్నారు. హాస్టళ్లలో ప్రవేశానికి ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాన్ని మరింత పటిష్టం చేసేవిధంగా నియమ, నిబంధనలను రూపొందిస్తున్నారు. ఒకే రిజర్వేషన్ విధానానికి రూపకల్పన ప్రస్తుతం బీసీ స్టడీ సెంటర్లు, గురుకుల పాఠశాలలు, ప్రీ, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో వివిధ రకాల రిజర్వేషన్ విధానాలను అనుసరిస్తున్న విషయం తెలిసిందే. వీటన్నింటిలో ఒకే విధమైన రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. వీటిల్లో బీసీలకు 80-85 శాతం వరకు సీట్లు కేటాయించి, ఎస్సీ, ఎస్టీ, ఇతరులను మిగతా 20 శాతంలో సర్దుబాటు చేయాలనే ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. ప్రస్తుతం స్టడీ సర్కిళ్లలో బీసీలకు 66 శాతం, రెసిడెన్షియల్ స్కూళ్లలో 69 శాతం, ప్రీ, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో 76 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. వీటిలో మిగిలిన కోటాలను ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాలకు కేటాయిస్తున్నారు. దీనివల్ల బీసీ వర్గాలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదని, అందువల్ల ఒకే విధమైన రిజర్వేషన్ విధానానికి అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. దీనికి ప్రభుత్వస్థాయిలో ఆమోదముద్రపడాల్సి ఉంది.